డ్రాగన్‌పై పట్టుకు ట్రంప్ స్కెచ్: వాంగ్‌జో భవితవ్యం ప్రశ్నార్థకమేనా?
డ్రాగన్ పై పట్టుకోసం ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మంచి అవకాశమే లభించినట్లు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్ మేజర్ హువావే అనుబంధ సంస్థ వ్యాపారాన్ని ఇరాన్‌లో చేపట్టడంతోనే ఆంక్షలు ఉల్లంఘించారని, అమెరికన్ల భద్రతకు ముప్పు ఉన్నదన్న సాకుతో ఆమెను 30 ఏళ్ల పాటు జైలు పాల్జేసేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమవుతున్నది
మెంగ్ వాంగ్‌జో.. చైనా టెలికం దిగ్గజం హువావే సీఎఫ్‌వో. ఇంతకుమించి హువావే వ్యాపార సామ్రాజ్య యువరాణి. కానీ ఇప్పుడు పరాయి దేశంలో బంధీ. మెంగ్ వాంగ్‌జోను కెనడా అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
హువాయ్ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్‌ఫేకుమార్తె. ఆమె హువావే సంస్థ అనుబంధ సంస్థ స్కై క్యామ్ ఇరాన్‌లో వ్యాపారం చేయడానికి అనుమతినించడమే మొదటికే మోసం తెచ్చింది. ఇప్పటి వరకు సాకు కోసం చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనాపై వాణిజ్య యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో హువావీ సీఎఫ్‌వో మెంగ్ వాంగ్‌జో ఓ పావుగా మారింది.
చైనాపై ఉన్న ఆగ్రహాన్ని అమెరికా హువావేపై చూపిస్తున్నదా? అన్న అనుమానాలు బలంగా కలుగుతున్నాయి మరి. ఆమె ఇరాన్ విషయంలో మోసగించారని, వాణిజ్య ఆంక్షలను ఉల్లంఘించారని అమెరికా పోలీసులు అభియోగాలు మోపనున్నారనీ టెక్‌క్రంచ్ నివేదించింది.
హువావేతో దేశ భద్రతకు ముప్పు ఉందని భావిస్తున్న అమెరికా , ఇప్పటికే ఇరాన్ మీద ఆంక్షలను ఉల్లంఘిస్తున్న అంశంపై హువావే మీద విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో తమ దేశ భద్రతకు ముప్పు తెచ్చి పెట్టేలా చైనా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలపై హువావేకు అనేక హెచ్చరికలను కూడా జారీ చేసింది.
ఈ నేపథ్యంలో కెనడా కోర్టు అనుమతితో అమెరికాకు తరలిస్తే ఈ కేసులో మెంగ్‌కు కనీసం 30 ఏళ్ల కారాగార శిక్ష తప్పదని వ్యాఖ్యానించింది. ఇప్పటికే అమెరికాలో హువావే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంపై ఆంక్షలు ఉన్నాయి.
చైనాకు హువావే గూఢచర్యం చేస్తున్నదన్న ఆరోపణల మధ్య ఇరాన్‌పై తాము విధించిన ఆంక్షలను ఉల్లంఘించిందంటూ ఆ సంస్థపై అమెరికా దర్యాప్తు చేస్తుండటం అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ క్రమంలో అమెరికా విజ్ఞప్తి మేరకు మెంగ్ వాంగ్‌జోను కెనడా అరెస్టు చేయడం మరింత ఆసక్తిని రేకెత్తించింది.
హువావే భావి అధినేత్రిగా ఉన్న మెంగ్ వాంగ్‌జో ఇప్పుడు నిర్బంధానికి గురైంది మరి. ఆమెను అప్పగించాలని అమెరికా కోరుతుండటం.. చైనాతో వాణిజ్య యుద్ధం పరిస్థితులను తీవ్రరూపం దాల్చేలా చేస్తున్నాయి.
మరోవైపు హువావేకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించింది. హువావేకు మెంగ్ వాంగ్‌జో నాయకత్వంపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. డ్రాగన్‌ను దెబ్బతీ యాలన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన ఎత్తులకు వాంజూ బలైంది.
స్మార్ట్‌ఫోన్ తయారీ మార్కెట్‌లో అమెరికా సంస్థ యాపిల్‌ను వెనుకకు నెట్టిన హువావే.. ప్రస్తుతం శామ్‌సంగ్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నది. 90 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఫార్చూన్ గ్లోబల్ 500 సంస్థల్లో 72వ స్థానంలో ఉన్నది.
మెంగ్ వాంగ్‌జో అరెస్టు నేపథ్యంలో ఆమె తండ్రి, హువావే గ్రూప్ అధినేత రెన్ ఆందోళనకు గురవుతున్నారు. ఆమె భవితవ్యం ఎటూ తేలకుండా ఉండటంతో ప్రపంచ మార్కెట్లలోనూ ప్రకంపనలు ఏర్పడుతున్నాయి.
హువావే సీఎఫ్‌వో మెంగ్ వాంగ్‌జో అరెస్టును చైనా అధికారిక మీడియా తీవ్రంగా ఖండించింది. ఇది ముమ్మాటికి అగ్రరాజ్య నీతిలేని చర్యగా అభివర్ణించింది. మెంగ్ వాంగ్‌జోను అప్పగించాలని కెనడాను అమెరికా కోరుతుండటం సరైనది కాదని మండిపడింది.
అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో కుదిరిన సంధి ప్రయోజనాలు దెబ్బతినగలవని హెచ్చరించింది. ఈ రకమైన దుశ్చర్యలతో ట్రంప్ అనుకున్నది సాధించలేరని వ్యాఖ్యానించింది. మెంగ్ వాంగ్‌జోను తక్షణం వదిలి పెట్టాలని కెనడాను చైనా కోరింది.
మెంగ్ వాంగ్‌జోను అరెస్టు చేయడాన్ని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడూ సమర్థించుకున్నారు. అమెరికా సూచనలతోనే మెంగ్ వాంగ్‌జోను అదుపులోకి తీసుకున్నారన్న వార్తల మధ్య కెనడా స్వతంత్ర దేశమని ట్రూడూ మీడియాతో మాట్లాడుతూ గుర్తుచేశారు.
అరెస్టు నిర్ణయంలో ఎటువంటి రాజకీయ జోక్యం లేదన్న ఆయన దీనిపై మరింతగా స్పందించేందుకు నిరాకరించారు. మెంగ్ వాంగ్‌జో అరెస్టు శనివారం జరుగగా, బ్యూనస్ ఎయిర్స్‌లో అమెరికా, చైనా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జీ జిన్‌పింగ్ సమావేశమైన రోజూ ఇదే కావడం గమనార్హం.