హైదరాబాద్: తన కుమారుడిని డాక్టరుగా చూడాలని ఉందని ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిని సానియా మీర్జా చెప్పారు. తాను క్రీడాకారిణిని కాకుంటే డాక్టర్‌ను అయ్యుండేదానినని చెప్పారు. హైదరాబాదు కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌ ఆవరణలో 1980 బ్యాచ్‌ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేసిన సింథటిక్‌ టెన్నిస్‌ కోర్టు, టెన్నిస్‌ అకాడమీని ఆమె ప్రారంభించారు. 

టెన్నిస్‌ అకాడమీల ఏర్పాటు వల్ల విద్యార్థులు, క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతోపాటు చాంపియన్స్‌ను అందించేందుకు వీలుంటుందని సానియా మీర్జా అన్నారు. మెడికల్‌ కాలేజీ సహకారం అందిస్తున్న పూర్వ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పి.శశికళ, పూర్వవిద్యార్థుల సంఘం ప్రతినిధులు, వైద్యులు ఎ.శ్రీనివాస్‌, మనోస్‌ చంద్ర , దీపక్‌, ఎం.సుబ్రమణ్యం, శ్యాంసుందర్‌రాజ్‌, టీవీఎస్‌ గోపాల్‌, మధుశేఖర్‌, ప్రణతిరెడ్డి, శ్రీలత, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.