ట్విట్టర్‌లో టెక్నికల్ ఇష్యూ : సేవలకు అంతరాయం, ట్వీట్ చేద్దామంటే కుదరకపోయే.. మస్క్‌పై ఫన్నీ మీమ్స్
ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి యూజర్లు ఇబ్బందులు పడ్డారు. చాలా మంది వినియోగదారులు ట్వీట్‌లను వీక్షించడానికి, పోస్ట్ చేయడానికి సాధ్యం కాలేదు. దీంతో ఎలాన్ మస్క్‌పై యూజర్లు భగ్గుమన్నారు.
ఇటీవలికాలంలో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో టెక్నికల్ సమస్యల కారణంగా యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి యూజర్లు ఇబ్బందులు పడ్డారు. చాలా మంది వినియోగదారులు ట్వీట్‌లను వీక్షించడానికి, పోస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు “Cannot retrieve tweets” అనే ఎర్రర్ మెసేజ్ కనిపించింది.
ఇంకొంతమందికి “Rate limit exceeded error message” కనిపించడంతో యూజర్లు ఇబ్బందిపడ్డారు. దీనిపై యూజర్లు ట్విట్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ట్విట్టర్ ఈ సమస్యను గుర్తించకపోగా.. సమస్యకు దారి తీసిన కారణంపై వివరణ సైతం ఇవ్వలేదు. దీనికి బదులుగా మరింత సమాచారం కోసం చెక్ చేస్తూ వుండండి అని రిప్లయ్ రావడంతో యూజర్లు చిర్రెత్తిపోతున్నారు.
ఆన్‌లైన్ సర్వీస్ అంతరాయాలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ ‘‘ డౌన్ డిటెక్టర్ ’’ ప్రకారం.. ట్విట్టర్‌లో సమస్యపై ఇప్పటి వరకు 4,000 మంది రిపోర్ట్ చేశారు. ఆ కాసేపటికి ట్విట్టర్‌లో తమకు ఎదురైన అనుభవాన్ని పంచుకునేందుకు ట్విట్టర్‌లోనే చిత్ర విచిత్రంగా పోస్టులు పెట్టారు. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఫ్లాట్‌ఫాంను పునరుద్ధరించే పనిలో బిజీగా వున్నట్లు కొందరు మీమ్‌లను సృష్టించారు. చాలా ట్వీట్‌లలో కే పాప్ స్టార్‌లను, కమెడియన్‌లతో వున్న ఫన్నీ మీమ్‌లు నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
అయితే ట్విట్టర్‌లో ఇటీవలికాలంలో అంతరాయం ఏర్పడటం ఇది మూడోసారి. మార్చి 6న లింక్‌లు పనిచేయడం ఆగిపోవడంతో కొందరు వినియోగదారులు లాగిన్ చేయలేకపోయారు. ట్వీట్‌లపై వున్న లింక్‌లపై క్లిక్ చేయడం, ఫోటోలను లోడ్ చేయడం, TweetDeck వంటి కొన్ని ట్విట్టర్ సేవలకు లాగిన్ కాలేకపోయారు యూజర్లు. ఇదిలావుండగా.. ట్విట్టర్‌లో మార్పులు తీసుకొస్తున్నట్లు ఎలాన్ మస్క్ మార్చి నెలలో ప్రకటించారు. పది వేల అక్షరాలతో ట్వీట్‌ను పోస్ట్ చేసేందుకు వీలుగా మార్పులు చేస్తున్నామని ఆయన చెప్పారు. అయితే ఈ అవకాశం బ్లూటిక్ సబ్‌స్క్రైబర్‌కి మాత్రమే. గతంలో 280 అక్షరాల వరకు మాత్రమే ట్వీట్ చేసేందుకు అనుమతి వుండేది