శాన్ ఫ్రాన్సిస్కో: గ్లోబల్ టెక్ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ సీఈఓ సత్య నాదెళ్ల వార్షిక వేతనం గతేడాదితో పోలిస్తే 2018-19 సంవత్సరంలో 66 శాతం పెరిగింది. జూన్ నాటికి ఆయన 42.9 మిలియన్ డాలర్ల వేతనాన్ని పొందారు. సాధారణ వేతనం మిలియన్ డాలర్లు పెరుగడంతోపాటు ఆయన వంతు కేటాయించే షేర్లు కూడా పెరిగాయి.

‘సత్య నాదెళ్ల నాయకత్వం వినియోగదారులకు ఆకట్టుకుంటున్నది. ఫలితంగా కంపెనీ స్థితిగతులే మారిపోయాయి. ఆయన రాకతో సంస్థ కొత్త పుంతలు తొక్కుతోంది’ అని మైక్రోసాఫ్ట్ డైరెక్టర్లు ప్రశంసల వర్షం కురిపించారు.

స్టీవ్ బాల్మర్ నుంచి 2014లో సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు 84.3 మిలియన్ల డాలర్లు ఇప్పటివరకు ఆయన అందుకున్న అత్యధిక వేతనం అదే. ప్రస్తుతం ఆయన ఖాతాలో తొమ్మిది లక్షల షేర్లు ఉన్నాయి. సీఈఓ కాకుండా మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు సరాసరి 1,72,512 డాలర్ల వేతనాన్ని అందుకుంటున్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లావాదేవీల ప్రగతిలో మరో రికార్డు నెలకొల్పింది. డివిడెండ్లు, షేర్ల రీ పర్చేజ్ రూపంలో వాటాదారులకు 30.9 బిలియన్ల డాలర్లకు అందజేసింది మైక్రోసాఫ్ట్. గత ఐదేళ్లలో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 302 బిలియన్ల నుంచి 811 బిలియన్ల డాలర్లకు ఎగబాకింది. అంటే 509 బిలియన్ల డాలర్లు పెరిగిందన్నమాట.