వారికి గుడ్ న్యూస్: ఐటీ కంపెనీలో 8వేల మంది ఉద్యోగాలు..
కరోనా కష్టకాలంలో ఐటీ సంస్థ క్యాప్ జెమినీ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల కోతలు ఉండబోవని తేల్చేసింది. తాజాగా 8,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామని కూడా వెల్లడించింది.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావంతో వివిధ రంగాల ఉద్యోగాలు కొడిగట్టిన దీపంగా మారిపోతున్నాయి. కానీ ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్ జెమిని కరోనా సంక్షోభ కాలంలో టెకీలకు గుడ్ న్యూస్ చెప్పింది. విపత్కర పరిస్థితులు కొనసాగుతున్నా ఈ ఏడాది భారత్‌లో ఉద్యోగ నియామకాలను చేపడతామని స్పష్టం చేసింది.
కరోనా వ్యాప్తి కారణంగా సవాళ్లు ఎదురవుతున్నా, క్యాంపస్ ఆఫర్ల ద్వారా సుమారు 8,000 మందిని రిక్రూట్ చేసుకుంటామని బుధవారం తెలిపింది. వివిధ క్యాంపస్‌లతో 8000 కంటే ఎక్కువ ఎల్‌ఓఐలు ఉన్నాయని, ఇంజనీరింగ్ పరీక్షలపై కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున, పరీక్షలు పూర్తి కాగానే ప్రెషర్ల నియామకాలు ప్రారంభమవుతాయని క్యాప్ జెమినీ చెప్పింది.
తమ ప్లాన్లు, క్లయింట్ అవసరాలకు అనుగుణంగా నియామకాలను కొనసాగిస్తామని క్యాప్ జెమిని ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశ్విన్ యార్డి చెప్పారు. డిజిటల్, క్లౌడ్, డేటా అనలిటిక్స్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై దృష్టి సారించి ఫ్రెషర్స్‌తోపాటు అనుభవజ్ఞులకు కూడా అవకాశం కల్పిస్తామని సీఈవో తెలిపారు.
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 6000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నామనీ వారిలో సుమారు 4వేల మంది నిపుణులు, 2000 మంది ఫ్రెషర్లున్నారని క్యాప్ జెమిని ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశ్విన్ యార్డి తెలిపారు. అలాగే రెండో త్రైమాసికంలో 4వేల మందిని నియమించుకున్నామన్నారు.
కోవిడ్ -19 సంక్షోభం కారణంగా పరీక్షలు ఆలస్యం అయినా ఈ సంవత్సరం కళాశాల గ్రాడ్యుయేట్లకు ఇచ్చే అన్ని క్యాంపస్ ఆఫర్లను గౌరవిస్తామని ఇక ముందు కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని క్యాప్ జెమిని ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశ్విన్ యార్డి చెప్పారు.
సంస్థలో ప్రస్తుతం10-15ఏళ్ల అనుభవం ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రాజెక్టు మేనేజర్లు, అర్టిటెక్ట్‌లుగా పోస్టింగ్‌లు ఇస్తున్నట్టు క్యాప్ జెమిని ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశ్విన్ యార్డి వివరించారు. కంపెనీ ఫ్రాన్స్‌కు చెందినది అయినా తమ సంస్థలో సగానికి పైగా ఉద్యోగులు భారతీయులేనని ఆయన వెల్లడించారు.
కాగా ఫ్రెంచ్ ఐటి మేజర్ క్యాప్ జెమినికీ ప్రపంచంలో 270,000 మంది ఉద్యోగులుండగా, వీరిలో సగం 125,000 మంది భారతీయులు ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది 40 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒక్కటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తెలిపింది. ఉద్యోగులకు మాత్రం ఈ ఏడాది ఎలాంటి వేతనాల పెంపు ఉండబోదని టీసీఎస్ స్పష్టం చేసింది.
ఉద్యోగుల కోత ఉండదని టీసీఎస్ సీఈఓ రాజేశ్ గోపినాథ్ తెలిపారు. మరోవైపు గతవారం గతేడాది చివరి త్రైమాసికం ఆర్థిక ఫలితాలు వెల్లడించిన ఇన్ఫోసిస్ సైతం కొత్త నియామకాలు ఉంటాయని తెలిపింది. ఉద్యోగుల కోత ఉండబోదని స్పష్టం చేసింది.