Asianet News TeluguAsianet News Telugu

శ్రావణమాసం ప్రారంభం

పంచాంగ ప్రకారంగా ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణానక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది. 

Shravana Masam - Shravan (Maas) Month 2020
Author
Hyderabad, First Published Jul 21, 2020, 8:28 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Shravana Masam - Shravan (Maas) Month 2020

శ్రావణమాసము:- ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. శ్రావణమాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. ప్రస్తుతం వాడుకలో ఉన్న గ్రెగొరీయన్ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం జూలై, ఆగష్టు నెలల్లో వచ్చును. వర్షఋతువు మూలంగా విరివిగా వర్షాలు పడతాయి.

పంచాంగ ప్రకారంగా ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణానక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుని ధర్మపత్ని అయిన  శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి  అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. 

శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో అనుకూలమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. గొప్ప పవిత్రమాసం ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు ఉన్నాయి.

శ్రావణమాసంలో పండుగలు:

శ్రావణ శుద్ధ పాడ్యమి    *
శ్రావణ శుద్ధ విదియ    అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి జయంతి.
శ్రావణ శుద్ధ తదియ    *
శ్రావణ శుద్ధ చతుర్థి    నాగుల చవితి
శ్రావణ శుద్ధ పంచమి    గరుడ పంచమి , కల్కి జయంతి 
శ్రావణ శుద్ధ షష్ఠి    *
శ్రావణ శుద్ధ సప్తమి    *
శ్రావణ శుద్ధ అష్ఠమి    *
శ్రావణ శుద్ధ నవమి    *
శ్రావణ శుద్ధ దశమి    *
శ్రావణ శుద్ధ ఏకాదశి    పుత్రదా ( సర్వేషాం) ఏకాదశి
శ్రావణ శుద్ధ ద్వాదశి    వరలక్ష్మి వ్రతం, దామోదర ద్వాదశి. 
శ్రావణ శుద్ధ త్రయోదశి    శని త్రయోదశి 
శ్రావణ శుద్ధ చతుర్దశి    వరాహజయంతి ( స్నేహితుల దినోత్సవం )
శ్రావణ పూర్ణిమ    రాఖీ ( జంధ్యాల ) పూర్ణిమ, హయగ్రీవ జయంతి
శ్రావణ బహుళ పాడ్యమి    *
శ్రావణ బహుళ విదియ    *
శ్రావణ బహుళ తదియ    *
శ్రావణ బహుళ చవితి    సంకటహర చతుర్ధి 
శ్రావణ బహుళ పంచమి    *
శ్రావణ బహుళ షష్ఠి    *
శ్రావణ బహుళ సప్తమి    *
శ్రావణ బహుళ అష్ఠమి    కృష్ణాష్టమి
శ్రావణ బహుళ నవమి    *
శ్రావణ బహుళ దశమి    *
శ్రావణ బహుళ ఏకాదశి    మతత్రయ ఏకాదశి, స్వాతంత్ర్య దినోత్సవం 
శ్రావణ బహుళ ద్వాదశి    *
శ్రావణ బహుళ త్రయోదశి    *
శ్రావణ బహుళ చతుర్దశి    మాసశివరాత్రి
శ్రావణ బహుళ అమావాస్య    పొలాల అమావాస్య

శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లల నుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీశోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.

ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు వర్షఋతువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, ఈ సమయంలో వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట"అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం.

వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి బ్రహ్మ స్వరూపం అర్ధమౌతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది. స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్ర నామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు.

పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకొంటూ ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొంది హృదయానందాన్ని పొందుతారు. "గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున ఏ ఇంట్లో గృహిణులు ఆనందంగా ఉంటారో ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.

ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన రోజు. కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమ రోజు బ్రహ్మచారులు గాని గృహస్థులు గాని శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ( జంధ్యం ) ధారణ అనేది అనాది ఆచారంగా వస్తున్నది. రైతులకు తమ వ్యవసాయ సాగుకు కావలసిన వర్షాలు విస్తారంగా కురిసి వాతవరణంలో మార్పు చెందడం వలన వ్యవసాయ సాగు కార్యములు నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం అందరికీ ఆనందాన్నిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios