కామన్వెల్త్‌లో లాంగ్‌జంప్‌లో రజతం గెలిచిన శ్రీశంకర్ మురళీ... పారా పవర్‌లిఫ్టింగ్‌లో సుధీర్‌కి స్వర్ణం... 20కి చేరిన భారత పతకాల సంఖ్య...

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత అథ్లెట్లు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నారు. పురుషుల లాంగ్‌ జంప్ ఈవెంట్‌లో పోటీపడిన భారత అథ్లెట్ శ్రీశంకర్ మురళీ, 8.08 మీటర్ల దూరం దూకి రజతం గెలిచాడు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో పురుషుల లాంగ్‌ జంప్‌లో ఇదే మొట్టమొదటి పతకం...

బహమాస్‌కి చెందిన లాక్వాన్ నయిరిన్‌ కూడా 8.08 మీటర్ల దూరం దూకినా... అతని కంటే మిల్లీ మీటర్ల వ్యత్యాసం ఉన్నందున శ్రీశంకర్ మురళీ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది... తన కామన్వెల్త్ పతకాన్ని తండ్రికి అంకితమిచ్చాడు శ్రీశంకర్ మురళీ... 

Scroll to load tweet…

‘చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా... ఎలాగైనా మెడల్ గెలవాలనే కసితోనే కామన్వెల్త్‌లో అడుగుపెట్టా. ఆ జంప్ తర్వాత మెడల్ వస్తుందని ఫిక్స్ అయ్యా. రిజల్ట్ వచ్చే క్షణం వరకూ చాలా టెన్షన్‌కి గురయ్యా... వాతావరణం ఏ మాత్రం సహకరించలేదు. చల్లని గాలులు వీస్తూ, చలిగా ఉంది. ఈ పరిస్థితులను దాటితేనే విజయం సాధించగలనని అనుకున్నా... 

మొదటి రౌండ్‌ తర్వాత నేను అనుకున్న రిథమ్‌ని అందుకున్నా. స్వర్ణం రాలేదనే బాధ ఉన్నా, రజతం గెలవడం కూడా సంతోషంగానే ఉంది.. ఈ మెడల్‌ని నాకు ప్రతీ అడుగులోనూ అండగా నిలిచిన మా నాన్నకి, క్రీడా శాఖకి అంకితం ఇస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు శ్రీశంకర్ మురళీ...

మెన్స్ హెవీ వెయిట్‌ పారా పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్న భారత అథ్లెట్ సుధీర్ 134.5 పాయింట్లు సాధించి, స్వర్ణం గెలిచాడు. 87.3 కిలోల సుధీర్, 217 కేజీలు ఎత్తి 134.5 పాయింట్లు సాధించి... భారత్‌కి ఆరో స్వర్ణాన్ని సాధించి పెట్టాడు. సుధీర్ మెడల్‌తో కలిసి భారత్ ఖాతాలో 20 పతకాలు చేరాయి...

ఇందులో ఆరు స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్య పతకాలు ఉన్నాయి. బాక్సింగ్‌లో మరో ఆరు మెడల్స్ ఖాయం కావడంతో నేడు భారత పతకాల సంఖ్య మరింత పెరగనుంది...