న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం సంస్థలు భారతీ ఎయిర్‍టెల్, వొడాఫోన్ ఐడియాకు టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) షాక్ ఇచ్చింది. స్పీడ్‌తో  అధిక డేటా అందిస్తామంటూ తీసుకు వచ్చిన రెండు ప్లాన్లను నిలిపివేయలని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలను ఆదేశించింది. ఈ విషయమై సమాధానం ఇవ్వాలని ట్రాయ్  ఆ సంస్థలకు లేఖలు రాసింది.

కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ వల్ల ‘వర్క్ ఫ్రం హోం’ కల్చర్ పెరిగింది. దీంతో డేటా వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో అధిక వేగంతో డేటా అందిస్తామంటూ ఈ రెండు కంపెనీలూ తమ పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం ప్రత్యేక డేటా ప్యాక్‌లను తీసుకువచ్చాయి. 

ఎయిర్‌టెల్ ప్లాటినం పేరిట రూ.490 కంటే ఎక్కువ మొత్తం చెల్లించే వినియోగదారులకు అధికవేగంతో కూడిన 4జీ డేటాను అందిస్తామని ప్రకటించింది. భారతీ ఎయిర్ టెల్ రూ.499, అంతకంటే ఎక్కువ ప్యాక్ గల ప్లాన్లు గల తన ప్లాటినం కస్టమర్లకు ఈ నెల ఆరవ తేదీన స్పీడ్‌తో 4జీ డేటా అందిస్తామని తెలిపింది. 

also read చార్జీలు పెరిగినా బ్రాడ్‌బ్యాండ్‌‌కు భలే డిమాండ్‌.. భారీగా ఇంటర్నెట్ యూసేజ్ ...

వొడాఫోన్ ఐడియా గతేడాది నవంబర్ నెలలో రెడ్ ఎక్స్ పేరిట రూ.999తో పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ప్లాన్ ప్రకటించింది. ఈ ప్యాక్ రీచార్జి చేసుకున్న వినియోగదారులకు 50 శాతం అధికవేగంతో డేటాను అందిస్తామని ట్రాయ్ వెల్లడించింది. మే నెలలో ఆ ప్లాన్‌ను రూ.100 పెంచుతూ ఫాస్టర్ స్పీడ్స్, స్పెషల్ సర్వీసులు అందజేస్తుందని వొడాఫోన్ ఐడియా తెలిపింది. 

ఈ నేపథ్యంలో ట్రాయ్ రెండు కంపెనీలు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలకు లేఖలు రాసింది. ఇది సేవా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని అభిప్రాయ పడింది. ఇలాగైతే సాధారణ వినియోగదారుల ప్రయోజనాలకు ఏం విలువ ఇచ్చినట్లని ట్రాయ్ ప్రశ్నించింది. 

అయితే, ఎక్కువ సొమ్ము చెల్లించే వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడంలో ఈ నిబంధనల ఉల్లంఘన కిందరాదని టెలికం నిపుణులు తెలిపారు. ట్రాయ్ లేఖలపై స్పందించడానికి ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా నిరాకరించాయి.