బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్‌ మరో నూతన ఆవిష్కరణతో మన ముందుకొస్తోంది. అత్యంత వేగంగా ఎగిరే విద్యుత్‌ విమానాన్ని ఈ సంస్థ రూపొందిస్తోంది.

దీనిలో భాగంగా ఈ విమానంలో వినియోగించే టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది. ఈ లోహ విహంగానికి ‘అయాన్‌ బర్డ్‌’గా నామకరణం చేసింది. పరీక్ష అనంతరం ఇంజనీర్లు.. రెప్లికా వెర్షన్‌ టెస్ట్‌ ఫలితాలతో సంతప్తి వ్యక్తం చేస్తున్నారు.

500 హార్స్‌ పవర్‌ సామర్థ్యం కలిగి ఉండడంతో ఈ విద్యుత్‌ విమానం రికార్డు స్థాయి వేగాన్ని క్షణాల్లో అందుకోగలదని రోల్స్‌ రాయిస్‌ డైరెక్టర్‌ రాబ్‌ వాట్సన్‌ వివరించారు.

కాగా ఈ విమానం టెక్నాలజీని పరీక్షించేందుకు ఉపయోగించిన విద్యుత్‌‌ 250 ఇళ్లకు వినియోగించే ఎలక్ట్రిసిటీతో సమానమని రోల్స్ రాయిస్ ఇంజనీర్లు స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో సోషల్‌ డిస్టెన్స్‌ నిబంధనలకు అనుగుణంగానే అన్ని జాగ్రత్తలూ తీసుకుని టెస్ట్ నిర్వహించామని వాట్సన్ చెప్పారు.

టెక్నాలజీ టెస్ట్‌ విజయవంతంగా పూర్తికావడంతో అతి త్వరలోనే అన్ని పరికరాలనూ విమానంలో అమర్చుతామని  ఆయన తెలిపారు. 2050 నాటికి కాలుష్య రహిత విమానాల తయారీలో తాము కీలకం కాబోతున్నామని వాట్సన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.