న్యూఢిల్లీ: భారతీయ కుబేరుడు ముకేశ్‌ అంబానీ నేతృత‍్వంలోని  రిలయన్స్ జియో మరో భారీ పెట్టుబడుల స్వీకరణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మెగా ఒప్పందాల ప్రకటనతో హ్యాట్రిక్‌​ కొట్టిన రిలయన్స్ నాలుగో ఒప్పందానికి చేరువలో ఉన్నదన్న నివేదికలు వ్యాపార వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

పెట్రోకెమికల్స్ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నిస్తున్న ముకేశ్ అంబానీ తాజాగా 320 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని చేసుకోనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జియో ప్లాట్‌ఫామ్స్ యూనిట్‌లో సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్‌) మైనారిటీ వాటాను కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తోందని తెలిసింది. 

మరోవైపు ఎయిర్‌ బీఎన్బీ, ఉబెర్ టెక్నాలజీస్ సంస్థలకు నిధులు సమకూర్చిన అమెరికా పెట్టుబడి సంస్థ జనరల్ అట్లాంటిక్, జియో ప్లాట్‌ఫామ్‌లో సుమారు 850- 950 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే అంశాన్నిగురించి చర్చిస్తున్నట్లు  సమాచారం.

ఈ మూడు సంస్థల మధ్య ఒప్పందం ఖరారు కాకున్నా ఈ నెలలోనే ఈ ఒప్పందం పూర్తి కానుందని భావిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే, సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్‌). జనరల్ అట్లాంటిక్ సంస్థలతో రిలయన్స్ జియో ప్రతిపాదిత ఒప్పందాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 

also read శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్ పై ప్రీ-బుక్‌ ఆఫర్...డిస్కౌంట్లతో పాటు క్యాష్ బ్యాక్ కూడా..

అయితే ఈ అంచనాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్, సౌదీ పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అధికారికంగా స్పందించలేదు. అటు జనరల్ అట్లాంటిక్ ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.

కాగా  జియోలో 10 శాతం వాటా కొనుగోలు ద్వారా ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ నుంచి మొత్తం సుమారు రూ. 60,600 కోట్ల (8 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులను రిలయన్స్  ప్రకటించిన సంగతి తెలిసిందే. 

జియోతో ఫేస్ బుక్ అనుబంధ వాట్సాప్ ఒప్పందంతో దేశంలో జియో మార్ట్.. ప్రత్యర్థి సంస్థలకు అమెజాన్, వాల్ మార్ట్ సంస్థలకు గట్టిపోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. తద్వారా భారతదేశంలోని వినియోగదారులను చేజిక్కించుకునేందుకు రిలయన్స్ జియో ప్రణాళికలు రూపొందిస్తోంది. వచ్చే ఏడాదికల్లా రిలయన్స్ సంస్థను రుణ రహితంగా తీర్చిదిద్దడానికి రంగం సిద్ధం అవుతోంది.