ముంబై: బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై క్రెడిట్, డెబిట్ కార్డులనుపయోగించి ఆన్‌లైన్, అంతర్జాతీయ లావాదేవీలు చేయకుండా అడ్డుకట్ట వేసింది. ఈ మేరకు ఎస్బీఐ తన ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది. 

కేవలం దేశీయ ఆర్థిక లావాదేవీలకు మాత్రమే డెబిట్, క్రెడిట్ కార్డులు ఇక పరిమితం కానున్నాయి. అంటే ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) టెర్మినల్స్‌లో మాత్రమే కార్డులు చెల్లుబాటు అవుతాయి. ఒకవేళ ఆన్‌లైన్, అంతర్జాతీయ లావాదేవీలు చేయాలనుకుంటే మాత్రం బ్యాంకు నుంచి అనుమతి తప్పనిసరి. 

క్రెడిట్, డెబిట్‌కార్డుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా బ్యాంకింగ్ మోసాలు, కార్డుల అనుచిత వాడకానికి అడ్డుకట్ట పడనున్నది. మార్చి 16 నుంచే ఇది అమల్లోకి రానుంది. అలాగే, ఇకపై బ్యాంకులు జారీ చేసే కొత్త క్రెడిట్, డెబిట్ కార్డులు కూడా దేశీయ లావాదేవీలకే పరిమితం అవుతాయి. 

ఆన్‌లైన్ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు, కాంట్రాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ వంటి సదుపాయాలు కావాలనుకుంటే కార్డుదారులు బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సేవలన్నీ డిఫాల్ట్‌గానే అందుతుండగా, ఇకపై ఇవి అందుబాటులో ఉండవు. 

ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న బ్యాంకుల్లో ముప్పు ఉందని గుర్తిస్తే వాటిని రద్దు చేసి కొత్తవాటిని జారీ చేసే అధికారం బ్యాంకులకు కలిగిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. తగు చర్యలు తీసుకోవాలని గత జనవరి 15వ తేదీనే నిర్ణయం తీసుకున్నది ఆర్బీఐ. 

అలాగే, వినియోగదారులు తమ కార్డులను స్విచ్చాఫ్, స్విచ్చాన్ చేసుకునే అవకాశం కూడా బ్యాంకర్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు మొబైల్ అప్లికేషన్లలో అవసరమైన మార్పుచేర్పులు చేయాల్సిందిగా బ్యాంకులను రిజర్వు బ్యాంకు కోరింది.  అయితే మెట్రో నగరాల పరిధిలో వినియోగించే ఎస్బీఐ ప్రీ పెయిడ్ గిఫ్ట్ కార్డులకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవు. 

జియో మెట్రికల్‌గానే కొద్ది రోజులుగా డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో ఎస్బీఐ సహా బ్యాంకులన్నీ డెబిట్, క్రెడిట్ కార్డులకు వసతులు కల్పించాలని ఆర్బీఐ ఆదేశించింది. స్విచ్ఛాన్, స్విచ్ఛాఫ్, మోడిఫై ట్రాన్సాక్షన్స్, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లు, పీఓఎస్, ఏటీఎంలు, ఆన్ లైన్ లావాదేవీలు, కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్లు తదితరాలు చేపట్టేందుకు వసతులు కల్పించాలని సూచించింది. 

24x7 గంటల పాటు ఈ వసతులు మొబైల్ అప్లికేషన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్సాన్స్ (ఐవీఆర్) వసతులు కల్పించాలి. శాఖలు, బ్యాంకు కార్యాలయాల్లో ఈ వసతి కల్పించనున్నది. కార్డు స్టేటస్ విషయమై ఎస్సెమ్మెస్ అలర్ట్స్, ఇన్ఫర్మేషన్, ఈ-మెయిల్స్ ద్వారా ఖాతాదారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.