రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి  ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతానికి బుకింగ్ ఫీచర్ అమెజాన్ మొబైల్ వెబ్‌సైట్, ఆండ్రాయిడ్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

పత్రికా ప్రకటన ప్రకారం వినియోగదారులకు బుకింగ్ ప్రక్రియను సౌకర్యవంతంగా చేయడానికి అమెజాన్ లో అనేక ఉపయోగకరమైన ఫీచర్స్ ఉన్నాయి, వీటిలో సింగల్-క్లిక్ పేమెంట్, అడిషనల్ సర్వీస్ ఛార్జీలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు ఉన్నాయి.  పరిచయ ఆఫర్‌గా మొదటిసారి కస్టమర్ల టికెట్ బుకింగ్‌పై రూ.120 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

అమెజాన్ వెబ్‌సైట్‌లో కొత్త రైలు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక పేజీని కూడా ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం అమెజాన్ ఆండ్రాయిడ్ యాప్, మొబైల్ వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉందని పేర్కొంది. మొబైల్‌లో టికెట్ బుకింగ్ పోర్టల్‌కు త్వరగా అక్సెస్ పొందడానికి స్కాన్ చేయగల క్యూ‌ఆర్ కోడ్‌ కూడా పేజీలో ఉంది.

ఈ ఫీచర్ త్వరలో ఐ‌ఓ‌ఎస్ ప్లాట్‌ఫామ్‌లోకి ప్రవేశిస్తుందని అమెజాన్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు అమెజాన్ పే ట్యాబ్‌కు వెళ్లి ఆపై రైళ్లు / ప్రయాణ క్యాటగిరి సెలెక్ట్ చేసుకోవడం ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇతర ట్రావెల్ బుకింగ్ పోర్టల్ లాగానే కస్టమర్లు తమకు కావలసిన గమ్యస్థానాలు, ప్రయాణ తేదీలను సెలెక్ట్ చేసుకోవచ్చు, తరువాత వచ్చే జాబితా నుండి తగిన రైలు ప్రయాణలను ఎంచుకోవచ్చు.

పేమెంట్ కోసం వినియోగదారులు అమెజాన్ పే బ్యాలెన్స్‌ను ఉపయోగించుకోవచ్చు లేదా మరే ఇతర డిజిటల్ పేమెంట్ పద్ధతిని ఎంచుకోవచ్చు. మై ఆర్డర్స్ ఆప్షన్ నుండి వినియోగదారులు తమ టిక్కెట్లను కూడా రద్దు చేసుకోవచ్చు. బుకింగ్ చేయడానికి ముందు, వినియోగదారులు యాప్ లోని అన్ని రైళ్లలో సీటు, కోటా లభ్యతను తనిఖీ చేయవచ్చు.

టికెట్ బుకింగ్ పోర్టల్ వినియోగదారులకు వారి పిఎన్ఆర్ స్థితిని (అమెజాన్‌లో మాత్రమే బుక్ చేసుకున్న టికెట్ల కోసం) తనిఖీ చేయడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి, అవసరమైన విధంగా టిక్కెట్లను రద్దు చేయడానికి అనుమతిస్తుంది. అమెజాన్ పే బ్యాలెన్స్ ఉపయోగించే వినియోగదారులు సింగిల్-క్లిక్ బుకింగ్ అనుభవాన్ని అనుభవించవచ్చు.

టికెట్ రద్దు లేదా బుకింగ్ ఫెయిల్ సమయంలో అమెజాన్ పే వినియోగదారులకు తక్షణమే డబ్బు వాపసు కూడా లభిస్తుందని కంపెనీ తెలిపింది. వినియోగదారులు తమ మొదటి టికెట్ బుకింగ్‌లో 10 శాతం క్యాష్‌బ్యాక్ (రూ .100 వరకు) పొందుతారని తెలిపింది.

ప్రైమ్ సభ్యులు మొదటి బుకింగ్ ద్వారా 12 శాతం క్యాష్‌బ్యాక్ (రూ. 120 వరకు) పొందవచ్చు. అమెజాన్ పే డైరెక్టర్ వికాస్ బన్సాల్ చేసిన ప్రకటనలో, “గత సంవత్సరం, మేము అమెజాన్‌లో విమానాలు, బస్సు టికెట్ బుకింగ్ ప్రారంభించాము.  తాజాగా రైలు టిక్కెట్లను బుక్ చేసుకును అవకాశాన్ని కల్పిస్తున్నామని” అన్నారు.