Asianet News TeluguAsianet News Telugu

కంటెంట్ చోరీ ఆరోపణలు: గూగుల్‌, ఫేస్‌బుక్‌ సీఈవోలను కడిగిపారేసిన అమెరికా సెనేటర్లు

టెక్ దిగ్గజాలు గూగుల్, ఫేస్‌బుక్‌కు అమెరికాలోని డెమొక్రాట్లు, రిపబ్లికన్ల నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. గూగుల్, ఫేస్‌బుక్‌లు తమ మార్కెట్ ప్రాబల్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని నేతలు ఆరోపించారు

Amazon Apple, Facebook and Google grilled on Capitol Hill over their market power
Author
Washington D.C., First Published Jul 30, 2020, 2:43 PM IST

టెక్ దిగ్గజాలు గూగుల్, ఫేస్‌బుక్‌కు అమెరికాలోని డెమొక్రాట్లు, రిపబ్లికన్ల నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. గూగుల్, ఫేస్‌బుక్‌లు తమ మార్కెట్ ప్రాబల్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని నేతలు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో అమెరికన్ కాంగ్రెస్ జ్యూడిషియరీ కమిటీ ఎదుట బుధవారం గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్ సీఈవోలు సుందర్ పిచాయ్, జెఫ్ బెజోస్, టిమ్ కుక్, మార్క్ జుకర్ బర్గ్ ‌లు విచారణకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సెనేటర్లు వీరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు 5 లక్షల కోట్ల డాలర్ల ఉమ్మడి మార్కెట్ విలువను కలిగిన ఈ దిగ్గజాలు మార్కెట్ వాటా కోసం చిన్న సంస్థలను దారుణంగా నలిపేస్తున్నాయని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు కడిగేశారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ విచారణలో ప్రతినిధులు తమదైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. గూగుల్ , ఆల్ఫాబెట్ సీఈవోకు ప్రతినిధుల నుంచి తీవ్ర ఆరోపణలు, ప్రశ్నలు ఎదురవ్వగా వీటన్నింటినీ సమీక్షించి తిరిగి సభకు వివరిస్తానని పిచాయ్ వివరణ ఇచ్చారు.

గూగుల్ కంటెంట్‌ చోరీకి పాల్పడుతోందని డెమొక్రాట్, యాంటీ ట్రస్ట్ సబ్ కమిటీ చీఫ్ డేవిడ్ సిసిలిన్ సుందర్ పిచాయ్‌ను ప్రశ్నించారు. యెల్ఫ్ ఇంక్ నుంచి గూగుల్ రివ్యూలను తస్కరిస్తోందని, దీనిని ఆక్షేపిస్తే సెర్చి రిజల్ట్స్ నుంచి యెల్ఫ్‌ను డీలిస్ట్ చేస్తామని గూగుల్ బెదిరిస్తోందని డేవిడ్ ఆరోపించారు.

దీనిపై స్పందించిన పిచాయ్.. ఈ ఆరోపణల గురించి నిర్దిష్టంగా తాను తెలుసుకోవాలనుకుంటున్నానని సమాధానమిచ్చారు. యూజర్ల కోసం గూగుల్ కంటెంట్ చోరీకి పాల్పడుతోందనే ఆరోపణలతో తాను ఏకీభవించనని తేల్చి చెప్పారు.

ఇకపోతే.. 2012లో ఇన్‌స్టాగ్రామ్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేయడంపై మరో దిగ్గజం ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పలు ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ తమకు పెనుముప్పుగా మారుతుందనే ఆందోళనతోనే దానిని కొనుగోలు చేశారా అని ప్రతినిధులు జుకర్‌బర్గ్‌ని ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన మార్క్.. తాము ఇన్‌స్టాను కొనుగోలు చేసిన సమయంలో అది ఓ చిన్న ఫోటో షేరింగ్ యాప్‌‌ మాత్రమేనని జుకర్‌బర్గ్ బదులిచ్చారు. ఈ ఒప్పందాన్ని ఫెరడల్ ట్రేడ్ కమీషన్ సమీక్షించిందని ఆయన గుర్తుచేశారు.

కాగా ఫేస్‌బుక్ ఏయే సందర్భాల్లో తన ప్రత్యర్థులను  అనుకరించిందని మరో ప్రతినిధి ప్రమీలా జయపాల్... జుకర్ బర్గ్‌ను ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఇతరుల ముందుకెళ్లిన ఫీచర్లు కొన్నింటిని తాము అనుసరించిన సందర్భాలున్నాయని ఆయన అంగీకరించారు. అయితే నలుగురు దిగ్గజ టెక్ అధినేతలు ఒకేసారి చట్టసభ సభ్యుల ముందు విచారణకు హాజరవ్వడం అమెరికాలో హాట్ టాపిక్‌‌గా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios