తొలగని కరోనా ముప్పు: టెకీలకు పొంచిఉన్న ఉద్యోగ గండం ...
కరోనా మహమ్మారితో టెకీలకు ఉద్యోగ గండం పొంచి ఉంది. ఇప్పటికే ఐటీ రంగంలో 30,000 ఉద్యోగాలు పోయాయి. మరో 60 వేల మంది వేతనం లేని సెలవుపై ఇళ్లకు పరిమితం అయ్యాయి. మున్ముందు మరిన్ని తొలగింపులు తప్పవని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ: కరోనా కల్పించిన సంక్షోభంతో దేశీయ ఐటీ, బీపీఓ, అనుబంధ రంగాల్లో కనీసం 25వేల నుంచి 30 వేల మంది ఉద్యోగాలు కోల్పో యి ఉంటారని ఐటీ రంగ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో 50,000-60,000 మంది వేతనం లేని సెలవుల్లో ఉన్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
చిన్న, మధ్య స్థాయి ఐటీ, బీపీఓ కంపెనీలపై కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందని ఐటీ రంగ నిపుణులంటున్నారు. భారత్‌లోని ఐటీ, బీపీఓ కంపెనీల్ల్లో 43.6 లక్షల మంది పనిచేస్తున్నారు. అందులో 0.70 శాతం మేర ఉద్యోగాలకు కోత పడిందన్నమాట.
కరోనా దెబ్బకు అంతర్జాతయంగా అనిశ్చితి పెరిగింది. క్లయింట్లు ఐటీ వ్యయాలను వాయిదా వేసుకుంటున్నారు. కొత్త ప్రాజెక్టులు కరువై, ఆదాయం తగ్గింది. మార్జిన్లపై ఒత్తిడి పెరిగింది. దాంతో టెక్నాలజీ కంపెనీలు అప్రమత్తం అయ్యాయి. ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోవడంపై దృష్టి సారించాయి.
దీంతో జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్వాసనలు ఊపందుకోవచ్చని ఓ ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌ఆర్ విభాగ అధిపతి హెచ్చరించారు. ప్రస్తుతం చాలా కంపెనీలు బెంచ్‌పైనున్న వారిని లేదా పనితీరు సరిగా లేని వారిని తొలగించడం లేదా సెలవుపై ఇంటికి పంపుతున్నాయన్నారు. బీపీఓలైతే ఆర్థికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
గత కొన్నేళ్లలో ఐటీ రంగంలో యాంత్రీకరణ ఊపందుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఐటీ దిగ్గజాలు సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. డిజిటల్ పరివర్తన కూడా ఇందుకు కారణమైంది. ఇండస్ట్రీ మళ్లీ పుంజుకుంటున్న తరుణంలో కరోనా రూపంలో కొత్త సంక్షోభం ఎదురైంది.
also read చైనాయాప్ టిక్‌టాక్ కీలక నిర్ణయం.. బ్యాన్ చేసిన యాప్స్ పై 79 ప్రశ్నలు.. ...
ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు వ్యయ నియంత్రణ ప్రక్రియను మరింత వేగవంతం చేశాయి. వ్యాపార పునర్‌నిర్మాణంలో భాగంగా ఐబీఎం ప్రపంచవ్యాప్తంగా 2,000 మందిని తొలగిస్తోంది. భారత్‌లోనూ ఉద్యోగాలకు కోతపెడుతున్నట్లు సమాచారం. ఈ కంపెనీలో 3.50 లక్షల మంది ఉద్యోగులుండగా.. మూడింట ఒకవంతు మంది భారత కార్యాలయాల్లోనే పనిచేస్తున్నారు.
కాగ్నిజెంట్ దాదాపు 18,000 మందిని ఇంటికి పంపిచేస్తోందని కర్ణాటక, చెన్నైలోని ఐటీ ఎంప్లాయిస్ అసోసియేషన్లు ఆరోపించాయి. అయితే, పనితీరు సరిగా లేని వారినే తొలిగిస్తున్నామని, ఇది సాధారణ ప్రక్రియేనని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. కాగ్నిజెంట్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.90 లక్షలు కాగా, అందులో రెండు లక్షల మంది భారత్‌లోనే పనిచేస్తున్నారు.
యాక్సెంచర్ సైతం బ్రిటన్‌లో తన కార్యాలయాల నుంచి 900 మందిని తొలగించే పనిలో ఉంది. ప్రస్తుతానికి భారత్‌లో మాత్రం ఎవర్నీ తప్పించే ఆలోచన లేదని కంపెనీ ప్రతినిధి తెలిపారు. దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ విషయానికి వస్తే.. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించకున్నా, పనితీరు ఆధారిత ఉద్వాసనలు మాత్రం కొనసాగనున్నాయి.
ఐటీ కంపెనీల వ్యయాల్లో ఉద్యోగుల వేతనాలదే మెజారిటీ వాటా. కరోనా కాలంలో రాబడి అవకాశాలు సన్నగిల్లడంతో చాలా కంపెనీలు సీనియర్, మిడ్ లెవెల్ మేనేజ్‌మెంట్ జీతాల్లో కోతలు పెట్టాయి. సరాసరిగా సీనియర్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌లకు 15-20 శాతం, మిడ్‌లెవెల్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌లకు 10-15 శాతం మేర వేతనాల్లో కోత పడింది.