Sam Altman: సామ్ ఆల్ట్‌మన్‌ను వెనక్కి తీసుకోకుంటే రాజీనామా చేస్తాం: 500 Open AI ఉద్యోగుల లేఖ
సామ్ ఆల్ట్‌మన్‌ను, గ్రెగ్ బ్రాక్‌మన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే తాము రాజీనామా చేస్తామని ఓపెన్ ఏఐకి చెందిన కనీసం 500 మంది ఉద్యోగులు సంతకాలు పెట్టిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. బోర్డు నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అసలు ఓపెన్ ఏఐని పర్యవేక్షించే సామర్థ్యం బోర్డుకు లేదని ఈ ప్రవర్తనతో వెల్లడైందని పేర్కొన్నారు.
హైదరాబాద్: Open AI షాకింగ్ నిర్ణయం తీసుకుంటూ రెండు రోజుల క్రితం సామ్ ఆల్ట్‌మన్‌కు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ఓపెన్ ఏఐ సీఈవో ఆల్ట్‌మన్, సహ వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్‌ను ఒక మీటింగ్‌లో తొలగిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయం సిలికన్ వ్యాలీలోనే కాదు.. మొత్తం టెక్ ప్రపంచమే నివ్వెరపోయింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం ఓపెన్ ఏఐ సిబ్బందినీ గందరగోళానికి గురి చేసింది.
తాజాగా, సిబ్బంది సంచలన నిర్ణయం తీసుకుంది. బోర్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని సామ్ ఆల్ట్‌మన్‌ను, గ్రెగ్ బ్రాక్‌మన్‌ను వెనక్కి తీసుకోకుంటే తాము కూడా రాజీనామా చేస్తామని కనీసం 500 మంది ఉద్యోగులు ఓ లేఖ పై సంతకాలు పెట్టారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఓపెన్ ఏఐ సరికొత్త పుంతలు తొక్కించిందని ఆ లేఖ పేర్కొంది. ‘సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్‌ను బోర్డు నుంచి మీరు తొలగించిన విధానం గమనిస్తే ఇన్నాళ్లు జరిగిన ఈ పనిని, లక్ష్యాన్ని, కంపెనీని కూడా మీరు ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. మీ ప్రవర్తన.. మీరు ఓపెన్ ఏఐని పర్యవేక్షించే సామర్థ్యం లేదని స్వయంగా వెల్లడించింది’ అని ఆ లేఖ పేర్కొంది.
సామ్ ఆల్ట్‌మన్‌ను ఓపెన్ ఏఐ తొలగించగానే మైక్రోసాఫ్ట్ వెంటనే ఆయనను రిక్రూట్ చేసుకుంది. కొత్తగా ఏఐ ఫ్రంట్‌ను ప్రారంభించి దాని నేతృత్వ బాధ్యతలను సామ్ ఆల్ట్‌మన్‌కు అప్పగించారు. సామ్ ఆల్ట్‌మన్‌ను తీసుకున్నట్టు స్వయంగా సత్య నాదెళ్ల వెల్లడించారు.
Also Read : Caste: కాబోయే భర్త ఇంటిలో నవవధువు మృతి.. తక్కువ కులం అని చంపేశారు: యువతి తల్లిదండ్రులు
500 మంది ఉద్యోగులు సంతకాలు పెట్టిన ఆ లేఖను టెక్నాలజీ జర్నలిస్టు కారా స్విషర్ షేర్ చేశారు. ఈ లేఖతో ఆ ఉద్యోగులు కూడా ఓపెన్ ఏఐకి రాజీనామా చేసి మైక్రోసాఫ్ట్‌లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయి.
ఓపెన్ ఏఐ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సుత్స్‌కేవర్ కూడా ఈ లేఖపై సంతకం పెట్టడం గమనార్హం. సామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించిన బోర్డులో ఇల్యా కూడా సభ్యులు. ఈ చర్యలో పాల్గొన్నందుకు తాను బాధపడుతున్నట్టు ఇల్యా ఎక్స్ వేదికగా తెలిపారు.