కాలేజీ క్యాంపస్ నియామకాల్లో ఎంపికైనప్పటి నుంచి ఐదేళ్లుగా కంపెనీలోనే పని చేస్తున్న జూనియర్‌ ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వాలని విప్రో నిర్ణయించింది. ఈ మాత్రం అనుభవం ఉన్న వాళ్లకు కొత్తతరం వ్యాపార విధానాలైన డిజిటల్‌, క్లౌడ్‌ వంటి అంశాల్లో నైపుణ్యం ఉంటుంది.

జనవరి వేతనంలో వీరికి మొత్తం పారితోషికంలో కొంత శాతాన్ని బోనస్‌గా ఇవ్వనుంది. ముందుగా బీ1, బీ2 విభాగాల్లో ఉన్న ఉద్యోగులకు ఇవ్వనున్నట్లు  సమాచారం. ఈ ప్రయోజనాలు అందుకోవాలనుకున్న వారు కంపెనీలో 2020 వరకు పనిచేయాల్సి ఉంటుంది.

అత్యంత మెరుగైన పనితీరును కనబరస్తున్న వారికి ఈ బోనస్‌ ఉంటుందని, వీరికి వార్షిక ఇంక్రిమెంట్లకూ అర్హత ఉంటుందని విప్రో యాజమాన్యం తెలిపింది. విప్రో ఏటా జూన్‌లో వార్షిక ఇంక్రిమెంట్లు ప్రకటిస్తుంది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి 30 నాటికి విప్రోలో 1.75 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

తొలి అర్థభాగంలో సంస్థలో ఉద్యోగుల వలసల రేటు 18 శాతంగా ఉంది. వీటిని అరికట్టడం కోసమే సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. మరోవైపు ఇంకో టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ కొత్త నైపుణ్యాలున్న వ్యక్తులకు త్రైమాసిక ప్రమోషన్లు ఇవ్వాలని భావిస్తోందని తెలుస్తోంది.

ఎవరైనా ఆర్బీఐ స్వతంత్రత కాపాడాల్సిందే: రంగరాజన్ 
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) స్వతంత్రతను పరిరక్షించడానికి, ప్రస్తుత గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అంతక్రితం గవర్నర్ల మార్గాన్ని అనుసరించాలని మాజీ గవర్నర్‌ సీ. రంగరాజన్‌ పేర్కొన్నారు. శక్తికాంతదాస్‌ ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమితులైన తొలి ప్రభుత్వాధికారి ఏమీ కాదన్న విషయాన్ని రంగరాజన్‌ గుర్తు చేశారు.

అన్ని వివాదాస్పద అంశాలపై ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. ‘ఢిల్లీ నుంచి చాలా మంది బ్యూరోక్రాట్లు ఆర్బీఐకి వచ్చారు. ఇదేమీ తొలిసారి కాదు. ఎవరైనా కాని, కొత్త బాధ్యతలను చేపట్టాక.. ఆర్‌బీఐ స్వతంత్ర కోసం పోరాడాల్సిందే’ అని సోమవారం ఒక కార్యక్రమంలో ఆయన చెప్పారు. 

సీఎస్ఓ అవసరమైన వివరాలు వెల్లడిస్తేనే స్పష్టత వస్తుంది.
‘ఆర్‌బీఐ స్వతంత్రతను త్యాగం చేయకుండా ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య మెరుగైన అవగాహన కోసం దాస్‌ పనిచేస్తారనే భావిస్తున్నాం’ అని రంగరాజన్‌ అన్నారు.  జీడీపీ లెక్కింపులో చోటు చేసుకున్న ఇటీవలి మార్పు నేపథ్యంలో కొన్ని అవసరమైన వివరాలను కేంద్ర గణాంక కార్యాలయం(సీఎస్‌ఓ) వెల్లడించాల్సిన అవసరం ఉందని రంగరాజన్‌ అభిప్రాయపడ్డారు.

పన్ను తగ్గినా హెచ్‪యూఎల్ ధర యధాతథం
పన్ను రేటు తగ్గినా, ఉత్పత్తుల ధర తగ్గించకపోవడంతో హిందుస్థాన్‌ యునిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) రూ.383 కోట్ల ప్రయోజనం అక్రమంగా పొందిందని జీఎస్‌టీ యాంటీ ప్రాఫిటీరింగ్‌ అథారిటీ గుర్తించింది. చాలా వస్తువుల పన్ను రేట్లు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గినా, తదనుగుణంగా గరిష్ఠ చిల్లర ధరను హెచ్‌యూఎల్‌ తగ్గించలేదని నేషనల్‌ యాంటీ ప్రాఫిటీరింగ్‌ అథారిటీ (ఎన్‌ఏఏ) వద్ద ఫిర్యాదు దాఖలైంది.దర్యాప్తు చేయగా నిజమని తేలింది.

జీఎస్‌టీ నిబంధనల ప్రకారం ఇందులో 50% అంటే రూ.191.68 కోట్లను కేంద్ర వినియోగదారు భద్రతా నిధిలో జమ చేయాల్సి ఉంటుంది. మిగిలిన సగాన్ని ఉత్పత్తులు విక్రయించిన సంబంధిత రాష్ట్రాల సీడబ్ల్యూఎఫ్‌లో జమ చేయాలి. ఇప్పటికే కంపెనీ రూ.160.23 కోట్లను జమ చేసినందున మరో రూ.31.45 కోట్లు జమ చేయాలని ఆదేశించినట్లు ఎన్‌ఏఏ పేర్కొంది.