న్యూఢిల్లీ: దేశ భద్రత కోసం టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిర్ణయాన్ని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ స్వాగతించారు. విశేష జనాదరణ పొందిన టిక్ టాక్, యూసీ బ్రౌజర్, వియ్ చాట్, షేర్ ఇట్ తదితర యాప్‌లను దేశంలో నిషేధించడం జాతి ప్రయోజనాల విషయంలో తీసుకున్న సాహసోపేతమైన అడుగు అని విజయ్ శేఖర్ శర్మ అభివర్ణించారు. 

డిజిటల్ చెల్లింపులు, ఈ-కామర్స్ సేవలు అందిస్తున్న పేటీఎం యాప్‌ను వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అనే భారత సంస్థ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదో మొబైల్ ఇంటర్నెట్ కంపెనీ. ఇందులో చైనా కంపెనీలైన ఆలీబాబా, యాంట్ ఫైనాన్స్ సంస్థలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టాయి.

అయినా చైనా యాప్‌లను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ స్పందించడం విశేషం. కేంద్రం నిర్ణయంపై మంగళవారం ఆయన స్పందిస్తూ జాతి ప్రయోజనాల విషయంలో ఇది సాహసోపేతమైన నిర్ణయం, ధైర్యంతో కూడిన చర్య అని అభిప్రాయపడ్డారు. భారతీయ పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి ప్రజలకు కొత్త ఆవిష్కరణలను అందించాల్సిన సమయం ఇదేనని పిలుపునిచ్చారు. 

also read టిక్‌టాక్‌ స్థానంలో ఇండియన్ యాప్.. గంటకు 2 మిలియన్లకు పైగా వ్యూవర్స్.. ...

మరోవైపు 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించడంపై భారత ఇంటర్నెట్ కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి. భారతీయ టెక్ కంపెనీలు తిరిగి పుంజుకోవడానికి, ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రచారం ఊపందుకోవడానికి ఈ నిర్ణయం చక్కగా పనికి వస్తుందని పేర్కొన్నాయి.

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ట్రెల్ సహ వ్యవస్థాపకుడు పులకిత్ అగర్వాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆత్మనిర్భర్ భారత్‌కు చేరువగా తీసుకెళ్తుందని పేర్కొన్నారు. 

స్వదేశీ యాప్స్ విప్లవం సృష్టిస్తాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో తమలాంటి స్టార్ట్‌ప్ కంపెనీలు గొప్ప పాత్ర పోషిస్తాయన్నారు. డిజిటల్ ఇండియా విప్లవంలో భాగస్వాములం కావడానికి సిద్ధంగా ఉన్నట్టు అగర్వాల్ చెప్పారు.