స్మార్ట్‌ఫోన్ కొనేవారికి పండగే.. జూలైలో మళ్లీ కొత్త ఫోన్ల విడుదల..
జూలై నెలలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు పండగే. ఎందుకంటే.. వన్‌ప్లస్, వివో, పోకో సంస్థలు తమ కొత్త ఉత్పత్తులను ఈ నెలలోనే మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. పోకో సంస్థ తన ఎం2 ప్రో సిరీస్‌ను మంగళవారం విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
న్యూఢిల్లీ: లాక్డౌన్ ఆంక్షలు సడలింపుతో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కొత్త ఫోన్ల విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అదిరిపోయే ఫీచర్లతో అద్భుతమైన స్మార్ట్ఫోన్లు త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి తేనున్నారు. వన్‌ప్లస్, వివో, పోకో సంస్థలు ఈ నెలలో తమ ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు పరిచయం చేయడానికి సిద్ధమయ్యాయి.
పోకో సంస్థ ఇప్పటికే తన కొత్త ఎం2 ప్రో సిరీస్‌ను మంగళవారం విడుదల చేస్తోంది. వన్‌ప్లస్ సైతం త్వరలోనే తన నార్డ్ ఫోన్‌ను విపణిలో ప్రవేశపెట్టనుంది. వీటితోపాటు మరిన్ని అధునాతన స్మార్ట్ఫోన్లు ఈ నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
వన్ ప్లస్ సంస్థ తయారు చేసిన నార్డ్‌ను తొలుత భారత్‌లోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది. తేదీ ప్రకటించకున్నా, ఇటీవల వన్ ప్లస్ సంస్థ చేస్తున్న ప్రచారాన్ని బట్టి చూస్తే త్వరలోనే విపణిలోకి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. నార్డ్ డిజైన్ సహా పలు కీలకమైన వివరాలు అమెజాన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
5జీ సపోర్ట్ గల వన్ ప్లస్ నార్డ్ ఫోన్‌లో వెనుక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌తోపాటు ముందువైపు పంచ్‌హోల్ కెమెరా ఏర్పాటు చేసింది వన్ ప్లస్.
మరో స్మార్ట్ ఫోన్ సంస్థ ‘పోకో’ కొత్తగా ‘ఎం2 ప్రో' మోడల్ ఫోన్‌ను మంగళవారం ఆవిష్కరిస్తోంది. శక్తిమంతమైన ఫీచర్లతో గేమింగ్ కోసం ఈ ఫోన్ రూపొందించింది. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీని ఇందులో అమర్చినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్ వివరాలు ప్రకటించలేదు.
భారత్‌లో అందుబాటులోకి రానున్న మరో ఆసక్తికరమైన ఫోన్ వివో ఎక్స్50 సిరీస్. అధికారికంగా విడుదల తేదీని ప్రకటించకున్నా, ఈ నెలలోనే ఫోన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చైనాలో మే నెలలోనే ఎక్స్50 సిరీస్‌ను వివో విడుదల చేసింది.
వివో ఎక్స్50, ఎక్స్50 ప్రో మోడల్ ఫోన్లలో 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ వరకు స్టోరేజీ సామర్థ్యం ఉంది. 6.56 అంగుళాల డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్ ఇందులో అమర్చారు.
also read జూమ్, జియోమీట్ యాప్స్ కి పోటీగా ఎయిర్‌టెల్ కొత్త యాప్.. ...
వీవో ఎక్స్ 50, ఎక్స్ 50 ప్రో మోడల్ ఫోన్లలో ఇంకా 4,200 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతోపాటు 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. ఈ రెండు ఫోన్లకు ఉన్న ఒకే తేడా ఏంటంటే.. ప్రో వెర్షన్లో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది.
ఈ సిరీస్‌లో వివో ఎక్స్50, వివో ఎక్స్50 ప్రో, వివో ఎక్స్50 ప్రో ప్లస్ ఫోన్లలో వివో ఎక్స్50 ప్రో ప్లస్చాలా ఖరీదైనది.12జీబీ ర్యామ్ సామర్థ్యం క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్, వెనకవైపు 4కెమెరాలు (50ఎంపీ, 32ఎంపీ, 13ఎంపీ, 13ఎంపీ) ఉన్నాయి.
చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ రూపొందించిన 6ఎస్ మోడల్ ఫోన్ ఎప్పుడు విడుదల అవుతుందని తెలియదు. అయితే, ఈ నెలలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
రియల్మీ 6ఐ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో 6ఎస్‌గా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే మయన్మార్‌లో 6ఐ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ తరహాలోనే 6ఎస్ ఫీచర్లు ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
రియల్మీ 6ఐ ఫీచర్లలో 4జీబీ ర్యామ్ విత్ 64జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది. మీడియా టెక్ హీలియో జీ90టీ ఎస్ఓసీ ప్రాసెసర్, 48ఎంపీ వెనక కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 4,300 సామర్థ్యం గల ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ ఫ్లాష్ ఛార్జింగ్‌తోపాటు 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే కలిగి ఉంటుంది.
భారత మార్కెట్లోకి త్వరలోనే దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ శ్యామ్‌సంగ్ తన కొత్త ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. 3జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. ధర రూ.10 వేలలోపు ఉండే అవకాశం ఉంది.