ఫేస్‌బుక్‌కు షాక్: ఇంటర్నల్ డిబేట్, మెమోల లీక్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా డేటా లీక్ ఆరోపణలతో తలబొప్పిన కట్టిన ఫేస్‌బుక్ యాజమాన్యానికి సంస్థ అంతర్గత డేటా లీక్ కావడం మరింత షాక్‌గా మిగిలింది.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది యూజర్ల డేటా లీక్‌తో ఇబ్బందులు పడుతున్న ఫేస్‌బుక్ సంస్థకు స్వయంగా సొంతగూటిలో డేటాలీకైంది.
సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు, ఇతర ముఖ్య అధికారులకు మధ్య జరిగిన అంతర్గత సంభాషణలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ముఖ‍్యంగా 2012లో వివిధ ప్రైవసీ పాలసీ విధానాలకు చెందిన అతి కీలకాంశాలు ఆన్‌లైన్‌లో బహిర్గతం కావడం కలకలం రేపింది.
ఫేస్‌బుక్, సిక్స్4ఆర్ మధ్య దావాకు సంబంధించిన 60పేజీల ఈమెయిల్ సమాచారం,ఇ తర పత్రాలు గిట్ హబ్‌లో పోస్ట్ అయ్యాయని ది గార్డియన్ శుక్రవారం నివేదించింది.
షెడ్యూల్ కంటే ముందే కంపెనీ ఆర్థిక ఫలితాలను ఆన్‌లైన్‌లో బహిర‍్గతంచేసిందని పేర్కొంది.దీంతోపాటు గోప్యతా రక్షణపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కమలా హారిస్, అక్కడి నేర విభాగం అధిపతితో చర్చించిన అంశాలు కూడా లీక్ అయ్యాయని నివేదించింది.
ఆండ్రాయిడ్ పరికరాల్లో డేటా సేకరణకు సంబంధించి ప్రణాళికలు చర్చలు బహిర్గతం కావడం రెండవ అదిపెద్ద లీక్ అని ఆ వార్తా కథనం పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా అనుసరించిన విధానంపై ఫేస్‌బుక్ వైస్ ప్రెసిడెంట్ మార్నే లివైన్‌కు చెందిన 2012 జూలైనాటి ఎనిమిది పేజీల మెమోగా భావిస్తున్నారు.
థర్డ్ పార్ట్ యాప్స్ ద్వారానే గోప్యతా ఉల్లంఘన జరిగినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దావా పత్రాలను కాలిఫోర్నియా కోర్టు సీజ్ చేసినందున తామేమీ వ్యాఖ్యానించలేమని ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.