Asianet News TeluguAsianet News Telugu

ఓపెన్ఏఐ సీఈవో తొలగింపు , సిలికాన్ వ్యాలీ ఉలికిపాటు.. ఆల్ట్‌మాన్ నిష్క్రమణ ‘‘ఏఐ’’ విస్తరణపై చూపే ప్రభావంత..?

అనూహ్య ఘటనల నేపథ్యంలో ఏడాది క్రితం చాట్‌జిపిటిని ప్రారంభించిన ఓపెన్‌ఏఐ.. శుక్రవారం తన సిఈవో సామ్ ఆల్ట్‌మాన్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలో ఆయన ప్రభావవంతమైన పాత్రను పరిగణనలోకి తీసుకుంటే , ఆల్ట్‌మాన్ తొలగింపు సాంకేతిక ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 

OpenAI CEO Sam Altman's ouster rattles Silicon Valley: Decoding the impact and future of AI landscape ksp
Author
First Published Nov 18, 2023, 5:18 PM IST

అనూహ్య ఘటనల నేపథ్యంలో ఏడాది క్రితం చాట్‌జిపిటిని ప్రారంభించిన ఓపెన్‌ఏఐ.. శుక్రవారం తన సిఈవో సామ్ ఆల్ట్‌మాన్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ మద్దతుతో ఆల్ట్‌మన్‌ను తొలగించాలనే నిర్ణయం కలకలం రేపుతోంది. ఆయన నాయకత్వ సామర్థ్యాలపై కంపెనీ విశ్వాసం కోల్పోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంలో ఆయన ప్రభావవంతమైన పాత్రను పరిగణనలోకి తీసుకుంటే , ఆల్ట్‌మాన్ తొలగింపు సాంకేతిక ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆల్ట్‌మాన్.. ఎక్స్‌‌లో తన నిష్క్రమణను బహిరంగంగా అంగీకరించారు. ఓపెన్ఏఐలో తాను ఇన్నిరోజులు గడిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగతంగా రూపాంతరం చెందడం, ప్రతిభావంతులైన వ్యక్తులతో పనిచేయడం తనకు ఇష్టం. తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి  వుందని ఆయన ట్వీట్ చేశారు. 

ఆల్ట్‌మాన్‌ని ఎందుకు తొలగించారు :

ఓపెన్‌ఏఐ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సుత్‌స్కేవర్, క్వారా సీఈవో ఆడమ్ డి ఏంజెలో, టెక్నాలజీ వ్యవస్థాపకుడు తాషా మెక్‌కాలీ, జార్జ్‌టౌన్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీకి చెందిన హెలెన్ టోనర్‌లతో కూడిన ఓపెన్ఏఐ బోర్డ్ .. సమీక్ష అనంతరం ఆల్ట్‌మాన్‌ను తొలగించింది. బోర్డుతో తన కమ్యూనికేషన్‌లలో స్థిరంగా లేడని , అదే ఆయన తొలగింపుకు దారితీసిందని వెల్లడించింది. ఓపెన్ఏఐకి నాయకత్వం వహించే అతని సామర్థ్యంపై బోర్డుకు విశ్వాసం లేదని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ యువ సీఈవో ప్రవర్తన బోర్డు తన బాధ్యతలను నిర్వర్తించే సామర్ధ్యానికి అడ్డం కలిగిస్తోందని తెలిపింది. 

 

 

ఓపెన్ఏఐ ఉద్దేశపూర్వకంగా మా మిషన్‌ను ముందుకు తీసుకెళ్లడానికి రూపొందించబడింది. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ మొత్తం మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా చేయడానికి బోర్డు పూర్తిగా కట్టుబడి వుంది. ఓపెన్ఏఐ స్థాపన , వృద్ధికి సామ్ సహాయ సహకారాలకు తాము కృతజ్ఞులమని బోర్డ్ బ్లాగ్‌లో తెలిపింది. శామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించడంతో కంపెనీ ప్రస్తుత చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటి తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమితులయ్యారు. కొత్త సీఈవోని ఎంపిక చేసే వరకు మురతీ ఈ బాధ్యతల్లో వుంటారు. 

ఆల్ట్‌మాన్ ప్రస్థానం :

ఏప్రిల్ 22, 1985న చికాగోలోని జన్మించిన సామ్ ఆల్ట్‌మాన్ .. ఏఐ ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులలో ఒకరు. ఓపెన్ఏఐ స్థాపనలో కీలకపాత్ర పోషించిన అతను 2015లో లాభాపేక్షలేని పరిశోధనా ప్రయోగశాలగా దాని పునాదిలో కీలకపాత్ర పోషించాడు. ఆల్ట్‌మాన్ 2020 నుంచి 2023 వరకు ఓపెన్ఏఐలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో చాట్‌జీపీటీని ప్రపంచానికి పరిచయడం చేయడంలో గుర్తింపు పొందాడు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ అపూర్వమైన సామర్ధ్యాలను ప్రదర్శించింది. పద్యాలు , కళాకృతులు , మానవ స్థాయి కంటెంట్‌ను ఇది సెకన్ల వ్యవధిలో వేగంగా ప్రొడ్యూస్ చేస్తుంది. 

 

 

గతంలో శామ్ ఆల్ట్‌మాన్ 2011 నుంచి 2019 వరకు వై కాంబినేటర్‌కు ప్రెసిడెంట్‌గా వున్నారు. 19 ఏళ్ల వయసులో ఆయన లొకేషన్ ఆధారిత సోషల్ నెట్‌వర్కింగ్ మొబైల్ అప్లికేషన్ అయిన లూప్ట్‌కు కో ఫౌండర్‌గా వ్యవహరించాడు. ఆల్ట్‌మాన్ క్లుప్తంగా 2014లో రెడ్డిట్ సీఈవోగా పనిచేశారు. యిషాన్ వాంగ్ రాజీనామా తర్వాత 8 రోజులపాటు సేవలందించారు. ఆల్ట్‌మాన్ జనరేటివ్ ఏఐ డెవలప్‌మెంట్‌కు ఫేస్‌గా పనిచేశారు. ఇది సిలికాన్ వ్యాలీపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఓపెన్ఏఐ నుంచి ఆయన నిష్క్రమణ టెక్ ప్రపంచానికి షాక్ కొట్టినట్లయ్యింది. టెక్ట్స్, ఇమేజ్‌ల నుంచి కంప్యూటర్ కోడ్ వరకు కొత్త కంటెంట్‌ను రూపొందించడానికి హిస్టారికల్ డేటా నుంచి నేర్చుకోవడమే జనరేటివ్ ఏఐ . 

ఆల్ట్‌మాన్ లేకుండా చాట్‌జీపీటీని ఊహించగలమా :

ఆల్ట్‌మాన్ ప్రభావం బోర్డ్‌రూమ్‌కు మించి విస్తరించి, ఓపెన్ఏఐ వృద్ధిలో ఆయన కీలకపాత్ర పోషించారు. 2022లో చాట్‌జీపీటీని విజయవంతంగా నిర్వహించిన ఆయన ఏఐ ప్రపంచంలో ప్రముఖ వ్యక్తి అయ్యాడు. ఈ వినూత్న అప్లికేషన్ వేగంగా ప్రాచుర్యంలోకి రావడమే కాక.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లలో ఒకటిగా పరిణామం చెందింది. ఆల్ట్‌మాన్ సమర్ధుడైన కార్యనిర్వాహకుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఈయన కృషి కారణంగా ప్రభుత్వాలు నైతికంగా ఏఐపై ఫోకస్ పెట్టాల్సిన అవసరాన్ని ఆయన కల్పించాడు. ఈ ఏడాది ఆయన పర్యటనలు కూడా ఈ రంగంలో ఆల్ట్‌మాన్ ప్రాముఖ్యతను మరింత పటిష్టం చేశాయి. 

 

 

నిధుల సమీకరణ విషయంలోనూ ఓపెన్ఏఐ విజయవంతమైంది. వ్యూహాత్మక భాగస్వాముల నుంచి బిలియన్ డాలర్ల మొత్తంలో గణనీయమైన పెట్టుబడులను పొందింది. ఇందులో మైక్రోసాఫ్ట్ ప్రధాన కంట్రిబ్యూటర్‌గా నిలిచింది. దీనితో పాటు సీక్వోయా క్యాపిటల్, ఆండ్రీసెన్ హోరోవిట్జ్, జోష్ కుష్నర్ నేతృత్వంలోని థ్రైవ్ క్యాపిటల నుంచి పెట్టుబడులను సైతం అందుకుంది. ఇటీవల థ్రైవ్ క్యాపిటల్ 1 బిలియన్ డాలర్ల వరకు ఉద్యోగుల చేతుల్లో వున్న స్టాక్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఓపెన్ ఏఐ విలువ 86 బిలియన్ డాలర్లు. సాంకేతిక, పెట్టుబడి రంగాలలో కీలకమైన వ్యక్తుల నుంచి ఈ కంపెనీ గణనీయమైన స్థాయిలో నిధులు సేకరించింది. 

 

 

ప్రస్తుతం ఆల్ట్‌మాన్ నిష్క్రమణ.. సంస్థ పెట్టుబడులను సురక్షితంగా వుంచుతుందా లేదా అన్న దానిపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. మైక్రోసాఫ్ట్‌తో చర్చలను విజయవంతంగా నిర్వహించిన నిధుల సమీకరణగా ఆల్ట్‌మాన్ పేరు సంపాదించారు. ఈయన కృషి ఫలితంగానే డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది కంపెనీ టెండర్ ఆఫర్ లావాదేవీలలోనూ ఆల్ట్‌మాన్ ప్రధాన భూమిక పోషించడం వల్లే ఓపెన్‌ఏఐ విలువ 29 బిలియన్ డాలర్ల నుంచి 80 బిలియన్ డాలర్లకు పెరగడానికి గణనీయంగా దోహదపడింది. 

విజయవంతంగా నిధుల సమీకరణ :

నిధుల సమీకరణకు అతీతంగా, ఆల్ట్‌మాన్ సాంకేతిక విపణీలో ప్రత్యేకించి ఏఐ ఇంజనీరింగ్‌లో ప్రతిభను పొందడం వరకు విస్తరించింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల నుంచి అగ్రశ్రేణి నిపుణులను రిక్రూట్ చేయడం ఆయన సత్తాకు నిదర్శనం. బిల్‌గేట్స్, స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్ బర్గ్ వంటి టెక్ టైటాన్‌ల అడుగుజాడలను అనుసరిస్తూ టెక్ స్టార్టప్‌ను స్థాపించేందుకు కళాశాల విద్యను వదులుకోవాలని ఆల్ట్‌మాన్ నిర్ణయించారు. తన కాలేజీ విద్యను పూర్తి చేయనప్పటికీ, ఆల్ట్‌మాన్ గణనీయమైన ఆర్ధిక విజయాన్ని సాధించాడు. ఆయన నికర సంపద విలువ 500 మిలియన్ డాలర్ల నుంచి 700 మిలియన్ల వరకు వుంటుందని అంచనా. ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించినట్లుగా.. ఈ సంపద ఆల్ట్‌మాన్ పెట్టుబడులు, వెంచర్ల నుంచి సంపాదించారు. 

 

 

ఆల్ట్‌మాన్ నికర విలువలో ఎక్కువ భాగం ప్రైవేట్‌గా నిర్వహిస్తున్న కంపెనీలలో అతని ఈక్విటీ యాజమాన్యంతో ముడిపడి వుంది. దీని వల్ల ఆయన ఆర్ధిక స్థితిని గుర్తించడం సవాలుగా మారింది. ఆల్ట్‌మాన్ సారథ్యం వహించిన, స్థాపించిన , మద్ధతిచ్చిన కంపెనీలు సమిష్టిగా 500 బిలియన్ డాలర్ల విలువను కలిగి వున్నాయని ఓ నివేదిక తెలిపింది. అయితే ఆల్ట్‌మాన్ నిష్క్రమణ నేపథ్యంలో టెక్ పరిశ్రమ ఉలిక్కిపడింది. ఆశ్చర్యకరంగా ఆల్ట్‌మాన్ బాటలో ఓపెన్ఏఐ ప్రెసిడెంట్, సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మన్ కూడా తన రాజీనామాను ప్రకటించారు. సాంకేతిక, వ్యాపార రంగాలకు ఈ పరిణామాలు శరాఘాతంగా తగిలాయి. 

టెక్ ప్రపంచం భిన్నాభిప్రాయాలు :

గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ స్మిత్.. సామ్ ఆల్ట్‌మాన్‌పై ప్రశంసలు కురిపిస్తూ అతన్ని హీరోగా పేర్కొన్నారు. కంపెనీని ఏమి లేని స్థాయి నుంచి 90 బిలియన్ల డాలర్లకు నిర్మించడంలో అతని అద్భుతమైన విజయాన్ని కొనియాడారు. ఆల్ట్‌మాన్ తర్వాత ఏం చేయబోతున్నారోనని స్మిత్ ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఆల్ట్‌మాన్ నిర్ణయం బిలియన్ల మంది ప్రజలపై లోతైన ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు మా కోసం చేసిన దానికి ధన్యవాదాలు అంటూ స్మిత్ ఎమోషనల్ అయ్యారు. 

 

 

ఎయిర్‌బీఎన్‌బీ కో ఫౌండర్, సీఈవో బ్రియాన్ చెస్కీ.. ఆల్ట్‌మాన్, బ్రోక్‌మాన్‌లకు తన మద్ధతు ప్రకటించారు. వారి విషయంలో జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. సామ్ ఆల్ట్‌మాన్‌ను తొలగించడాన్ని స్టీవ్ జాబ్స్‌ను ఆపిల్ తప్పించడంతో పోల్చారు టీఈడీ చీఫ్ క్రిస్ ఆండర్సన్. ఈ ఘటన తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం వుందన్నారు. బాక్స్ సీఈవో ఆరోన్ లెవీ మాట్లాడుతూ.. ఆల్ట్‌మాన్ తొలగింపు పరిశ్రమ స్వరూపాన్ని తక్షణమే మారుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

 

 

సామ్, గ్రెగ్ లేకుండా ఓపెన్ఏఐని ఊహించడం దాదాపు అసాధ్యమని ఆరోన్ పేర్కొన్నారు. వీరిద్దరూ ఏఐని ప్రధాన స్రవంతిలోకి తెచ్చారని.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించలేమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు విశ్లేషకుల ప్రకారం .. ఆల్ట్‌మాన్ నిష్క్రమణ తాత్కాలికంగా అంతరాయం కలిగించినప్పటికీ, ఏఐకి ప్రస్తుతం దక్కుతున్న ప్రజాదరణను తగ్గించడం కానీ ఓపెన్ఏఐ ప్రయోజనాలకు విఘాతం కలిగించదు. ఓపెన్ఏఐ ద్వారా సృష్టించిన ఆవిష్కరణ ఇద్దరు వ్యక్తుల ప్రభావాన్ని అధిగమిస్తుందని ఆయన నొక్కిచెప్పారు. ఆల్ట్‌మాన్ నిష్క్రమణ ఓపెన్ఏఐ .. ఈ రంగంలో తన గుత్తాధిపత్యాన్ని వదులుకునేలా చేస్తుందని నమ్మడానికి ఎలాంటి కారణం లేదని డీఏ డేవిడ్‌సన్ విశ్లేషకుడు గిల్ లూరియా తెలిపారు. 

 

 

ఇకపోతే.. చాట్‌జీపీటీ ప్రారంభించిన తర్వాత ఏఐలో పురోగతికి అనుగుణంగా నియంత్రణ ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. ఏఐ సాంకేతికతల వేగవంతమైన అభివృద్ధికి ప్రతిస్పందనగా.. ఏఐని నియంత్రించేందుకు అమెరికా చర్యలు తీసుకుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios