బ్యాంకింగ్ సేవలను ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ (ఇండియా పోస్ట్), ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) మంగళవారం కొత్త డిజిటల్ చెల్లింపు యాప్ ‘డాక్‌పే’ ను విడుదల చేసింది.

కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ భారతదేశం అంతటా డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీస్ అందించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ యాప్‌ను ఆవిష్కరించారు.

నేడు వర్చువల్ కార్యక్రమం ద్వారా ‘డాక్‌పే’ యాప్ లాంచ్ జరిగింది. ఇందులో ఐటి, టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు.  డాక్ పే కేవలం డిజిటల్ పేమెంట్ యాప్ మాత్రమే కాదు, సంబంధిత బ్యాంక్, ఇతర పోస్టల్ సేవలను కూడా అందిస్తుంది.

పోస్ట్‌పే యాప్ డిజిటల్ పేమెంట్ కోసం క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసే సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఈ కార్యక్రమంలో కోవిడ్ -19పై పోరాటంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ చేసిన కృషిని రవిశంకర్ ప్రసాద్ ప్రశంసించారు.

also read తక్కువ ధరకే బెజెల్-లెస్ స్క్రీన్లతో ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్ టీవీలు.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే.. ...

ఈ యాప్ దేశంలోని ఏ బ్యాంకుతోనైనా వినియోగదారులకు ఇంటర్‌పెరబుల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. తపాలా కార్యదర్శి, ఐపిపిబి బోర్డు ఛైర్మన్ ప్రదీప్తా కుమార్ బిసోయి మాట్లాడుతూ "డాక్ పే నిజంగా ప్రతి భారతీయుడి ఆర్థిక అవసరాలను తీర్చడానికి రూపొందించిన భారతీయ పరిష్కారం" అని అన్నారు.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గురించి
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) భారత ప్రభుత్వ యాజమాన్యంలో 100% ఈక్విటీతో కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ పోస్టుల విభాగం క్రింద స్థాపించబడింది. ఐపిపిబిని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ 1 సెప్టెంబర్ 2018న ప్రారంభించారు.

డాక్‌పే యాప్ ఎలా పని చేస్తుంది?

మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఉచితంగా డాక్ పే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసిన తర్వాత పేరు, మొబైల్ నంబర్, పిన్ కోడ్‌తో యాప్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. దీని తరువాత మీరు మీ బ్యాంక్ ఖాతాను యాప్ తో లింక్ చేయవచ్చు. 

మీరు కావాలంటే ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులను కూడా యాప్ తో లింక్ చేయవచ్చు. ఈ యాప్ లో మీరు యుపిఐ యాప్ వంటి నాలుగు అంకెల పిన్ను సృష్టించాలి. ఈ యాప్ తో మీరు కిరాణా స్టోర్స్ నుండి షాపింగ్ మాల్స్ వరకు ప్రతిచోటా డబ్బులు చెల్లించవచ్చు.