Asianet News TeluguAsianet News Telugu

లక్కున్నోడు, సక్సెస్ లెక్క తెలిసినోడు

భారత క్రికెట్ జట్టుకు విజయాలను రుచి చూపించిన అజిత్ వాడేకర్ ఇటీవల కన్ను మూశారు. ఆయనకు నివాళిగా ప్రముఖ క్రీడా విశ్లేషకులు సిహెచ్. వెంకటేష్ రాసిన వ్యాసం ఇదీ.. 

Ch Venkatesh pays homage to Ajit wadekar
Author
Hyderabad, First Published Aug 18, 2018, 3:35 PM IST

అతనికి బోలెడంత లక్కున్నోడని పేరు. కానీ ఆ అదృష్టం కెరీర్ చివరిదాకా కొనసాగలేదు. కలిసొచ్చిన కాలంలో వైకుంఠపాళీ నిచ్చెనలెక్కి అమాంతంగా ఎలా ముందుకి దూసుకెళ్ళాడో చివర్లో పెద్ద పాము బారిన పడి అంత తొందరగానే కింది కొచ్చాడు. ఈ ఒడుదుడుకుల మాటెలా ఉన్నా ఇండియా మాజీ క్రికెట్ కెప్టెన్ అజిత్ వాడేకర్ పేరిట మాత్రం భారత క్రికెట్‌లో ఒక విశిష్ట అధ్యాయం ఎప్పటికీ ఉంటుంది.  వెస్టిండీస్, ఇంగ్లండ్ గడ్డలపైన టెస్టుల్లో తొలి సీరీస్ విజయాలు అందించిన కెప్టెన్‌గా చరిత్రలో అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ రెండు చారిత్రాత్మక విజయాల తర్వాత స్వదేశంలో కూడా ఇంగ్లండ్ పై టెస్ట్ సీరీస్ నెగ్గి హ్యాట్రిక్ విజయాల వీరుడయ్యాడు. సూపర్ స్కిప్పర్ అంటూ అభిమానులు అతనికి బ్రహ్మరథం పట్టారు. కానీ అతని నాయకత్వంలోనే మళ్ళీ ఇంగ్లండ్ పర్యటనకెళ్ళినప్పుడు జట్టు చిత్తుగా ఓడిపోయింది. 

అప్పటిదాక పొగిడిన నోళ్ళతోనే అభిమానులు చీదరించుకున్నారు. ఆ అవమానకరమైన ఓటమి తర్వాత కెప్టెన్సీనే కాదు భారత జట్టులో స్థానం కూడా అతను కోల్పోయాడు. అందుకే వాడేకర్ క్రికెట్ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు "నిప్పులు చిమ్ముకుంటూ/ నింగికి నే నెగిరిపోతే/ నిబిడాశ్చర్యంతో వీరు/ నెత్తురు క్రక్కుకుంటూ/ నేలకు నే రాలిపోతే/ నిర్దాక్షిణ్యంగా వీరె" అన్న శ్రీశ్రీ కవిత గుర్తుకొస్తుంది.          

బ్యాట్స్‌మన్‌గా వాడేకర్ కొన్ని కీలకమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ అతని గణాంకాలు మాత్రం అంత గొప్పగా కనబడవు. ఆడిన 37 టెస్టుల్లో అతని బ్యాటింగ్ సగటు 31 మాత్రమే. ఒకే ఒక టెస్ట్ సెంచరీ చేశాడు. స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ అందరూ రైట్‌హ్యాండర్లే ఉన్న అప్పటి రోజుల్లో అతను లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు కావడం ఓ ప్రత్యేకత. అంతే కాదు ఫాస్ట్ బౌలింగ్ ను ధైర్యంగా ఎదుర్కొంటూ జాన్ స్నో లాంటి పేసర్ల బౌన్సర్లను కూడా హుక్ చేసే తెగువ చూపేవాడతను. అయితే అతను మనకు బాగా గుర్తుండేది సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గానే.  

టీమిండియా సారథ్యం కూడా అతనికి అదృష్టం వల్లనే దక్కింది. 1971 వెస్టిండీస్ పర్యటనకు వెళ్ళే జట్టు కెప్టెన్ ఎంపికకు సెలెక్టర్ల కమిటీ సమావేశమైనప్పుడు ఒక సెలెక్టర్ గైర్హాజరయ్యాడు. ఉన్న నలుగురిలో ఇద్దరు పటౌడీ వైపు, మిగతా ఇద్దరు వాడేకర్ వైపు మొగ్గు చూపారు. కమిటీ చైర్మన్ అయిన విజయ్ మర్చంట్ 'క్యాస్టింగ్ ఓట్ ' వేసి తమ ముంబై ఆటగాడు వాడేకర్‌కు కెప్టెన్సీ దక్కేలా చేశాడు. అలా పటౌడీని దాటుకుని టీం పగ్గాలు చేపట్టడతను.  

వెస్టిండీస్‌లో ఐదు టెస్టుల సీరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకుని సంచలనం రేపాడు వాడేకర్. అప్పటివరకు వెస్టిండీస్‌తో ఆడిన ఐదు సీరీసుల్లోనూ ఇండియా ఓడిపోయింది. సీరీస్‌లే కాదు, 1971 టూర్‌కు ముందు విండీస్‌పై ఒక్క టెస్టు కూడా గెలిచింది లేదు. కానీ మన లక్కీ కెప్టెన్ చరిత్ర తిరగరాశాడు.అప్పుడే జట్టులోకి వచ్చిన సునిల్ గవాస్కర్ (774 పరుగులు), దిలిప్ సర్దేశాయ్(టీవీ జర్నలిస్టు రాజ్‌దీప్ తండ్రి) బ్యాటింగ్ ప్రతిభ వాడేకర్‌కు ఆ టూర్‌లో కలిసొచ్చింది. అంతే కాక అప్పటి విండీస్ జట్టులో సరైన ఫాస్ట్ బౌలర్లు లేకపోవడం కూడా మనకు అనుకూలించింది.  1971 లోనే మన మాజీ పాలకులు ఇంగ్లండ్‌ను వారి గడ్డ పైనే ఓడించడం అతని మరో ఘన విజయం. 

ఈ సారి లెగ్ స్పిన్ మాంత్రికుడు భగవత్ చంద్రశేఖర్ విజృంభణ వాడేకర్‌కు ఉపయోగపడింది. 1972-73 లో ఇంగ్లండ్ జట్టు ఇండియా వచ్చి ఆడిన ఐదు టెస్టుల సీరీస్‌ను 2-1 తేడాతో వాడేకర్ సేన గెలుచుకుంది.  స్పిన్ త్రయం బేడి, చంద్ర, ప్రసన్న ఈ విజయంలో ప్రముఖ పాత్ర వహించారు. భారత జట్టు అలా మూడు వరస సీరీస్ విజయాలు సాధించడం మునుపెన్నడూ జరగలేదు. ఇంగ్లండ్, వెస్టిండీస్ వంటి దిగ్గజాలను ఓడించడంతో అనధికారికంగా ఇండియానే నంబర్ వన్ జట్టయింది కూడా.   

'సమ్మర్ ఆఫ్ ఫార్టీటూ' అని మనం పిలుచుకునే 1974 ఇంగ్లండ్ పర్యటన టీమిండియాకు పీడకల లాంటిది. ఆడిన మూడు టెస్టుల్లో ఇండియా చిత్తుగా ఓడిపోయింది(రెండింటిలో ఇన్నింగ్స్ తేడాతో). లార్డ్స్ టెస్టులోనైతే రెండొ ఇన్నింగ్స్‌లో 42 కే మన జట్టు ఆలౌట్ అయింది. జట్టులో ఆటగాళ్ళ మధ్య కొట్లాటలతో పాటు ఇంకొన్ని వివాదాస్పద సంఘటనలు ఆ టూర్‌లో చోటు చేసుకున్నాయి. సుధీర్ నాయిక్ ఆనే ఆటగాడు సూపర్ బజార్లో సాక్సు దొంగతనం చేశాడన్న ఆరోపణ, భారత రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేసిన విందుకు టీం లేటుగా వెళ్ళడంతో రాయబారి బి.కె.నెహ్రూ 'గెటౌట్ ' అని ఆటగాళ్లని వెనక్కుపంపడం లాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. హీరో వాడేకర్ హఠాత్తుగా విలన్ లాగ కనబడ్డాడు. అతని కెరీర్‌కు ఆ సీరీస్‌తో తెర పడింది.   

అయితే 1990లో కోచ్‌గా వాడేకర్ మళ్ళీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. మన బౌలర్లకు అనుకూలించే స్పిన్ పిచ్‌లు తయారుచేయించి స్వదేశంలో అప్పటి కెప్టెన్ అజరుద్దీన్ వరస సీరీస్‌లు గెలిచేలా చేశాడు. మొత్తం మీద వాడేకర్‌కు సక్సెస్ మంత్రం ఏదో తెలుసు. అందుకే గొప్ప ప్రతిభావంతుడైన ఆటగాడు కాకున్నా కెప్టెన్‌గా, కోచ్‌గా భారత జట్టుకు విశిష్టమైన సేవలు అందించాడు. లక్ అనుకున్నా, మరొకటి అనుకున్నా, పరాజయాల రొంపిలో కొట్టుమిట్టాడుతున్న భారత క్రికెట్ జట్టుకు విన్నింగ్ హ్యాబిట్ నేర్పించిన ఘనత అతనికే  దక్కుతుంది. 

రచయిత: సిహెచ్. వెంకటేష్ ( ప్రముఖ క్రీడా విశ్లేషకులు)  

(అజిత్ వాడేకర్ ఆగస్టు 15న స్వర్గస్థులయ్యారు)  

 

Follow Us:
Download App:
  • android
  • ios