కరోనా ఎఫెక్ట్: ఆరోగ్యమే ఫస్ట్ ప్రియారిటీ.. ఈ-కామర్స్‌కే ఇండియన్ల ఓటు

భారతీయుల్లో అత్యధికులు ప్రస్తుతం ఆరోగ్య పరిరక్షణకే పెద్ద పీట వేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఖర్చు తగ్గించుకోవడానికి.. భౌతిక దూరం పాటించడం కోసం ఈ-కామర్స్ లావాదేవీలు పెంచుతామని ఫేస్ బుక్, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ సర్వేలో తేల్చి చెప్పారు. 
 

Covid impact: Indians may spend more on e-commerce, even for offline categories

న్యూఢిల్లీ: కరోనా విశ్వమారి నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణ కోసం, పరిశుభ్రత పాటించేందుకు ఉపయోగపడే ఉత్పత్తుల కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేయడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. వచ్చే ఆరు నెలల్లో ఎక్కువ శాతం మంది తక్కువ ఆదాయం పొందడానికి కూడా సిద్ధ పడ్డారని తెలిపింది. 

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. భౌతిక దూరం పాటించడంతోపాటు ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను కొనుగోలు చేయడం, అభిరుచుల్లో మార్పులు రావడం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయని ఈ సర్వే నిర్ధారించింది.

వచ్చే ఆరు నెలల్లో ఇంటి ఆదాయం తగ్గుతుందని ముందే నిర్ధారణకు వచ్చామని 54 శాతం మంది ప్రజలు సర్వేలో తెలిపారు. 49 శాతం మంది విటమిన్లు, మూలికలు, సప్లిమెంట్లు వంటి వాటిని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారని ఫేస్ బుక్ -బీసీజీ సర్వే నిగ్గు తేల్చింది. 

80 శాతం మందికి పైగా వినియోగదారులు భౌతిక దూరం పాటించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ పార్టనర్ నిమిశా జైన్ వెల్లడించారు. కొనుగోలుదారుల వైఖరిలో, అభిరుచుల్లో మార్పులను చూస్తున్నామని తెలిపారు.

40 శాతం మందికి పైగా ప్రజలు ఆరోగ్యం, వెల్ నెస్ ఉత్పత్తులపై డబ్బులు వెచ్చిస్తున్నారని నిమిశా జైన్ పేర్కొన్నారు. గత రెండు మూడేళ్లుగా ప్రజలు ఈ కామర్స్ కొనుగోళ్లకు బాగా అలవాటు పడ్డారని చెప్పారు. ఇవి తాత్కాలిక మార్పులు కాదని, ఎక్కువ కాలం కొనసాగవచ్చునని చెప్పారు.

also read అంగడిలో అమ్మకానికి ట్రు కాలర్ యుజర్ల డాటా...

గత సంక్షోభాల అనుభవాలను పరిశీలిస్తే ఆరు కంపెనీల్లో ఒక్కటే బలంగా దూసుకు వెళ్లిందని నిమిశా జైన్ తెలిపారు. గిరాకీకి అనుగుణంగా వ్యాపార పద్ధతులను మార్చుకుని, కొత్త ప్రణాళికలను అమలు చేసిన సంస్థలు మాత్రమే ముందుకు వెళుతున్నాయని చెప్పారు.

టర్న్ ది టైడ్ పేరిట ఫేస్ బుక్ అండ్ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఈ సర్వే జరిపాయి. ముఖ్యంగా కరోనా తర్వాత వినియోగదారుల అభిరుచులు ఎలా మారాయన్న విషయంపైనే సర్వేలో ఎక్కువగా కేంద్రీకరించారు. 

దేశంలోని 100 అగ్రగామి నగరాల్లో మూడు విడుతలుగా పరిశోధనలు జరిపిన తర్వాత ఫేస్ బుక్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఈ నివేదికను వెల్లడించాయి. వచ్చే ఆరు నెలల పాటు ఖర్చులు తగ్గింుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు 43 శాతం మంది చెప్పారని ఈ నివేదిక పేర్కొన్నది.

63 శాతం మంది మాత్రం వస్తువు బ్రాండ్ చూశాకే కొనుగోలు చేస్తున్నారు. ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్న వారు చౌక బ్రాండ్, వేరియంట్ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. కరోనా సంక్షోభం వల్ల ఇక డిజిటల్ చెల్లింపులు కూడా పెరిగాయి.

డిజిటల్ వాలెట్లతో చెల్లింపులు చేయడం పెరిగిందని 51 శాతం మంది చెప్పారు. ఈ-కామర్స్ ద్వారా కొనుగోళ్లు పెంచుతామని 50 శాతం మంది చెప్పారని ఫేస్ బుక్- బీసీజీ నివేదిక వెల్లడించింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios