వినియోగదారులపై వాట్సాప్ ఆంక్షలు... ఇక ప్రపంచవ్యాప్తంగా
దేశంలో మూకదాడులను అదుపులోకి తెచ్చేందుకు సోషల్ మీడియా సంస్థ చర్యలు ప్రారంభించింది. వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ పరిమితిని ఐదుగురికి మాత్రమే పరిమితం చేయాలన్న కేంద్రం ఆదేశాలను అమల్లోకి తీసువచ్చింది. ఇదే నిబంధనను ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది.
న్యూఢిల్లీ: అసత్యాలను, వదంతులను వ్యాపింపజేయకుండా అరికట్టేందుకు, సందేశాలను ఐదుగురు వ్యక్తులు లేదా గ్రూపులకు మించి ఫార్వర్డ్ చేయకుండా భారత్‌లో ఆంక్షలను అమలు చేస్తున్న వాట్సాప్ వాటిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించినట్లు సంస్థ పాలసీ అండ్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ విక్టోరియా గ్రాండ్ తెలిపారు. వాట్సాప్ సందేశాల వల్లే గత ఏడాది భారత్‌లో కొన్ని మూకదాడులు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో వాట్సాప్ సందేశాలను ఒకసారి ఐదుగురికి మించి ఫార్వర్డ్ చేయకుండా ఆ సంస్థ గత జూలైలో నుంచి భారత్‌లో ఆంక్షలు అమలు చేస్తున్నది.
ఇంతకుముందు వరకు వాట్సాప్ మెసేజ్‌లను 20 మందికి గానీ, 20 గ్రూపులకు గానీ ఫార్వర్డ్ చేసే వెసులుబాటు ఉండేది. వాట్సాప్ ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉన్నది. అయితే ఫేక్ న్యూస్ వ్యాపింపజేయడంతోపాటు మార్పులు చేర్పులు చేసిన ఫోటోలు, సందర్భ రహిత వీడియోలు, తమాషా ఆడియోలను ఫార్వార్డ్ చేస్తుండటం వాట్సాప్‌కు ఇబ్బందికరంగా మారింది.
వందల గ్రూపులు, వ్యక్తులు సమాచారం, ఫొటోలు, వీడియోలు ఫార్వార్డ్ చేసుకునేందుకు వాట్పాప్ ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ అనుమతించేది. కానీ క్రమంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతుండటంతో సోమవారం నుంచి వాట్సాప్ ఫార్వార్డ్ పరిమితులను ఐదు గ్రూపులు లేదా వ్యక్తులకు పరిమితం చేయాలన్న నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్నామని కమ్యూనికేషన్స్ విభాగం అధిపతి కార్ల్ వూగ్ తెలిపారు.