న్యూఢిల్లీ: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండుతో జరుగుతున్న సిరీస్ లో హార్దిక్ పాండ్యా ఆటతీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాండ్యా ఆల్ రౌండర్ కు అర్హుడు కాడని అన్నాడు. 

ఇంగ్లాండుతో జరిగిన రెండు టెస్టు మ్యాచుల్లో బంతితోనూ బ్యాట్ తోనూ హార్దిక్ పాండ్యా విఫలం కావడంపై హర్భజన్ తీవ్ర విమర్శలు చేశాడు. నాలుగు ఇన్నింగ్సుల్లో పాండ్యా 90 పరుగులు చేశాడు. మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 

హార్దిక్ పాండ్యా పరుగులేమీ రాబట్టలేకపోవడంపై కెప్టెన్ విశ్వాసం కోల్పోయినట్లు కనిపిస్తున్నాడని అన్నాడు. ఈ కండీషన్లో బౌలింగ్ చేయలేకపోతే భవిష్యత్తులో పాండ్యాకే కాకుండా భారత జట్టుకు కూడా కష్టమని అన్నాడు. 

జట్టు విజయం కీలక పాత్ర పోషించిన ఇంగ్లాండు ఆల్ రౌండర్లు బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్, క్రిస్ వోక్స్ లతో పోల్చి హార్దిక్ పాండ్యాపై హర్భజన్ విరుచుకుపడ్డాడు. పాండ్యా ఆల్ రౌండర్ ట్యాగ్ తొలగించాలని ఆయన అన్నాడు. రాత్రికి రాత్రే పాండ్యా కపిల్ దేవ్ కాలేడని అన్నాడు. 

బౌలింగ్ యూనిట్ గా తాము చాలా ప్రయత్నం చేశామని, అయితే అకస్మాత్తుగా బంతి స్వింగ్ కావడం మానేసిందని, క్రిస్ వోక్స్, జానీ బెయిర్ స్టో తమ నుంచి మ్యాచును లాగేసుకున్నారని రెండో టెస్టు అపజయం తర్వాత హార్దిక్ పాండ్యా అన్నాడు.