Asianet News TeluguAsianet News Telugu

వేస్ట్ స్మార్ట్ ఫోన్లు: అన్నీ అనవసర ఫీచర్లే.. 81% ఇండియన్ల మనోగతమిది

అంతర్జాతీయంగానే స్మార్ట్ ఫోన్ల వాడకంలో నంబర్ వన్ స్థానం కోసం పరుగులు తీస్తున్న భారతీయులు వాటిల్లో ఇన్ స్టాల్ చేసిన ప్రోగ్రామ్స్, ఫీచర్లు శుద్ధ దండుగ అని 91మొబైల్స్‌డాట్‌కామ్ సర్వే తేల్చేసింది. 

81% Indians feel their smartphones don't have all requisite features: Study
Author
Mumbai, First Published Oct 30, 2018, 9:08 AM IST

మొబైల్ ఫోన్లు.. కాదు కాదు స్మార్ట్ ఫోన్ల వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే త్వరలో నంబర్ వన్ స్థానంలోకి రానున్నది. కానీ ఆయా స్మార్ట్ ఫోన్లలో తమకు అవసరమైన ఫీచర్లే ఉండటం లేదని, అవన్నీ చెత్త ఫోన్లని భారతీయులు తేల్చేశారు.

అవును.. ప్రపంచంలోనే స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో భారత్  దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. 2జీ, 3జీలు దాటుకుని.. 4జీలో నడుస్తున్న భారతీయులు.. 5జీ అందుకునే దిశగా ఇండియన్లు చకచకా పరుగులు తీస్తున్నారు. 

ఈ క్రమంలో ప్రతీ ఒక్కరి చేతిలో ఫీచర్ ఫోన్ కాస్తా.. స్మార్ట్‌ఫోన్‌గా మారిపోతున్నది. ఇలా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారత్ అగ్రపథానికి చేరుకుంటున్న తరుణంలో సదరు స్మార్ట్‌ఫోన్లపై భారతీయులకున్న అభిప్రాయాన్ని తేటతెల్లం చేసిన ఓ తాజా అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకున్నది.

గాడ్జెట్స్ రిసెర్చ్ పోర్టల్ 91మొబైల్స్‌డాట్‌కామ్ నిర్వహించిన వినియోగదారుల ఆలోచనల అధ్యయనం-2018 ప్రకారం అత్యధిక భారతీయులు స్మార్ట్‌ఫోన్లలో తమకు అవసరమైన ఫీచర్లేవీ ఉండట్లేదని అభిప్రాయపడ్డారు. 

ఈ సర్వేలో పాల్గొన్నవారిలో ఏకంగా 81 శాతం మందిదీ ఇదేమాట చెప్పడం గమనార్హం. మార్కెట్‌లో ప్రస్తుతం లభిస్తున్న స్మార్ట్‌ఫోన్ల నిండా అక్కర్లేని ఫీచర్లు, అప్లికేషన్లే (యాప్‌లు) ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

21 శాతం మంది మాత్రం వాటర్‌ప్రూఫింగ్ ఫీచర్ అత్యంత కీలకమైందని అభిప్రాయపడ్డారు. క్విక్ చార్జింగ్ సౌకర్యానికి 19 శాతం తొలి ప్రాధాన్యత ఓటేయగా, ఫ్రంట్-ఫేసింగ్ ఫ్లాష్‌ను 15 శాతం మంది, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను 11 శాతం మంది ఇష్టపడుతున్నట్లు తేలింది. 

అన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లలో కనిపిస్తున్న సాధారణ సమస్య త్వరగా బ్యాటరీ డిశ్చార్జ్ కావడమేనని మెజారిటీ భారతీయులు పేర్కొన్నారు. తమ సర్వేలో అభిప్రాయాల్ని పంచుకున్న ప్రతీ నలుగురిలో ఒకరు ఈ సమస్యను ప్రస్తావించినట్లు 91మొబైల్స్‌డాట్‌కామ్ తెలియజేసింది.  ఇక దాదాపు 20 శాతం మంది సాఫ్ట్‌వేర్ నెమ్మదించడాన్ని తర్వాతి ప్రధాన సమస్య అని అభివర్ణించింది.

ఆ తర్వాత కెమెరా లోపాల్ని అధ్యయనంలో పాల్గొన్న ప్రజలు ఎత్తి చూపారు. దేశవ్యాప్తంగా 18-30 ఏండ్ల మధ్యనున్న 15 వేలకుపైగా భారతీయుల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఈ అధ్యయనాన్ని రూపొందించారు. వీరంతా కూడా ఏడాది అంతకంటే ఎక్కువ కాలం నుంచి రకరకాల సంస్థల స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తున్నవారని 91మొబైల్స్‌డాట్‌కామ్ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios