24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి రికార్దు సాధించాలనుకుని యూఎస్ ఓపెన్ టైటిల్ కోల్పోయి నిరాశలో కూరుకుపోయిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌కు మరో షాక్ తగిలింది. శనివారం యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సెరెనా అనుచిత ప్రవర్తన పట్ల యూఎస్ టెన్నిస్ అసోసియేషన్ మండిపడింది.

నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను 17,000 యూఎస్ డాలర్ల జరిమానాను విధించింది. నిబంధనలకు విరుద్ధంగా కోచ్ నుంచి సంకేతాల రూపంలో సలహాలు అందుకోవడంతో పాటు... అసహనంతో రాకెట్ విరగ్గొట్టినందుకు, అంపైర్‌ను పరుష పదజాలంతో దూషించినందుకు గాను జరిమానా విధిస్తున్నట్లు అసోసియేషన్ పేర్కొంది.

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో భాగంగా రెండో సెట్ జరుగుతుండగా... కోచ్ నుంచి సంకేతాలు తీసుకోవడంపై ఛైర్ అంపైర్ హెచ్చరించాడు. ఆయనతో వాగ్వివాదానికి దిగిన సెరెనా ‘‘ నువ్వు అబద్ధాల కోరువి.. దొంగవి ’’ అంటూ నిందించి.. రాకెట్‌ని నేలకేసి కొట్టింది.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను ఆమెకు అంపైర్ ఒక పాయింట్ జరిమానా విధించాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన సెరెనా చైర్ అంపైర్ కావాలనే నా పాయింట్‌లో కోత విధించాడని.. క్రీడల్లో మహిళల పట్ల వివక్ష ఉంటుందన్న నా నమ్మకాన్ని ఈ సంఘటన మరింత పెంచిందని వ్యాఖ్యానించింది.