న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలో స్వావలంభన సాధన దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇప్పటికే చైనా యాప్‌ల వినియోగంపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం.. దేశీయంగా యాప్స్, టెక్నలజీ డెవలప్‌మెంట్‌ కోసం ఉత్సాహవంతులకు సవాల్ విసిరింది. తద్వారా ఈ-కామర్స్ రంగంలోనూ దేశీయ సంస్థలకు పెద్దపీట వేయాలని సంకల్పించింది.

ప్రస్తుతం దేశంలోని పలు రంగాల్లో విదేశీ కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. దీని వల్ల దేశీయంగా పురుడుపోసుకునే కొన్ని కంపెనీలు ఆదిలోనే అంతరించిపోతున్నాయి. మరికొన్ని కంపెనీలు ఆరంభంలో నిలదొక్కుకున్నా.. మనుగడ సాగించడానికి పలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి.

దేశీయ ఈ-కామర్స్‌ రంగంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రంగంలో తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. కొన్ని కంపెనీల విపరీత ధోరణులను ఇతర కంపెనీలు ఎదుర్కోలేకపోతున్నాయి. వినియోగ దారులు కోట్లలో ఉంటున్నా రు. వీరికి సంబంధించిన కీలక సమాచారం ఈ కంపెనీల చేతిలో ఉంటోంది.

సమాచార భద్రతపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరికొత్త ఈ-కామర్స్‌ విధానాన్ని రూపొందిస్తోంది. ఈ విధానం ముసాయిదాలోని అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

విదేశీ కంపెనీల ఆగడాలను కట్టడి చేసే విధంగా నిబంధనలు ఉన్నాయి. దీని ప్రకారం.. స్థానిక స్టార్టప్‌ కంపెనీలకు దన్నుగా నిలిచే చర్యలు ప్రభుత్వం తీసుకోబోతోంది. అంతేకాక కంపెనీలు తమ వద్దనున్న సమాచారాన్ని (డేటా) ఏవిధంగా నిర్వహిస్తున్నాయో ప్రభుత్వం పర్యవేక్షించనుంది. 

అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ తదితర విదేశీ కంపెనీల ఆధిపత్యం అధికమవుతున్న నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేయాలన్న వాదనలు తెరపైకి వచ్చాయి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న సర్కార్ గత రెండేళ్లుగా ఈ-కామర్స్‌ విధానంపై పని చేస్తోంది.

వాణిజ్యశాఖలోని పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం ఈ ముసాయిదా విధానాన్ని రూపొందించింది. ప్రభుత్వం తీసుకొచ్చే విధానం ప్రకారం ఈ-కామర్స్‌ రంగంలోని కంపెనీల మధ్య పోటీని పర్యవేక్షిస్తూ నియంత్రించడానికి ఒక రెగ్యులేటర్‌ను ప్రభుత్వం నియమించనున్నది.

also read చైనాయాప్ టిక్ టాక్ పై మళ్ళీ బ్యాన్.. ఇప్పుడు అమెరికాలో..? ...

ఈ రెగ్యులేటర్‌ అవసరమైన సమాచార వనరులను పొందేందుకు కేంద్రం అధికారం కల్పించనున్నది. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌ కంపెనీలకు సోర్స్‌ కోడ్స్‌, ఆల్గారిథమ్‌లను కూడా ప్రభుత్వం పొందడానికి అవకాశం ఉంటుంది. వీటి వల్ల పోటీదారుల్లో ఉన్న డిజిటల్‌ ప్రేరేపిత పక్షపాతాన్ని తొలగించే అవకాశం ఏర్పడనుంది. 

దేశంలో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. దాదాపు 50 కోట్ల మంది డిజిటల్‌ సేవలను వినియోగించుకుంటున్నారని సమాచారం. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ రిటైల్‌ నుంచి కంటెంట్‌ స్ర్టీమింగ్‌ వరకు, మెసేజ్‌ల నుంచి డిజిటల్‌ చెల్లింపుల వరకు అన్ని విభాగాల్లోనూ పోటీ నెలకొంటోంది. 

ఈ-కామర్స్, డిజిటల్ చెల్లింపుల విభాగాల్లో అంతర్జాతీయంగా ఉన్న బడా కంపెనీలదే హవా. మన దేశంలో అపార అవకాశాలు ఉండటంతో ఈ కంపెనీలు దేశంలోకి ప్రవేశించి క్రమంగా తమదే పైచేయిగా మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక స్టార్టప్స్‌ ప్రభుత్వం శరణుజొచ్చాయి. ఇటీవలే చైనా యాప్‌లను భారత్‌ నిషేధించింది.

దేశంలోని వినియోగదారుల ప్రయోజనాలు, స్థానిక ఏకోసిస్టమ్‌కు కేంద్రం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఎక్కువ సంఖ్యలో సర్వీసులు అందించే కంపెనీలు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. కంపెనీలు మార్కె ట్లో తమ నాయకత్వ స్థానాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండే విధానాలు అనుసరిస్తోంది.  

కేంద్ర ప్రభుత్వ ముసాయిదా విధానం ప్రకారం.. ఈ-కామర్స్‌ కంపెనీలు ప్రభుత్వం కోరిన 72 గంటల్లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. జాతీయ భద్రతా, టాక్సేషన్‌, లా అండ్‌ ఆర్డర్‌ వంటివి ఇందులో ఉన్నాయి. 

ఈ-కామర్స్‌ కంపెనీలు వినియోగదారులకు అమ్మకందారుల వివరాలు అందించాలి. వారి ఫోన్‌ నెంబర్లు, కస్టమర్‌ ఫిర్యాదు కాంటాక్ట్‌ లు, ఈ-మెయిల్‌, చిరునామాలు ఇవ్వాలి. దిగుమతి చేసుకున్న ఉత్పత్తులు ఏ దేశానికి చెందినవో తెలియజేయాల్సి ఉంటుంది.