బెంగాల్ రాజధానిలో కోల్‌కతాలో కూడా దబాంగ్ డిల్లీ హవా కొనసాగుతోంది. ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో ఇప్పటికే టాప్ లో నిలిచిన డిల్లీ జట్టు మరో అద్భుత విజయాన్ని అందుకుంది. నేతాజీ ఇండోర్  స్టేడియంలో తమిళ తలైవాస్ తో తలపడ్డ డిల్లీ భారీ పాయింట్స్ తేడాతో గెలుపొందింది.  డిల్లీ రైడర్ల ధాటికి విలవిల్లాడిపోయిన తమిళ జట్టు ఏ దశలోనూ గెలుపు దిశగా పయనం సాగించలేదు. దీంతో  చివరకు 16 పాయింట్ల తేడాతో తలైవాస్ టీం ఓటమిపాలయ్యింది. 

డిల్లీ ఆటగాళ్లలో నవీన్ కుమార్ 17, మేరాజ్ 12 పాయింట్లతో అదరగొట్టారు. అలాగు వినయ్ 5, అనిల్ 3, రవిందర్ 2 పాయింట్లతో జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. కానీ రైడర్లు నవీన్, మేరాజ్ లు అత్యుత్తమ ప్రదర్శనలో దబాండ్ డిల్లీని  టాప్ ప్లేస్ ను మరింత పదిలం  చేశారు. ఇలా వారి విజృంభణతో డిల్లీ రైడింగ్ లో 33, ట్యాకిల్స్ లో 8, ఆలౌట్ల ద్వారా 6, ఎక్స్‌ట్రాల రూపంలో 4 మొత్తం 50 పాయింట్లు సాధించింది. 

తమిళ్ తలైవాస్ డిల్లీకి గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. ఆటగాళ్ళలో రాహుల్ చౌదరీ 14, అజిత్ కుమార్ 9 పాయింట్లతో రాణించారు. మిగతావారిలో ఎవ్వరూ  ఆశించిన మేర రాణించలేకపోవడంతో తలైవాస్ జట్టు వెనుకబడింది. రైడింగ్ లో 27, ట్యాకిల్స్ లో  కేవలం 3, ఎక్స్‌ట్రాల రూపంలో 4 ఇలా మొత్తం 34 పాయింట్ల వద్దే తలైవాస్ ఆట ముగిసింది. దీంతో 50-34 పాయింట్ల తేడాతో డిల్లీ ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ ను మరింత పదిలం చేసుకుంది.