రూపీ భారం భరించేందుకు రెడీ: స్మార్ట్ ఫోన్లు

పండుగల వేళ వినియోగదారుడిని ప్రసన్నం చేసుకునే పనిలో స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థలు ఉన్నాయి. భారీగా రూపాయి పతనమైనా ఆ భారం వినియోగదారులపై మోపబోమని పేర్కొన్నాయి. ఇంతకుముందే గృహోపకరణాల తయారీ సంస్థలు సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. 

Buy a smartphone this Diwali, and save big

భారత స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మొబైల్ తయారీ కంపెనీలు తీపి కబురందించాయి. పండుగల సీజన్ ముగిసే వరకు ధరల పెంచకూడదని నిర్ణయించాయి. పండుగ సీజన్ సందర్భంగా ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు శాంసంగ్, షియోమీ, ఆనర్, ఆసుస్, వన్ప్లస్ తదితర కంపెనీలు ఇప్పటికే ఈ సంగతి స్పష్టం చేశాయి.

రూపాయి క్షీణత తప్పకుండా తమకు తలనొప్పి కలిగించే అంశమే అని, నిజానికి స్మార్ట్ఫోన్లపై 10 శాతం ధరలు పెంచాల్సి ఉన్నప్పటికీ ఈసారి ఆ పని చేయడం లేదని, పైపెచ్చు ఆఫర్లు, రాయితీలు ఇవ్వనున్నట్టు హువావే, ఆనర్ కన్జుమర్ ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ పి.సంజీవ్ తెలిపారు. ఆసుస్ ఇండియా మొబైల్ ప్రొడక్ట్ డైరెక్టర్ దినేశ్ శర్మ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

హోమ్‌ అప్లియెన్స్‌ సంస్థలు బాష్, పానసోనిక్, సీమెన్స్, వోల్టాస్, బెకో తదితర కంపెనీలు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల రేట్ల పెంపును వాయిదా వేశాయి. ఎల్జీ మాత్రం దిగుమతి చేసుకున్న రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల రేట్లను 10 శాతం మేరకు పెంచాయి. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రీమియం ఇంపోర్టెడ్ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉండగా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం కావడంతో టెలికం కంపెనీలపై అదనపు భారం పడుతుందని ప్రముఖ రేటింగ్స్‌ సంస్థ ‘ఇక్రా` అంచనా వేసింది. టెలికం సంస్థలపై అదనంగా రూ.6 వేల కోట్ల ఖర్చు పడుతుందని ఇక్రా పేర్కొన్నది.

రోజురోజుకు పతనమవుతున్న దేశీయ మారకానికితోడు, భగ్గుమంటున్న డీజిల్ ధరలతో ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో టెలికం సంస్థలు అదనంగా రూ.6 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి రావచ్చునని తెలిపింది.ప్రస్తుతం రూ.5 లక్షల కోట్ల రుణభారంతో సతమతమవుతున్న భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు మరింత ఇబ్బందులను ఎదుర్కొక తప్పదని  ఇక్రా వైస్ ప్రెసిడెంట్ హర్ష జగ్నాని తెలిపారు.

దీనికి తోడు  డీజిల్ ధరలు పెరుగడంతో ఈ ఏడాది టెలికం సంస్థల ఆదాయం 10 శాతం వరకు కోల్పోయే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో సంస్థలు తీసుకున్న అప్పులకు అధికంగా నిధులు వెచ్చించాల్సి ఉంటుందని, తద్వారా సంస్థల ఆదాయానికి గండికొడుతున్నదన్నారు. టెక్నాలజీని మరింత ఆధునీకరించాలనుకున్న టెలికం సంస్థలకు నిర్వహణ ఖర్చులు ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. 

ఈ ఏడాది మార్చి నాటికి టెలికం సంస్థలకు రూ.4.7 లక్షల కోట్ల స్థాయిలో అప్పు ఉండగా, వీటిలో లక్ష కోట్ల వరకు విదేశీ అప్పు ఉన్నట్లు అంచనా. వీటిలో 70 శాతం డాలర్ రూపంలో చెల్లింపులు జరుపాల్సి ఉంటుంది. డీజిల్ అధికంగా వినియోగిస్తున్న టెలికం రంగంలో టవర్లకోసం రూ.13 వేల కోట్లు అదనంగా చెల్లించాల్సి రావచ్చునని ఇక్రా అంచనావేస్తున్నది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios