అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాల్లో గ్యాప్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనాకు చెందిన ఒక ఇంజినీర్.. అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ‘యాపిల్’ సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం సీక్రెట్లను తస్కరిస్తున్నాడని క్రిమినల్ కేసు నమోదైంది.

ఒక కార్ల తయారీ కంపెనీలో ఉద్యోగం కోసం  చైనా వెళ్లే విమాన టిక్కెట్ బుక్ చేసుకోవడానికి ఒక రోజు ముందు కాలిఫోర్నియా పోలీసులు గత నెలలో చైనా ఇంజినీర్ జిజోంగ్ చెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టులో జిజోంగ్ చెన్‌పై కేసు కూడా పెట్టారు. 

వాణిజ్య సీక్రెట్ల దొంగతనానికి పాల్పడినందుకు చెన్‌కు గరిష్ఠంగా 10 ఏళ్ల జైలుశిక్షతోపాటు 2.50 లక్షల డాలర్ల జరిమాన విధించే అవకాశాలు ఉన్నాయి. విద్యుత్ ఇంజినీర్ అయిన చెన్ జిజోంగ్ గతేడాది జూన్ నెలలో యాపిల్ సంస్థలో హార్డ్ వేర్ డిజైన్ టీంలో చేరాడు. అదీ కూడా యాపిల్ ప్రతిష్ఠాత్మక సెల్ఫ్ డ్రైవింగ్ ప్రాజెక్టులో చేరిపోయాడని ఎఫ్ బీఐ స్పెషల్ ఏజెంట్ అదెలైడా హెర్నాండెజ్ తెలిపారు. 

సమాచారాన్ని బయటపెట్టకుండా తప్పించుకునేందుకు చెన్ జిజోంగ్ కు ‘సీక్రెసీ ట్రైనింగ్’కూడా ఇచ్చింది యాపిల్ సంస్థ. కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా మెళకువలు నేర్చుకునేలా తర్ఫీదునిచ్చింది. సదరు యాపిల్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కేంద్రంలో పని చేస్తున్న 1,200 మంది కోర్ సిబ్బందికి కూడా ఈ శిక్షణ లభించింది. 

పనితీరు మెరుగు పర్చుకోవాలని గతేడాది డిసెంబర్ నెలలోనే యాపిల్ సంస్థ జిజోంగ్ చెన్‌ను ఆదేశించింది. జనవరి ప్రారంభంలో సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం డిజైన్లను చెన్ ఫోటోలు తీస్తున్న సంగతిని సహ ఉద్యోగి గమనించి సీనియర్లకు తెలియజేయడంతో అసలు సంగతి బయటపడింది. 

అంతర్గత దర్యాప్తులోనూ చెన్ సదరు ప్రాజెక్టు ఫొటోలు తీసాడని, యాపిల్ వర్క్ కంప్యూటర్ బ్యాకప్‌లో పెట్టాడని తేలింది. స్కేమాటిక్స్, మాన్యువల్స్, డయాగ్రమ్స్ తదితరాలు కలిపి రెండు వేలకు పైగా ఫైల్స్ అందులో ఉన్నాయని ఫెడరల్ దర్యాప్తు అధికారులు తెలిపారు. 

తన పర్సనల్ కంప్యూటర్‌లో ఇన్సూరెన్స్  పాలసీకి సంబంధించిన సమాచారం డౌన్ లోడ్ చేసుకున్నట్లు జిజోంగ్ చెన్ తెలిపారు. ఉద్యోగిగా పనితీరు పేలవంగా ఉండటంతోపాటు గత జూన్ నెలలోనే తీసిన ఫొటో గ్రామపులు దొరకడంతో అతడి ఉద్యోగాన్ని తొలిగించి వేసినట్లు ఎఫ్ బీఐ స్పెషల్ ఏజెంట్ అదెలైడా హెర్నాండెజ్ తెలిపారు. ఇదిలా ఉంటే తమ అటానమస్ కారు టీంను ట్రిమ్మింగ్ చేస్తున్నట్లు యాపిల్ సంస్థ తెలిపింది. టెక్నాలజీ రహస్యాలను కాపాడుకునేందుకు ఈ చర్య చేపట్టినట్లు పేర్కొంది.