Asianet News Telugu

'యోగా' మానవ శరీరంలో పంచకోశాలు

మానవుడు జీవించి వున్నపుడు ఆత్మ (జీవాత్మ) కారణ శరీరంలోనూ, కారణ శరీరం సూక్ష్మ శరీరంలోనూ, సూక్ష్మ శరీరం స్థూల శరీరంలోనూ నిబిడమైయున్నందున ఆత్మ మూడు శరీరాలలోను యున్నదని అర్థమవుతోంది. 

Importance of Yoga
Author
Hyderabad, First Published Jun 22, 2021, 2:56 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ఉల్లిపాయ ఎలా పొరలు పొరలుగా ఆచ్చాదింపబడి ఉంటుందో అలాగే ఆత్మ చుట్టూ పంచకోశాలు అనే పొరలు చేత కప్పబడి ఉంటుంది. అవి ఆత్మకు తెలుసుకోనియక, పైనున్న పొరలతో ఆత్మ తాదాత్మ్యం చెంది ఆకోశములనే తానుగా భావించి దుఖములకు లోనగుచున్నది. ఈ ఆత్మ మానవుడి యందు అయిదు కోశాలచేత ఆవరించబడి ఉంటుంది, అవి... 

1.శరీరం "అన్నమయ కోశం" 

2. జీవశక్తులచేత ఏర్పడిన "ప్రాణమయ కోశం" 

3. మనస్సు "మనోమయ కోశం"

4. బుద్ధి "విజ్ఞాన మయ కోశం" 

5. అజ్ఞానంచేత ఏర్పడిన "ఆనందమయ కోశం" 

పైన చెప్పిన అయిదు కోశములే మనయందు మూడు శరీరాలుగా వ్యవహరింపబడుచున్నవి.

1. స్థూల శరీరం- అనగా అన్నమయ కోశం, 
2. సూక్ష్మశరీరం అనగా ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు. 
3. కారణ శరీరం- అనగా ఆనందమయ కోశం. 

మానవుడు జీవించి వున్నపుడు ఆత్మ (జీవాత్మ) కారణ శరీరంలోనూ, కారణ శరీరం సూక్ష్మ శరీరంలోనూ, సూక్ష్మ శరీరం స్థూల శరీరంలోనూ నిబిడమైయున్నందున ఆత్మ మూడు శరీరాలలోను యున్నదని అర్థమవుతోంది. అయితే మరణమనగా ఏమిటి అని విచారించినపుడు స్థూల శరీరం నుండి సూక్ష్మ, కారణ శరీరాలు వేరుకావడమే. తిరిగి జన్మాంతర ప్రాప్తికి సూక్ష్మశరీరమే కారణమవుతున్నది. అంటే మరణం తరువాత జీవాత్మ ప్రాణం వద్దకు అనగా సూక్ష్మ శరీరంలోని ప్రాణమయకోశం వద్దకు మరణ సమయంలో ఏ మనోభావంతో వుంటుందో అదే మనోభావంతో వస్తుందని ఉపనిషద్వువాచ. 

ఆ విధంగా ఆత్మ(జీవాత్మ) తనకు తగినపుడు పునర్జన్మను పొందుతోంది. మరణం శరీరానికే కాని ఆత్మకు కాదు. జననం మరణానికి ప్రారంభమే తప్ప మరేమి కాదు. పునర్జన్మ లేదంటే తిరిగి మరణించవలసిన అవరంలేదని అర్థం. ఈ విధంగా ప్రాణం యొక్క రాకపోకలను ‘‘పునరపి జననం పునరపి మరణం - పునరపి జననీ జఠరే శయనం’’ అంతఃప్రకృతిని - సత్యం తెలుసుకొన్న ప్రాజ్ఞుడు పునరావృత్తి రహిత కైవల్యాన్ని పొందుతున్నాడని ఉపనిషద్ద్వచనం. కొందరు పెద్దలు మానవ శరీరము సప్తకోశ నిర్మితమని చెప్పియున్నారు. ఇట్టి సప్తకోశములను ఒకదానియందు మరియొకటి అయస్కాంత క్షేత్రమందు అయస్కాంతమున్నట్లు అమర్చబడినవని చెప్పియున్నారు. 

అన్నమయ కోశమునే భౌతిక దేహముగా కొందరు చెప్పియున్నారు. జ్ఞానమయ విజ్ఞానమయ కోశములను విజ్ఞానమయ కోశముగా చెప్పిరి. ఏ విధముగా చెప్పినను ‘నేను’ అను జీవప్రజ్ఞ ఈ కోశముల యందు మేల్కొనినప్పుడు ఆయా కోశములకనుగుణముగా ప్రతి స్పందించుచుండును. ఆవేశమునకు ఆనందమునకు లోనైనప్పుడు ఆనందమయ కోశమునందున్న వాడిగాను వ్యక్తమగుచున్నాడు. జీవప్రజ్ఞ ఏ కోశమునందు ప్రధానముగా మేల్కొనియుండునో ఆ కోశమే మిగిలిన కోశములపై ఆధిపత్యము కలిగియుండును.

1. అన్నమయ కోశము:- ఇది పైకి కనిపించే స్థూల శరీరమే. గింజను పైపొట్టు కప్పి వుంచినట్లు గర్భస్త పిండమును మాయ కప్పి ఉంచినట్లు స్థూల శరీరమైయున్నది.
‘‘అన్నాద్‌భవన్తి భూతాని వర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః’’ (3-14) అని భగవద్గీతలో చెప్పినట్లు అన్నము (ఆహారము) వల్ల ఏర్పడిన మన శరీరము ప్రకాశవంతమైన ఆత్మను కవచం వలె కప్పి వుంచుతుంది. అందువల్ల స్థూల భౌతిక శరీరమే అన్నమయకోశం అనబడుతోంది. యోగాలో మనం శరీరాన్ని అయిదు కోశాలు లేక పొరలుగా చూస్తాము. శరీరం యొక్క మొదటి పొరను అన్నమయ కోశం అని అంటాము, ఇది అన్నశరీరం. మీరు ‘శరీరం’ అని పిలేచేది ఈ పోగుచేసుకున్న ఆహారపు కుప్పనే.

2. ప్రాణమయ కోశము:- ప్రాణ అనగా స్థిరముగా నిరంతరము మన శరీరంలో ప్రవహించే జీవశక్తి. దీనిని ఓజస్సు అని కూడ అనుకోవచ్చు. మన శరీరంలోని 72000 నాడుల ( వీటిలో 14 ముఖ్యమైనవి అందులో పింగళ, ఇడ, సుషుమ్న అతి ముఖ్యమైనవి) ద్వారా ఈ ప్రాణశక్తి శరీరమంతా వ్యాపించి ఉంటుంది. పంచవాయువులు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు) గా పంచ ప్రాణములుగా సంచరిస్తూంటుంది. దీనిని ‘ఆరా’ లేక ‘కీ’ శక్తి అని కూడా అంటారు. మీ భౌతిక, మానసిక శరీరాలు హార్డువేర్, సాఫ్ట్వేర్ లాంటివి. మీరు మీ హార్డువేర్, సాఫ్ట్వేర్‌లను పవర్‌కు అనుసంధానం చేయనంత వరకూ అవి ఏమీ చేయలేవు కదా? అలాగే భౌతిక, మానసిక శరీరాలకు పవర్ లాంటిది ఈ శరీరం. దీనినే ప్రాణమయ కోశం లేదా శక్తి శరీరం అని అంటారు. 

శక్తి శరీరాన్ని సరైన సమతుల్యతతో పూర్తిగా క్రియాశీలంగా ఉంచుకుంటే భౌతిక శరీరంలో కానీ లేక మానసిక శరీరంలో కానీ వ్యాధి అనేదే ఉండదు.
నేను ‘వ్యాధి’ అన్నప్పుడు నేను అంటువ్యాధుల గురించి కాకుండా కేవలం దీర్ఘకాల వ్యాధుల గురించి మాట్లాడుతున్నాను. అంటువ్యాధులు బయటి జీవుల వల్ల కలుగుతాయి కానీ మనుషులు ప్రతీరోజు వారు సొంతంగా రోగాలను సృష్టించుకుంటున్నారు.మన శక్తి శరీరం పూర్తి స్థాయిలో సరైన సమతుల్యతతో పనిచేస్తూ ఉంటే భౌతిక శరీరంలో వ్యాధి నిలువలేదు. ఎటువంటి వ్యాధి ఉన్నా దానికి కారణం శక్తి అది పని చేయాల్సిన తీరులో పని చేయకం పోవటమే.

కేవలం కొన్ని సులువైన యోగా సాధనలు చేయటం వల్ల  భౌతిక, మానసిక సమస్యల నుంచి విముక్తి పొందిన వాళ్ళను చూడగలము. అయితే ఈ సాధనలు వ్యాధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించినవి కావు. కానీ ఈ సాధనల ద్వారా మన శక్తి శరీరాన్ని పూర్తి స్థాయిలో సమతుల్యతతో పనిచేసేలా చేయవచ్చు.


3. మనోమయ కోశం:- పంచ జ్ఞానేంద్రియములు, మనసు. ఇది ప్రాణమయ కోశమునకు లోపల ఉండి దుఃఖమోదాది అరిషడ్వర్గములు లేని ఆత్మను అవి ఉన్నట్టు కప్పి ఉంచును. ఈ కోశము సూక్ష్మమైనది. ఇది భౌతిక శరీరానికి జ్ఞానవంతమైన ఆత్మకు మధ్య ఉంటుంది. ఈ పొరను మనోమయ కోశం అని అంటారు, ఇది మానసిక శరీరం. మన మనస్సులో ఏమి జరుగుతుందో అది మన శరీరంలో కూడా జరుగుతుంది అని. ఇది ఇలా ఎందుకు జరుగుతుందంటే మన ‘మనస్సు’ అని పిలేచేది మరెక్కడో ఉన్న ఒక ప్రదేశం కాదు. ప్రతీ అణువుకు దాని సొంత మేధస్సు ఉంటుంది. అలా ఒక సంపూర్ణమైన మానసిక శరీరం కూడా ఉంటుంది.

మన మానసిక శరీరంలో ఏమి జరిగినా అది మీ భౌతిక శరీరంలో జరుగుతుంది, మన భౌతిక శరీరంలో ఏమి జరిగినా అది మానసిక శరీరంలో కూడా జరుగుతుంది. మనస్సు స్థాయిలో ఎటువంటి హెచ్చుతగ్గులు ఉన్నా దానికి ఒక రసాయనిక ప్రతిచర్య ఉంటుంది, అలాగే ప్రతీ రసాయనిక ప్రతిచర్య కూడా మన మనస్సులో హెచ్చుతగ్గులను సృష్టిస్తుంది. దీని వల్లనే ఎన్నో సైకోసోమాటిక్ వ్యాధులు అభివ్యక్తం అవుతున్నాయి.

శరీరం యొక్క ఈ మూడు పార్శ్వాలు – అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం – ఇవ్వన్ని భౌతిక అస్థిత్వం కలిగినవి. 

* ఉదాహరణకు ఒక లైట్ బల్బ్ తీసుకుందాము అది భౌతికమైనదే. దాని వెనకనున్న ఎలక్ట్రిసిటీ కూడా భౌతికమైనదే కానీ కొంచం సూక్ష్మమైనది. మనం దాన్ని చూడలేము కానీ మన వేళ్ళు లైట్ సాకెట్లో పెడితే అది ఉందని తెలుసుకోవచ్చనుకోండి! ఆ లైట్ నుంచి వెలువడే వెలుగు కూడా భౌతికమైనదే కానీ అది మరింత సూక్ష్మమైనది. ఆ బల్బ్, ఎలక్ట్రిసిటీ,  వెలుగు ఈ మూడు కూడా భౌతికమైనవే. ఒకటి మన చేతిలో పట్టుకోగలరు, మరొకటి అనుభూతి చెందగలరు, మరొకటి కళ్ళ వంటి మరింత సున్నితమైన గ్రాహకంతో మనం చూడవచ్చును. మనం ఇవ్వనీ అనుభూతి చెందగలం. ఎందుకంటే మనం వీటిని అనుభూతి చెందటానికి అవసరమైన ఇంద్రియ జ్ఞానం ఉంది. భౌతికాతీతం అయిన వాటిని అనుభూతి చెందటానికి మనకు కావలిసిన ఇంద్రియ జ్ఞానం లేదు.


4. విజ్ఞానమయ కోశము:- ఇది పంచ జ్ఞానేంద్రియములు మరియు బుద్ధికలిసి ఏర్పడుతుంది. నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను అనే (అహం+భావం) నేను అనే భావన కలిగించి తెలియనట్టి ఆత్మను తెలియబరిచే దానిగా ఆవరించి ఉంటుంది. అట్టి విజ్ఞానంవల్ల ఏర్పడింది కాబట్టి విజ్ఞానమయకోశమన్నారు. ఈ పొరనే విజ్ఞానమయ కోశం అని అంటారు. విజ్ఞానమయ కోశం ఒక అనుసంధాన స్థితి. ఇది భౌతికమైనదీ కాదు, భౌతికాతీతమైనది కూడా కాదు, ఇది ఈ రెండింటి మధ్య ఉండే ఒక కనెక్షన్ లాంటిది. ఇది ఇప్పుడు మనమున్న స్థాయిలోని అనుభవం కాదు ఎందుకంటే మన అనుభవాలు పంచేంద్రియాలకు పరిమితమైనది.

5. ఆనందమయ కోశము:- ఆత్మ సుఖ దుఃఖములు, ప్రియాప్రియములు మొదలగు ద్వంద్వాలకతీతముగా ఉంటుంది. ఆ ఆత్మను అవన్నీకల దానివిగా భ్రమింపచేస్తుంది. అందువల్ల దీన్ని ఆనందమయ కోశమన్నారు. ఇది భౌతికాతీతమైనది. దీనికి భౌతిక పార్శ్వాలతో ఏ పని లేదు. భౌతికాతీతమైన పార్శ్వాన్ని మనం వర్ణించలేము, కనుక దాన్ని మనం అనుభూతిపరంగా మాట్లాడతాము. భౌతికాతీతమైన దానీతో ఎప్పుడు మనం సంబంధం కలిగి ఉంటామో మనకు ఆధారభూతమైన దానితో మనం ఎప్పుడు అందుబాటులో ఉంటామో అప్పుడు మనం పరమానందంగా మారుతాము. 

మన అనుభవానికి సంకేతంగా మనం దాన్ని ఆనందమయ దేహం అని అంటాము. వర్ణించలేని, నిర్వచించలేని భౌతికాతీతమైన ఈ పార్శ్వాన్ని మనం తాకినప్పుడు మనలో పరమానందం ఉప్పొంగుతుంది. అందువల్లనే దాన్ని ఆనందమయ దేహంగా పిలుస్తారు. ఇలా మన శరీరంలో అయిదు కోశాలు ఉన్నాయి. భౌతిక, మానసిక, శక్తి దేహాలైన అన్నమయ, మనోమయ, ప్రాణమయ కోశాలు కచ్చితమైన అనుసంధానమై ఉన్నప్పుడు మనకు ఆనందమయ కోశం అందుబాటులోకి వస్తుంది.

బాహ్య పరిస్థితుల విషయానికి వస్తే మనలో ప్రతి ఒక్కరి సామర్ధ్యం వేర్వేరుగా ఉంటుంది. ఒకరు ఏమి చేయగలరో మరొకరు అది చేయలేకపోవచ్చు కానీ మన  అంతర్గత వాస్తవాలకు వచ్చేటప్పటికి అందరూ సమానమైన సామర్ధ్యం కలిగినవాళ్ళే. ప్రతీ మనిషి తమ జీవితాన్ని ఆనందమయం చేసుకోగలడు. పాడగలరా, డాన్స్ చేయగలరా, పర్వతాలను అధిరోహించగలరా లేక డబ్బు సంపాదించగలరా అనేది మనం కచ్చితంగా చెప్పలేము. కానీ మన జీవితానుభవాన్ని ఒక ఆనందమయ అనుభూతిగా అత్యంత ఆహ్లాదకరంగా చేసుకోవాలని మీరు కోరుకుంటే ఎవ్వరూ కాదనలేరు. అప్పుడు మీ జీవిత ప్రయాణం ఏ మాత్రం శ్రమలేకుండా పూర్తి సామర్ధ్యంతో ఎటువంటి ప్రయాస లేక ఒత్తిడి లేకుండా సాగిపోతుంది. ఆత్మ అన్నివేళలా ఉంది, ఆత్మ ఎప్పుడూ సచ్చితానంద స్వరూపమే.

Follow Us:
Download App:
  • android
  • ios