త్వరలోనే మేడ్ ఇన్ ఇండియా క్రోమ్ బుక్..: మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్ధ హెచ్‌పీతో కలిసి భారత దేశంలోనే క్రోమ్ బుక్ లను తయారు చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటనపై మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు.
హైదరాబాద్ : మోదీ సర్కార్ మేడ్ ఇన్ ఇండియా నినాదంతో ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశీయ టెక్నాలజీతో వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తూ భారత్ దూసుకుపోతోంది. తాజాగా అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ కూడా మేడ్ ఇన్ ఇండియా నినాదాన్ని అందుకుంది. కంపూటర్ల తయారీ సంస్థ హెచ్‌పీతో చేతులు కలిపి దేశీయంగానే క్రోమ్ బుక్ తయారీకి సిద్దమయ్యింది. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేసారు.
''భారతదేశంలో క్రోమ్ బుక్ ల తయారీ కోసం మేము హెచ్‌పీతో భాగస్వామ్యం అయ్యాము. భారతదేశంలో క్రోమ్ బుక్ ల తయారుచేయడం ఇదే మొదటిసారి. దీంతో భారతీయ విద్యార్థులకు సురక్షితమైన కంప్యూటింగ్ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి'' అంటూ ఎక్స్ వేదికన సుందర్ పిచాయ్ ట్వీట్ చేసారు.
గూగుల్ సీఈవో పిచాయ్ ప్రకటనపై మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ''గూగుల్ ఇండియాలో క్రోమ్ బుక్ తయారీకి సిద్దమవడంతో గొప్ప నిర్ణయం. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ కు ఇదే నిదర్శనం. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ, ఐటీ సేవలకు భారత్ కేంద్రంగా మారుతోంది'' అన్నారు.
తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని ఫ్లెక్ ఫెసిలిటి ప్లాంట్ లో ఈ క్రోమ్ బుక్ ల తయారీ మొదలైనట్లు హెచ్‌పీ కూడా ప్రకటించింది. 2020 ఆగస్ట్ నుండి ఈ ప్లాంట్ లో రకరకాల ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లు తయారీని చేపట్టిన హెచ్‌పీ గూగుల్ తో కలిసి క్రోమ్ బుక్ తయారీకి సిద్దమయ్యింది. కొత్తగా తయారుచేస్తున్న ఈ క్రోమ్ బుక్ లు రూ.15,990 ప్రారంభధరకే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు హెచ్‌పీ ప్రతినిధులు చెబుతున్నారు.
Read More Samsung ఫోన్ ప్రియులకు శుభవార్త: అక్టోబర్ 4న కొత్త ప్రీమియం ఫోన్ లాంచ్; ఫీచర్లు ఇలా..
భారతదేశంలో డిజిటల్ ఎడ్యుకేషన్ ను ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని హెచ్‌పీ ప్రతినిధులు తెలిపారు. ఇందుకోసమే వారికి అందుబాటు ధరల్లోనే నాణ్యమైన కంప్యూటింగ్ పరికరాలు అందుబాటులోకి తీసుకురావడానికి సిద్దమయ్యామన్నారు. అందులో భాగంగానే గూగుల్ తో కలిసి క్రోమ్ బుక్ తయారీని ప్రారంభించినట్లు.. త్వరలోని వీటిని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామని హెచ్‌పీ ప్రతినిధులు తెలిపారు.