కరోనా ఎఫెక్ట్: లాప్‌టాప్ ఇక నిత్యావసరమే..పెరుగనున్నడిమాండ్..

కరోనా ప్రభావంతో పలు సంస్థలు ఉద్యోగులతో ‘వర్క్ ఫ్రం హోం’ విధానానికే మొగ్గు చూపుతున్నాయి. మరోవైపు త్వరలో వ్రుత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఆన్ లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌‌లకు డిమాండ్ పెరుగనున్నది.  ఇటీవలి కాలంలో ల్యాప్‌టాప్‌ల విక్రయాలు రెండింతలు పెరిగాయి. లాప్ టాప్, కంప్యూటర్ల తయారీ కంపెనీలు కూడా భారీ డిస్కౌంట్లతో వాటిని అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Laptops in demand with WFH, online classes

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పుణ్యమా! అనిని ప్రపంచవ్యాప్తంగా ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ కల్చర్ ప్రాచుర్యం పెరుగుతోంది. మరోవైపు ఆన్ లైన్ క్లాస్ బోధనలు మున్ముందు పెరుగనున్నాయి. దీంతో డెస్క్ టాప్ కంప్యూటర్లు, లాప్ టాప్‌లకు డిమాండ్ పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమలులో లేకున్నా... నిబంధనలు సడలిస్తున్నా కూడా కంపెనీలు ఎక్కువ మంది ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయించడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు కూడా మెల్లగా నిత్యావసరాల జాబితాలోకి చేరిపోతున్నాయి.

ఫలితంగా... నిబంధనలు సడలించిన వెంటనే ఎలక్ట్రానిక్ షాపులకు కస్టమర్ల తాకిడి పెరిగింది. ఐటీ సహా పలు రంగాల్లోని ఉద్యోగులకు ఇళ్లలో కూడా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ తప్పనిసరి అవుతున్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. రానున్న రెండేళ్లూ డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు బాగా పెరుగుతాయని వారి అంచనా.

నిజానికి లాక్‌డౌన్‌కు ముందు ఎలక్ట్రానిక్స్ ప్రత్యేకించి డెస్క్ టాప్, లాప్ టాప్ ఉత్పత్తులపై ఎలాంటి డిస్కౌంట్లూ లేవు. ఇపుడు మాత్రం పలు కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకోవటానికి గిఫ్ట్‌ కార్డులు, డిస్కౌంట్లు వంటివి ఇస్తున్నాయి. హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్‌ వంటి కంపెనీలు వ్యక్తిగత కొనుగోలుదార్లకు 15 శాతం దాకా తగ్గింపు ఆఫర్‌ ఇస్తున్నాయి.

అలాగే స్క్రాచ్‌కార్డ్‌తో మొబైల్, ట్యాబ్లెట్‌ వంటి బహుమతులు, రూ.50,000 వరకు క్యాష్‌బ్యాక్‌, ఎంపిక చేసిన మోడళ్లపై రూ.8,000 విలువ చేసే యాక్సెసరీస్‌ను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. 25 పైన యూనిట్లు కొనుగోలు చేసే ఇన్‌స్టిట్యూషనల్‌ కస్టమర్లకయితే చాలా కంపెనీలు తమ డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లపై 40 శాతం, యాక్సెసరీస్‌పై 25 శాతం దాకా డిస్కౌంట్‌ ఇస్తున్నాయి.

వ్యక్తిగత కొనుగోలుదార్ల కోసం గతంలో బ్యాంకులు, రుణ సంస్థలు స్పెషల్‌ స్కీములు ఆఫర్‌ చేసేవి. ఆరు నెలల్లో గనుక తిరిగి తీర్చేసేలా ఉంటే ఎలాంటి వడ్డీ, ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేసేవి కాదు. డౌన్‌ పేమెంట్‌ కూడా ఉండేది కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, ఆరు శాతం వడ్డీ వసూలు చేస్తున్నామని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) అధికారి ఒకరు చెప్పారు. 

also read  5జి సపోర్ట్ తో షియోమీ రెడ్ మి ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్...

ప్రైవేటు బ్యాంకులైతే ప్రాసెసింగ్‌ ఫీజు రూ. 500తో పాటు డౌన్‌ పేమెంట్‌ 35% ఉండాలన్న నిబంధన విధిస్తున్నాయి. దీంతో పూర్తి నగదు చెల్లించి ఉపకరణాన్ని కొనేందుకే ఎక్కువ మంది కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు.

లాక్‌డౌన్‌కు ముందుతో పోలిస్తే నిబంధనలు సడలించాక అమ్మకాలు రెట్టింపయ్యాయని దేశంలోని టాప్‌ సెల్లర్స్‌లో ఒకరైన ఐటీ మాల్‌ ఎండీ మొహమ్మద్‌ అహ్మద్‌ చెప్పారు. ‘ఇన్‌స్టిట్యూషనల్‌ సేల్స్‌ కూడా గణనీయంగా పెరిగాయి. విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులు మొదలుపెడితే డిమాండ్‌ అనూహ్యంగా ఉంటుంది’ అని తెలిపారు.

‘మొత్తం విక్రయాల్లో ల్యాప్‌టాప్‌లు 85%, డెస్క్‌టాప్‌లు 15% వరకు ఉంటున్నాయి. వీటిలో కూడా రూ.35–50 వేల శ్రేణి ల్యాప్‌టాప్‌లు, రూ.25–50 వేల శ్రేణి డెస్క్‌టాప్‌ల సేల్స్‌ ఎక్కువ’’ అని ఐటీ మాల్‌ ఎండీ మొహమ్మద్‌ అహ్మద్‌ చెప్పారు. 

తయారీ, సరఫరా సమస్యల కారణంగా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ల ధర కంపెనీని బట్టి 5–12% పెరిగినట్లు ఐటీ మాల్‌ ఎండీ మొహమ్మద్‌ అహ్మద్‌ తెలిపారు. ఇక హార్డ్‌ డిస్క్, ర్యామ్, అడాప్టర్ల వంటి యాక్సెసరీస్‌ ధరలు రెట్టింపయ్యాయి. ‘అయినా కస్టమర్లు వెనుకాడడం లేదు. సర్వీస్‌ రిక్వెస్టులూ పెరిగాయి’ అని చెప్పారు.

ఆసుస్ ఇండియా సంస్థ 65 శాతం లాప్ టాప్ కంప్యూటర్లకు డిమాండ్ ఉందని చెప్పారు. మిగతా 35 శాతం కన్జూమర్ నోట్స్ బుక్స్ కోసం వస్తున్నారని తెలిపింది. ఆన్ లైన్స్ సేల్స్‌లో స్వల్ప కాలంలోనే డిమాండ్ పెరిగిందని లెనోవో ఇండియా ఎండీ రాహుల్ అగర్వాల్ చెప్పారు. సంస్థల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయన్నారు.

పర్సనల్ కంప్యూటర్ కోసం సగటున 45 లక్షల యూనిట్ల కోసం డిమాండ్ ఉంటుంది. రెడ్ జోన్ల పరిధిలో పూర్తిగా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమైతే డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి.  స్నాప్ డీల్ లాప్ టాప్ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల విడి భాగాలకు డిమాండ్ రెట్టింపైంది. పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో గణనీయ డిమాండ్ పెరిగింది.

కోహినూర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ విశాల్ మేవాని మాట్లాడుతూ లాక్ డౌన్ కు ముందుతో పోలిస్తే లాప్ టాప్ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 10 శాతం నుంచి 25 శాతం పెరిగాయన్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios