Asianet News TeluguAsianet News Telugu

మొబిక్విక్​పై వేటు.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగింపు!

కరోనా నిర్ధారణకు కేంద్ర ప్రభుత్వ యాప్ ‘ఆరోగ్య సేతు’ ప్రకటనను తొలగించనందుకు దేశీయ పేమెంట్ యాప్ మొబిక్విక్​పై గూగుల్ వేటు వేసింది. ప్రకటన నిబంధనలు ఉల్లఘించినందుకు మొబిక్విక్​ను ప్లే స్టోర్​ నుంచి తొలగించింది. అయితే ఇరు సంస్థల మధ్య సంప్రదింపుల తర్వాత మొబిక్విక్ తిరిగి ప్లే స్టోర్​లో కనిపించింది.

MobiKwik Removed From Google Play for Aarogya Setu Link in App: CEO
Author
Hyderabad, First Published May 30, 2020, 12:56 PM IST

న్యూఢిల్లీ: భారత్​కు చెందిన దేశీయ పేమెంట్స్ యాప్‌ మొబిక్విక్‌ను తన ప్లేస్టోర్ నుంచి సెర్చింజన్ ‘గూగుల్’ తొలగించింది. ఆరోగ్యసేతు యాప్ ప్రమోషన్‌కు సంబంధించిన ప్రకటనలు మొబిక్విక్‌లో కనిపించడం వల్లే గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. 

ఆరోగ్య సేతు ప్రకటనలకు సంబంధించిన ఆ లింక్‌ను తొలగించమని గూగుల్ గతంలోనే ఆ యాప్‌కు సూచించింది. వారం క్రితమే ఆ లింక్ తొలగించి వేయాలని తమను గూగుల్ హెచ్చరించిందని మొబిక్విక్ సీఈఓ బిపిన్ ప్రీత్ సింగ్ గుర్తు చేశారు.

తర్వాతేమైందో తెలియదు కానీ, గురువారం ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా సదరు యాప్‌ను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించివేసింది. అనంతరం గూగుల్, మొబిక్విక్‌ బృందాలు ఈ అంశంపై మాట్లాడి పరిష్కరించుకున్నాయి. ఆ తరవాత ఆ యాప్‌ ప్లేస్టోర్‌లో ప్రత్యక్షమైంది.

also read టిక్‌టాక్‌కు గూగుల్ ప్లే స్టోర్ చేయూత.. మళ్లీ టాప్ రేటింగ్..

కరోనా విశ్వమారి గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించే ఉద్దేశంతో తీసుకువచ్చిన కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్‌ ఆరోగ్య సేతుకు సంబంధించి జారీ చేసిన ప్రకటనలను మొబిక్విక్‌తో సహా ఇతర యాప్‌లలో చూపాలని ఆర్‌బీఐ కోరింది. ఇదే విషయాన్ని ఆ యాప్‌ సీఈఓ బిపిన్ ప్రీత్ సింగ్ గూగుల్‌కు వెల్లడించారు. 

ఈ సమస్యను లేవనెత్తుతూ గూగుల్, కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ సీఈఓ, పీఎంఓ, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ట్విటర్‌లో ట్యాగ్ చేశారు. మొబిక్విక్‌తో పాటు పేటీఎం, స్విగ్గీ, వంటి ఇతర యాప్‌లు కూడా ఆరోగ్య సేతుకు సంబంధించిన ప్రకటనలను చూపుతున్నాయి. అయితే ఆరోగ్య సేతుకు సంబంధించిన లింక్‌ను తొలగించిన తరవాతే మొబిక్విక్‌ ప్లేస్టోర్‌లో కనిపించింది.

సందేహాలు పరిష్కరించుకున్న తర్వాత కొత్త రూపంలో మొబిక్విక్ యాప్.. గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రత్యక్షమైంది. మొబిక్విక్ యాప్‌లో ఆరోగ్య సేతు యాప్ ప్రమోషన్ వల్ల ఎటువంటి హాని లేదని గూగుల్ కు వివరణ ఇచ్చామని బిపిన్ ప్రీత్ సింగ్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios