Marlon Samuels West Indies:వెస్టిండీస్ సార్ట్ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్‌ కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాక్ ఇచ్చింది. అతడు ఎలాంటి ఫార్మట్ లు ఆడకుండా ఐసీసీ ఆరేళ్ల నిషేధం విధించింది. అసలేం జరిగింది? ఇందుకింత కఠిన శిక్ష? 

Marlon Samuels West Indies: వెటరన్ వెస్టిండీస్ క్రికెటర్ కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాక్ ఇచ్చింది. అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించినందుకు స్టార్ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్‌పై ఐసీసీ ఆరేళ్ల నిషేధం విధించింది. శామ్యూల్స్ వెస్టిండీస్ తరఫున చాలా సందర్భాలలో తన అద్భుత ప్రదర్శనతో తన టీమ్ కు విజయాలను అందించారు. రిటైర్మెంట్ తర్వాత దేశవాళీ లీగ్‌లలో ఆడుతున్నాడు.

అయితే ఇప్పుడు అవినీతికి పాల్పడినందుకు ఆయనపై నిషేధం విధించారు. ఈ నిషేధంతో శామ్యూల్స్ వచ్చే ఆరేళ్లపాటు ఏ ఫార్మాట్‌లోనూ ఆడలేరు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించినందుకు క్రికెటర్ శామ్యూల్స్ దోషిగా తేలింది. శామ్యూల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు ఐసీసీ హెచ్‌ఆర్ అండ్ ఇంటిగ్రిటీ యూనిట్ హెడ్ అలెక్స్ మార్షల్ గురువారం ప్రకటించారు.

ఈ సందర్బంగా ఐసీసీ హెచ్‌ఆర్ అండ్ ఇంటిగ్రిటీ యూనిట్ హెడ్ అలెక్స్ మార్షల్ మాట్లాడుతూ.. 'శామ్యూల్స్ దాదాపు రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు, ఆ సమయంలో అతను అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారు. అవినీతి నిరోధక కోడ్ ప్రకారం అతని బాధ్యతలు ఏమిటో తెలుసు. అతడు పదవీ విరమణ చేసినప్పటికీ, నేరాలు జరిగినప్పుడు శామ్యూల్స్ భాగస్వామి. ఈ ఆరేళ్ల నిషేధం నిబంధనలను ఉల్లంఘించాలనుకునే ఏ ఆటగాడికి బలమైన నిరోధకంగా పనిచేస్తుంది' అని పేర్కొన్నారు.

అసలేం జరిగింది..?

ICC సెప్టెంబర్ 2021లో శామ్యూల్స్‌పై అభియోగాలు మోపింది. దీని ప్రకారం.. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక కోడ్ సెక్షన్లు ను శామ్యూల్స్ పలు మార్లు ఉల్లంఘించారు. అవినీతి నిరోధక అధికారులకు ఎలాంటి బహుమతులు, చెల్లింపులు, ఆతిథ్యం లేదా ఇతర ప్రయోజనాలను నివేదించకూడదు. ఇలాంటివి గేమ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుంది. దీనితో పాటు దర్యాప్తులో సహకరించకపోవటం, సమాచారాన్ని దాచిపెట్టి దర్యాప్తును అడ్డుకోవడం , ఆలస్యం చేయడం వంటి పలు ఆరోపణలున్నాయి. దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది ఆగస్టులో అతడు నేరాలకు పాల్పడినట్లు తేలింది. 2019 టీ10 లీగ్‌లోనూ మార్లోన్ శామ్యూల్స్ అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించారు.

వివాదాలు కొత్తేమి కాదు..

42 ఏళ్ల మార్లోన్ శామ్యూల్స్ కు వివాదాలు కొత్తేమి కాదు. 2008లో ICC అతను అక్రమంగా డబ్బు తీసుకున్నందుకు, క్రికెట్ పరువు తీసినందుకు దోషిగా గుర్తించి అతనిని రెండేళ్లపాటు నిషేధించింది. అలాగే.. 2015లో అతని బౌలింగ్‌ యాక్షన్‌ చట్టవిరుద్ధమని ఐసీసీ గుర్తించి ఏడాది పాటు అతనిపై నిషేధం విధించింది. 2014లో తన బోర్డుతో చెల్లింపు వివాదం కారణంగా అప్పటి కెప్టెన్ డ్వేన్ బ్రావో భారత పర్యటన నుండి వైదొలగాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా అతను వ్యతిరేకించాడు.

శామ్యూల్స్ క్రికెట్ కెరీర్ 

శామ్యూల్స్ వెస్టిండీస్ తరపున 71 టెస్టులు, 207 ODI ఇంటర్నేషనల్స్, 67 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. అతడు తన కెరీర్ లో 17 సెంచరీలతో సహా మొత్తం మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో 11,134 పరుగులు చేశాడు. 152 అంతర్జాతీయ వికెట్లు కూడా తీశాడు. ఈ సమయంలో అతను వన్డే మ్యాచ్‌లలో వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. 2012, 2016 టీ20 ప్రపంచకప్‌లలో వెస్టిండీస్‌ను చాంపియన్‌గా నిలబెట్టడంలో శామ్యూల్స్ కీలక పాత్ర పోషించాడు. రెండు టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లోనూ శామ్యూల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.