న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం ఉద్యోగులపై వివిధ రకాలుగా ఉంది. అయితే భారతదేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గతంతో పోలిస్తే ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. వచ్చే ఆరు నెలల్లో తమ ఆదాయం, ఖర్చులు పెరుగుతాయని ప్రతి నలుగురిలో ఒకరు పేర్కొన్నారని లింక్డ్ ఇన్ సర్వేలో తేలింది. 

దేశవ్యాప్తంగా 1351 మంది ఉద్యోగులు, నిపుణులను లింక్డ్ ఇన్ ఈ నెల 14వ తేదీ వరకు సర్వే చేసింది. తమ వ్యక్తిగత ఆర్థిక స్థితిపై చాలా మంది ఆశాభావంతో ఉన్నామని సర్వేలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.

మే 4-17 మధ్యనాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం భద్రతాభావం పెరిగింది. ఉద్యోగులు తమ ఆదాయం, మిగులుపై సానుకూలంగా ఉన్నారు. మే 4-17 తేదీల మధ్య జరిగిన సర్వేలో 1640 మంది పాల్గొనగా, 20 శాతం మంది తమ ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. 

27 శాతం మంది ఉద్యోగులు మిగులు ఉంటుందని, మరో 23 శాతం మంది ఖర్చులు పెరుగుతాయని భావిస్తున్నట్లు సర్వేలో తేలిందని లింక్డ్ ఇన్ తెలిపింది. ఈ మధ్య జరిపిన సర్వేలో ప్రతి నలుగురిలో ఒకరు రాబోయే ఆరు నెలల్లో ఆదాయం, వ్యక్తిగత ఖర్చులు పెరుగుతాయని అంచనా వేశారు. 

also read  కిరాణా సరుకుల కోసం అమెజాన్ కొత్త సేవలు.. ఎలా ఆర్డర్ చేయాలంటే..? ...

ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు తమ వ్యక్తిగత మిగులు, వ్యక్తిగత రికరింగ్ అప్పుల చెల్లింపులు పెరుగుతాయని అన్నట్లు లింక్డ్ ఇన్ ఉద్యోగుల ఆత్మ విశ్వాస సూచీలో తేలింది. స్వల్ప కాల యాజమాన్య ఆత్మ విశ్వాసం విషయానికి వస్తే 50 శాతం కార్పొరేట్ సేవలు, 46 శాతం తయారీ రంగం, 41 శాతం విద్యా రంగ నిపుణులు తమ కంపెనీల్లో పరిస్థితులు రాబోయే ఆరు నెలల్లో మెరుగవుతయని ధీమాగా ఉన్నారు. 

కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్నా 40-54 ఏళ్ల మధ్య వయస్కుల్లో 38 శాతం, 55 ఏళ్లు, ఆ పై వయస్సు గల వారిలో 29 శాతం మంది తమను అనుమతినిస్తే కంపెనీలకు వచ్చి పని చేయడానికి సిద్ధమని చెబుతున్నారు.

అయితే 25 ఏళ్ల లోపు వయస్సు గల వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఇంటినుంచే పని చేయడం సురక్షితమని భావిస్తున్నారు. ప్రయాణం, భోజన సమయంలో నిర్లక్ష్యంగా ఉండే కొందరితో ప్రమాదం ఉంని 55 శాతం మంది అంటున్నారు.