గూగుల్ & ఫేస్‌బుక్ సంచలనం... ఉద్యోగులు 2021 వరకూ వర్క్ ఫ్రం హోం
కరోనా ఇప్పట్లో ప్రపంచ మానవాళిని వదిలిపెట్టే సంకేతాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సెర్చింజన్ ‘గూగుల్’, సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్ బుక్’ 2021 వరకు తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పని చేయాలని నిర్ణయించాయి.
కరోనా మహమ్మారి వ్యాప్తిస్తున్న నేపథ్యంలో దానిని నియంత్రించడానికి తమ ఉద్యోగులు 2021 వరకు ‘వర్క్ ఫ్రం హోం (ఇంటి నుంచే పని)’ సేవలందిస్తారని టెక్ దిగ్గజాలు ఫేస్‌బుక్, గూగుల్ ప్రకటించినట్లు సమాచారం. సంస్క్రుతిని కొనసాగించాలని ఈ రెండు సంస్థలు భావిస్తున్నాయని వినికిడి. జూలై ఆరో తేదీ వరకు కార్యాలయాలను తెరవబోమని సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్ బుక్’ గతంలోనే ప్రకటించింది.
2021 వరకు ఇంటి నుంచే పని చేయాలని ఎక్కువ మంది ఉద్యోగులను ఫేస్ బుక్ ఇప్పటికే ఆదేశించింది. ఏయే విభాగాల సిబ్బందిని కార్యాలయాలకు అనుమతినిస్తారో ఇంకా ఫేస్ బుక్ నిర్ణయం తీసుకోలేదు. కార్యాలయాలను తెరిచేందుకు ప్రజారోగ్య సమాచారం, ప్రభుత్వ మార్గ నిర్దేశాలు, స్థానిక నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటామని సోషల్ మీడియా దిగ్గజం వెల్లడించింది.
also read టచ్ సెన్సిటివ్ కంట్రోల్స్ తో షియోమి వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ లాంచ్...
సెర్చింజన్ ‘గూగుల్’ కూడా ఎక్కువ మంది ఉద్యోగులు 2021 వరకు ఇంటి నుంచే పని చేసేందుకు నిర్ణయించింది. ఇక ఈ ఏడాది సాంతం ఇంటి నుంచే పని చేయాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల అన్ని రంగాల ఉద్యోగులతో జరిగిన సమావేశంలో చెప్పారు.
కార్యాలయాల్లో విధులను నిర్వహించడానికి రావడం లేదు కనుక సిబ్బందికి ఆహారం, ఫిట్ నెస్, ఫర్నీచర్, బహుమతుల వంటి ప్రోత్సాహకాలు ఉండబోవని సుందర్ పిచాయ్ పేర్కొన్నారని గూగుల్ తెలిపింది. 2020లో ఉద్యోగుల నియామక ప్రక్రియను తగ్గిస్తున్నామని పేర్కొంటూ గత నెలలోనే సుందర్ పిచాయ్.. గూగుల్ ఉద్యోగులకు ఈ-మెయిల్ పంపారు.