మొబైల్.. చార్జీల పెంపు ప్రకటన...వినియోగదారులలో ఆందోళన...
ఏజీఆర్ బకాయిలు వడ్డీతో సహా మూడు నెలల్లో చెల్లించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశంలోని టెలికం ప్రొవైడర్లకు శరాఘాతమైంది. తమ నష్టాలను తగ్గించుకునేందుకు చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో వినియోగదారుల గుండెల్లో గుబులు మొదలైంది.
న్యూఢిల్లీ : దేశంలో మూడు దిగ్గజ మొబైల్ నెట్‌వర్క్ ప్రొపైడర్లయిన వొడాఫోన్ ఐడియా, రిలయెన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ కంపెనీలు డిసెంబర్‌లో టారిఫ్‌లు పెంచుతామని ప్రకటించడంతో వినియోగదారుల గుండెల్లో కాస్త గుబులు మొదలయింది.
డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి పెంచుతామని వొడాఫోన్ ఐడియా ప్రకటించగా, తేదీ చెప్పకుండా డిసెంబర్‌లో పెంచుతామని భారతి ఎయిర్‌టెల్ కంపెనీ ప్రకటించాయి. తామూ టారిఫ్‌లను సముచితంగా కొన్ని వారాల్లో పెంచుతామని రిలయెన్స్ జియో ప్రకటించింది.
also read పేటిఎం వినియోగదారులు జాగ్రత...లేదంటే మీ డబ్బులు మాయం
లైసెన్స్ ఫీజులు, వడ్డీలు కలుపుకొని వొడాఫోన్ రూ.28 వేల కోట్లు, భారతి ఎయిర్‌టెల్ రూ.12 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలంటూ 16 ఏళ్ల వివాదానికి తెరదించుతూ సుప్రీం కోర్టు ఇటీవలే తీర్పు చెప్పింది. ఈ రెండు కంపెనీలు గత సెప్టెంబర్‌లో విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల ప్రకారం వీటికి ఉమ్మడిగా రూ. 73 వేల కోట్ల నష్టాలు వచ్చాయి.
సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా అమలు చేయాలంటే మొత్తం రూ. లక్ష కోట్ల దాటుతుంది. మొబైల్ టారిఫ్‌లను ఎంత పెంచితే ఈ కంపెనీలు నష్టాల నుంచి గట్టెక్కుతాయి? ఈ నేపథ్యంలో మొబైల్ చార్జీల మోత మోగుతుందని మొబైల్ యూజర్లు ఆందోళన చెందుతున్నారు.
బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్ కంపెనీ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో భారత్‌లోని తన యూనిట్‌ను మూసివేస్తుందని వదంతులు రావడంతో ఆ 40 వేల కోట్లను ఇప్పుడే చెల్లించాల్సిన అవసరం లేదని, మెల్లగా చెల్లించవచ్చని కేంద్రం రాయితీ ఇవ్వడంతో ఈ రెండు కంపెనీలు ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకుంటున్నాయి.
రిలయెన్స్ జియోకు ఈ బాధలు లేవు. భారతి ఎయిర్‌టెల్ భారత కంపెనీ అయినా నష్టాల్లోనే ఉంది. వ్యాపార రీత్యా వొడాఫోన్ దేశంలో మొదటి స్థానంలో ఉండగా రిలయెన్స్ రెండో స్థానంలో, ఎయిర్‌టెల్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
రిలయెన్స్ జియో లాభాలు కూడా ఈ ఏడాది దాదాపు రూ. 600 కోట్ల నుంచి రూ. 900 కోట్లకు చేరుకుంది. రిలయెన్స్ కంపెనీ 2016లో జియోను తేవడం, దాదాపు ఏడాది పాటు ఉచిత సేవలు అందించడంతో వొడాఫోన్, ఎయిర్‌టెల్ కంపెనీలు పోటీ పడి బాగా నష్టపోయాయి.
అతి తక్కువ టారిఫ్‌లకు రిలయెన్స్‌కు లాభాలు రావడమేమిటీ? వొడాఫోన్ లాంటి కంపెనీలను నష్టాలు రావడం ఏమిటీ అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి రిలయెన్స్ జియోకు చాలా రాయితీలు ఉన్నాయి.
also read స్నాప్‌చాట్ కొత్త ఫీచర్ : చూస్తే వావ్ అనాల్సిందే!
విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే అన్ని టెలికమ్ పరికరాలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం గతేడాదే రెట్టింపు చేసింది. భారతీయ కంపెనీగా రిలయెన్స్ జియోకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. వాస్తవానికి రిలయెన్స్ జియో తన టారిఫ్‌లను ఇప్పుడే పెంచాల్సిన అవసరం లేదు.పెంచుతున్నట్లు ప్రకటించడం వల్ల స్టాక్ మార్కెట్‌లో జియో వ్యాపారం 9.5 లక్షల కోట్ల నుంచి 9.9 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. పది లక్షల కోట్లకు తీసుకెళ్లడం కంపెనీ లక్ష్యంగా కనిపిస్తోంది.
వొడాఫోన్ ఐడియా అన్ని టారిఫ్‌లను పది శాతం పెంచుతున్నట్లు, ఆ టారిఫ్‌లను చూసిన తర్వాత అంతకన్నా కొంచెం తక్కువగా టారిఫ్‌లను పెంచాలని ఎయిర్‌టెల్ చూస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. వాటికంటే జియో టారిఫ్‌లు తక్కువగానే పెరిగే అవకాశం ఉంది.