ఇది హవేల్స్ కిక్: బెంగళూరులో రీసెర్చి సెంటర్
ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, గృహోపకరణాల తయారీ సంస్థ హవేల్స్ దక్షిణ భారతదేశంలో విస్తరణపై కేంద్రీకరించింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో రూ.1,500 కోట్లు ఖర్చు చేయనున్నది. బెంగళూరులో పరిశోధనా కేంద్రం కూడా ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది.
ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, గృహోపకరణాలు తయారు చేసే ‘హావెల్స్ ఇండియా’ వచ్చే ఐదేళ్లలో విస్తరణ కోసం దాదాపు రూ.1500 కోట్లు ఖర్చు చేయనున్నది. ఇందులో భాగంగా దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడితో ఢిల్లీ సమీపాన గ్లియోట్ వద్ద అధునాతన ఏసీల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నది.
ప్రస్తుతం ఈ సంస్థ ఫ్యాక్టరీలు రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. అందువల్ల భవిష్యత్‌లో ఉత్పత్తి కార్యకలాపాలను దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించాలని ఆలోచిస్తున్నట్లు హావెల్స్ ఇండియా ఛైర్మన్, ఎండీ అనీల్ రాయ్ చెప్పారు.
కొంతకాలం క్రితం లాయిడ్ బ్రాండ్‌ను హావెల్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. ఎలక్ట్రికల్ ఉత్పత్తులను హావెల్స్ బ్రాండ్ కింద .. ఏసీలు, టీవీ, వాషింగ్ మెషీన్ వంటి ఎలక్ట్రానిక్ వినియోగ వస్తువులు ఏసీలు, టీవీ, వాషింగ్ మెషీన్లను లాయిడ్ బ్రాండ్ పేరు మీద విక్రయిస్తున్నారు.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటు ధరలో ఆవిష్కరించటం కోసం పెద్దఎత్తున పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు హవేల్స్ ఇండియా చైర్మన్ అండ్ ఎండీ అనీల్ రాయ్ గుప్తా తెలిపారు. దీని కోసం కొత్తగా బెంగళూరులో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇంటిని సైతం ‘స్మార్ట్ హోమ్’ గా మార్చేందుకు అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉత్పత్తులను తెస్తామన్నారు.
నాలుగేళ్లలో ఏపీ, తెలంగాణాల్లో రెట్టింపు వ్యాపారం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో హావెల్స్ ఇండియా అధిక వ్యాపారాన్ని నమోదు చేస్తోంది. హావెల్స్ ఇండియా మొత్తం వ్యాపారంలో ఈ రాష్ట్రాల వాటా 26 శాతం ఉంది. వార్షిక వృద్ధి కూడా ఇక్కడేఎక్కువ. గత ఏడాది ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో హావెల్స్ ఉత్పత్తుల వార్షిక వ్యాపారం రూ.600 కోట్లు ఉండగా, లాయిడ్ బ్రాండ్ ఉత్పత్తులపై రూ.360 కోట్ల టర్నోవర్ నమోదు అయింది. దీన్ని వచ్చే నాలుగేళ్లలో రెట్టింపు చేసే అవకాశం ఉందని అనీల్ రాయ్ గుప్తా తెలిపారు.
‘గ్రాండే’ సిరీస్ ఏసీ విడుదల
లాయిడ్ గ్రాండే సిరీస్ ఏసీలను హావెల్స్ ఇండియా హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. ఈ ఏసీ ఎంతో తక్కువ సమయంలో గది ఉష్ణోగ్రతను 18 డిగ్రీలకు తగ్గిస్తుందని, ఇంకా వైఫై, పీఎం 2.5 ఫిల్టర్, కాపర్ కాయిల్... తదితర ఎన్నో ప్రత్యేకతలతో ఈ ఏసీలను రూపొందించినట్లు లాయిడ్ ఏసీల విభాగం సీఈఓ శశి అరోరా వివరించారు. ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లోని దాదాపు వెయ్యి స్టోర్ల ద్వారా లాయిడ్ బ్రాండ్ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు తెలిపారు.