న్యూఢిల్లీ: భారత టెలికం రంగంలోకి ఇంటర్నేషనల్ టెక్ దిగ్గజాలు.. రంగంలోకి దిగుతున్నాయా? భారత టెలికం రంగాన్ని ప్రభావితం చేయనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంతకుముందు రిలయన్స్ జియో ఫ్లాట్ ఫామ్స్‌లో ఫేస్‌బుక్ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడమే నిదర్శనం. భారతదేశంతోపాటు అంతర్జాతీయ టెలికం రంగంలోకి గ్లోబల్ టెక్ దిగ్గజాలు అడుగు పెట్టనున్నాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

వొడాఫోన్‌ ఐడియా ఇండియాలో టెక్‌ దిగ్గజం గూగుల్‌ 5 శాతం వాటా కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తోంది. ఈ డీల్‌ ఖరారైతే రూ.వేల కోట్ల నష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వొడాఫోన్‌ ఐడియా సంస్థకు ఊరట కలిగే అవకాశం ఉంది.
 
రిలయన్స్‌ జియోలో 10 శాతం వాటాల మేరకు ఫేస్‌బుక్‌ పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో వొడాఫోన్‌ ఇండియాలో వాటా కొనుగోలు చేయడానికి గూగుల్‌ సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఫేస్ బుక్ జియో ఒప్పందం విలువ 570 కోట్ల బిలియన్ల డాలర్లు. వొడాఫోన్‌ ఐడియా ఇండియాలో గూగుల్‌ 5 శాతం వాటా కొనుగోలు చేయనుందని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ వెల్లడించింది.

ఈ ఒప్పందం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున ఒప్పందంలో మార్పులు చోటుచేసుకోవచ్చని తెలిపింది. రిలయన్స్‌ జియోలో ఫేస్‌బుక్‌ పదిశాతం వాటా కొనుగోలుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో వొడాఫోన్‌లో గూగుల్‌ పెట్టుబడుల అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

also read తస్మాత్ జాగ్రత్త: వచ్చేనెలలో పెట్రోల్, డీజిల్ ధరల మోత.. లీటర్ పై భారీగా పెంపు..

మరోవైపు రిలయన్స్ జియోతో ఫేస్‌బుక్‌ ఒప్పందం ఖరారు కాకముందే జియోలో వాటా కొనుగోలుకు గూగుల్‌ ఆసక్తి కనబరిచినట్టు ప్రచారం సాగింది. టెక్‌ దిగ్గజ సంస్థలు గూగుల్‌, ఫేస్‌బుక్‌ సంస్థలు టెలికాం రంగంలోకి ప్రవేశించడంతో టెలికాం మార్కెట్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయోననే ఉత్కంఠ నెలకొంది.

వొడాఫోన్ ఐడియాలో పెట్టుబడులు పెట్టడం ద్వారా టెలికం రంగంలోకి అడుగు పెట్టాలని గూగుల్ చేస్తున్న ప్రయత్నం నిజమైతే గ్లోబల్ టెలికం సంస్థ వొడాఫోన్ సబ్ స్క్రైబర్లకు సానుకూల అంశమే మరి. 

2016లో భారత టెలికం రంగంలోకి రిలయన్స్ జియో వచ్చిన తర్వాత సమూల మార్పులు వచ్చాయి. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలను దాటేసి దేశంలోనే నంబర్ వన్ టెలికం సంస్థగా రిలయన్స్ జియో నిలిచింది. దీంతో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కస్టమర్లను కోల్పోయి నష్టాల్లో చిక్కుకున్నాయి.

అయితే, కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో మొబైల్ ఫోన్లపైనా, ఇంటర్నెట్, వీడియోల వినియోగంపైనా కేంద్రీకరించారు. దీంతో మున్ముందు ఇంటర్నెట్, డేటా వినియోగం తదితర అంశాలకు ప్రజల నుంచి డిమాండ్ ఉంటుందని సమాచారం. కనుక మున్ముందు భారత టెలికం రంగం లాభదాయకంగా మారుతుందని పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.