స్విగ్గి, జొమాటోలకు సవాల్.. ఫుడ్ డెలివరీలోకి ‘అమెజాన్’
కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో స్విగ్గీ, జొమాటో లు తమ సంస్థల్లో పని చేస్తున్న వందలాదిమందికి లే ఆఫ్‌లు ప్రకటించాయి. లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్న ప్రస్తుత తరుణంలో వాటికి పోటీగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించడం ఆసక్తికర పరిణామం.
ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ఫుడ్ డెలివరీ రంగంలోనూ అడుగు పెట్టనున్నది. మరోవైపు స్విగ్గీ, జొమాటో సంస్థలు తమ సంస్థల్లో పని చేస్తున్న వందలాదిమందికి లే ఆఫ్ లు ప్రకటించాయి. అయితే, మందు బాబులకు తీపి కబురును అందిస్తూ ఆల్కహాల్‌ని హోమ్ డెలివరీ చేసేందుకు నిర్ణయించాయి. ఈ పరిస్థితుల్లో ఫుడ్ డెలివరీ రంగంలోకి అమెజాన్ దిగడం గమనార్హం.
దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేయడంతో లక్షల మంది ఫుడ్ డెలివరీ పట్ల విముఖత చూపారు. దీనికి తోడు హైదరాబాద్ వంటి నగరాల్లో లాక్ డౌన్ కఠినంగా అమలు అవుతున్నప్పుడు ఇలాంటి సంస్థలనుంచి ఫుడ్ డెలివరీని ఆయా ప్రభుత్వాలు నిషేధించాయి.
రెండు నెలల లాక్ డౌన్ కారణంగా దేశంలో పెద్ద ఎత్తున రెస్టారెంట్లు బిజినెస్ లేక మూతబడిన నేపథ్యంలో స్విగ్గీ, జొమాటో సంస్థలకు సైతం నష్టాలు తప్పలేదు. అయితే లాక్ డౌన్ ఆంక్షలు చాలావరకు సడలడంతో ఇవి ముఖ్యంగా మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు నడుం కట్టాయి స్విగ్గీ, జొమాటో. ఇప్పుడు పరిస్థితి మళ్ళీ సాధారణ స్థాయికి వస్తోంది. ఆంక్షలు చాలావరకు సడలాయి.
ఇదే సమయంలో అమెజాన్ ఫుడ్ డెలివరీకి శ్రీకారం చుట్టింది. మొదట బెంగుళూరు నగరాన్ని తాము ఇందుకు ఎంపిక చేసుకున్నామని అమెజాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. నగరంలోని నాలుగు పిన్‌కోడ్ ప్రాంతాల్లో కంపెనీ ఈ సేవలు ప్రారంభించనుంది. తర్వాత క్రమంగా ఇతర నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నది.
also read హువావే చుట్టూ ఆంక్షల వల: టెక్నాలజీ నియంత్రణకు అమెరికా పాట్లు ...
అమెజాన్ ఫుడ్ పేరుతో ఈ ఫుడ్ డెలివరీ సేవలు ప్రారంబిస్తున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. దీంతో అమెజాన్ వెంటనే రంగంలోకి దిగింది. ప్రముఖ రెస్టారెంట్ల నుంచి, అత్యున్నత ప్రమాణాలతో తాము ఫుడ్ డెలివరీ చేస్తామని, పైగా ఇందుకోసం ‘హైజీన్ సర్టిఫికేషన్ బార్’ ని ఏర్పాటు చేశామని ఈ సంస్థ ప్రతినిధి వివరించారు.
దీంతో జొమాటో, స్విగ్గీలకు గట్టి పోటీ ఎదురవుతుందని భావిస్తున్నారు. లాక్‌డౌన్ కష్టాల నుంచి బయట పడేందుకు ఈ రెండు కంపెనీలు ఇప్పటికే 1,600 మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. స్విగ్గీ తన ఉద్యోగులలో 1100 మందిని తొలగించడంతోపాటు, క్లౌడ్ కిచెన్స్ వ్యాపారం నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్టు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
స్థానిక రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్ల నుండి ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి వినియోగ దారులను అనుమతిస్తున్నామని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగ దారుల కోరిక మేరకు వారికి షాపింగ్ అనుభవంతో పాటు, భోజన ఆనందాన్ని కూడా ఇవ్వాలనుకుంటున్నామని అమెజాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై వుంటున్న ప్రస్తుత కాలంలో ఇది సందర్భోచితంగా వుంటుందని భావించామన్నారు. అలాగే సేఫ్టీ, పరిశుభ్రత పరిరక్షణలో అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.