మౌంట్ ఎవరెస్ట్‌ పై 5జీ సేవలు...6500 మీటర్ల ఎత్తులో బేస్ స్టేషన్...

చైనా అధికార టెలికం సంస్థ చైనా మొబైల్ సంస్థ ఎవరెస్ట్ శిఖరాగ్రంపై 5జీ సేవలు అందుబాటులోకి తేనున్నది. ఇందుకోసం శిఖరాగ్ర భాగాన 6500 మీటర్ల ఎత్తులో చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం హువావే సహకారంతో 5జీ బేస్ స్టేషన్ నిర్మించి రెండు రోజుల క్రితం సర్వీసులను ప్రారంభించింది
 

5G signal now available on Mount Everest peak

బీజింగ్: చైనా వైపు నుంచి ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించే పర్వతారోహకులకు 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు టిబెట్‌ పరిధిలో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ ‘చైనా మొబైల్‌' నిర్మించిన బేస్‌ స్టేషన్‌ తన కార్యకలాపాలు ప్రారంభించిందని ఆ దేశ అధికార మీడియాలో వార్తలు వచ్చాయి.

సముద్ర తీరానికి 6,500 మీటర్ల ఎత్తున నిర్మించిన ఈ బేస్‌ స్టేషన్‌ సేవలు రెండు రోజుల క్రితం మొదలయ్యాయి. ఎవరెస్ట్‌ పర్వతశిఖరంపై పూర్తిస్థాయిలో 5జీ సేవలను వాస్తవ రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు 5,300 మీటర్లు, 5,800 మీటర్ల ఎత్తున కూడా బేస్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశారని చైనా అధికార వార్తా సంస్థ ‘జిన్హువా’ తెలిపింది.

6500 మీటర్ల ఎత్తున బేస్ స్టేషన్ ను నిర్మించిన చైనా మొబైల్ సంస్థతో చైనా టెలికం దిగ్గజ సంస్థ ‘హువావే’ జత కట్టింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 5జీ సేవలు అందించగల సామర్థ్యం.. ఆ టెక్నాలజీపై పేటెంట్ గల సంస్థగా హువావేకు పేరుంది. ఎవరెస్ట్ శిఖరం అత్యంత ఎత్తుపై బేస్ స్టేషన్ నిర్మాణం కోసం హువావే ప్రాజెక్టు మేనేజర్ జాంగ్ బో 20 నెలలుగా శిఖరంపైనే ఉన్నారంటే దీనికి ఆ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు.

కాగా, ఎత్తైన ప్రదేశంలో ఐదు 5జీ స్టేషన్ల నిర్మాణానికి 14.2 లక్షల డాలర్లు ఖర్చవుతుందని చైనా అధికార వర్గాలు తెలిపాయి. ఒకసారి 5జీ సేవలు అందుబాటులోకి వస్తే ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించే పర్వతారోహకులు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్‌ సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు ఈ ఐదు 5జీ స్టేషన్లు ఉపకరిస్తున్నాయి.

5జీ సేవలు పరిశోధకులకు, సహాయ సిబ్బందికి కూడా సహాయకారిగా ఉంటాయి. 5,300 మీటర్ల ఎత్తున నిర్మించిన 5జీ స్టేషన్‌ను బేస్‌ స్టేషన్‌గా వాడుకోనున్నారు. 5జీ సేవలను పర్వాతారోహకులు, పర్యాటకులు, స్థానికులు ఉపయోగించుకోవచ్చు.

చైనా-నేపాల్ సరిహద్దుల్లో చైనాలోని టిబెట్ అటామనస్ రీజియన్ పరిధిలో గల జిజాజే ఉత్తర భాగంలో మౌంట్ ఎవరెస్ట్ ఉన్నది. 5జీ వైర్ లెస్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ అంటే శరవేగంగా కమ్యూనికేషన్ సేవలందిస్తుంది.

ఇది గ్రేటర్ బ్యాండ్ విడ్త్, నెట్ వర్క్ కెపాసిటీతోపాటు భవిష్యత్‌లో డ్రైవర్ రహితంగా కార్ల డ్రైవింగ్ తదితర కనెక్టెడ్ డివైజెస్, టెలీ మెడిసిన్ సేవలు, వర్చువల్ సమావేశాల కోసం హైడెఫినేషన్ కనెక్షన్స్ అందుబాటులోకి రానున్నాయి.

హై డెఫినిషన్ లైవ్ స్ట్రీమింగ్, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్, సైంటిఫిక్ రీసెర్చ్, మౌంటైన్ క్లైంబింగ్ కార్యక్రమాలకు 5జీ సేవలు ఉపకరించనున్నాయి. 5300 మీటర్ల బేస్ స్టేషన్ వద్ద 5జీ డౌన్ లోడ్ స్పీడ్ 1.66 జీబీపీఎస్, అప్ లోడ్ కెపాసిటీ 215 ఎంబీపీఎస్‌కు పెరుగుతుందని భావిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios