రోజర్ ఫెదరర్... 20 గ్రాండ్ స్లామ్‌లు, అత్యధిక రోజులు నంబర్‌వన్‌గా ఉన్న వ్యక్తి, అతని పేరు తెలియని వారు సైతం చాలా అరుదు. అలాంటి వ్యక్తి అయినా సరే కర్తవ్య నిర్వహణే తనకు ముఖ్యమని అందరి ప్రశంసలు అందుకున్నాడు ఓ సెక్యూరిటీ గార్డ్.

ఆస్ట్రేలియా ఓపెన్‌లో భాగంగా శనివారం మెల్‌బోర్న్‌ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేసేందుకు వచ్చిన ఫెదరర్ లాకర్ రూమ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఫెదరర్‌ను గుర్తింపు కార్డ్ చూపించాల్సిందిగా కోరాడు.

అది ఆయన వెనుక వస్తున్న సహాయక బృందం దగ్గర ఉంది. దీంతో వారు వచ్చే వరకు ఫెదరర్ అక్కడే నిలబడి వేచి చూశాడు. తన సహాయకుడు వచ్చిన తర్వాత గుర్తింపు కార్డ్ చూపించి లోనికి వెళ్లాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిబంధనల ప్రకారం ప్రతి ఆటగాడు ఈ కార్డును వెంట తెచ్చుకోవాల్సిందే.

దీనిలో ఫోటో, పేరు, బార్ కోడ్‌ ఇతర వివరాల ఉంటాయి. ప్రతి చెక్‌ పాయింట్ వద్ద దాన్ని స్కాన్ చేస్తేనే లోపలికి అనుమతిస్తారు. కాగా, ఫెదరర్‌నే అడ్డుకుని తన విధిని నిర్వర్తించిన గార్డుపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.