వరకట్నదాహానికి మరో అబలబలైంది. భర్తతో ఏడడుగులు నడిచిన ఆమె కనీసం ఏడు నెలలు కూడా కాపురం చెయ్యకుండానే అర్ధాంతరంగా బలవన్మరణానికి పాల్పడింది. ఫోన్ చేసిన ప్రతీసారి భర్త కట్నం కోసమే మాట్లాడుతున్నాడే తప్ప ఏనాడు ప్రేమగా మాట్లాడటం లేదని మానసికంగా కృంగిపోయిన ఆ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది. 

పారిస్ ఎప్పుడు తీసుకెళ్తారని అడగ్గా వరకట్నం గురించి నిలదీయడంతో భరించలేని ఆ ఇల్లాలు భర్తతో వీడియో కాల్ మాట్లాడుతూనే ఉరివేసుకుంది. ఎన్ ఆర్ ఐను పెళ్లి చేసుకుంటే తమ కూతురు సంతోషంగా ఉంటుందని భావించిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. అందరి కంట కన్నీరు పెట్టిస్తున్న ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే అమలాపురం పట్టణం విద్యుత్ నగర్ కు చెందిన రావూరి వెంకటేశ్వరరావుకు  భర్తతో వీడియో కాల్‌ మాట్లాడుతూనే, ఆమె ఉరి వేసుకొంది. బాధితురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం విద్యుత్‌నగర్‌కు చెందిన రావూరి వెంకటేశ్వరరావు కుమార్తె అరుణాదేవికి(24) యానాంకు చెందిన కామిశెట్టి వెంకటపెరుమాళ్లుతో ఈ ఏడాది మే 5న వివాహం జరిగింది.

పారిస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా వెంకట పెరుమాళ్లు పనిచేస్తుండటంతో పెళ్లి సమయంలో భారీగానే కట్నకానుకలు ముట్టచెప్పారు. 15 కాసులు బంగారం, కిలో వెండితోపాటు 2 లక్షల రూపాయలు ముట్టచెప్పారు. పెళ్లైన తర్వాత అరుణాదేవి అత్తవారింట కేవలం నెలరోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత అరుణను ఆమె పుట్టింటి వద్ద వదిలేసి వెంకట పెరుమాళ్లు ఆయన కుటుంబం పారిస్ వెళ్లిపోయింది. 

పారిస్ వెళ్లి రెండు నెలలు పూర్తవుతుండటంతో తనను ఎప్పుడు పారిస్ తీసుకెళ్తారని అరుణాదేవి భర్తను అడిగింది. ఎప్పుడు అడిగినా 20 సెంట్ల భూమిని తన పేరిట రిజిస్టర్‌ చేసి, 10 లక్షల రూపాయలు అదనపు కట్నం ఇస్తేనే తీసుకెళతానని పెరుమాళ్లు తెగేసిచెప్పాడు. పెరుమాళ్లు డిమాండ్ తో తల్లడిల్లిన అరుణ తన తండ్రికి చెప్పింది. అరుణ తండ్రి వెంకటేశ్వరరావు అల్లుడి వచ్చే సంక్రాంతి నాటికి అడిగినవన్నీ ఇస్తామని నచ్చచెప్పారు.

హామీ ఇచ్చినా నమ్మని పెరుమాళ్లు  అరుణకు ఫోన్‌ చేసి వేధింపులకు గురిచేస్తూనే ఉన్నాడు. బుధవారం ఉదయం పెరుమాళ్లు మళ్లీ అరుణాదేవికి ఫోన్ చేశాడు. సుమారు అరగంట సేపు అరుణ వీడియోకాల్‌ లో మాట్లాడింది. పెరుమాళ్లు అదనపు కట్నంపై గట్టిగా నిలదీశాడు. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన అరుణ భర్తతో వీడియోకాల్‌ మాట్లాడుతూనే తన ఇంట్లో ఉరి వేసుకొంది.

అరుణాదేవి ఉరివేసుకుంటున్నట్లు వీడియో కాల్ లో చూసిన పెరుమాళ్లు తల్లి చిన్న అమ్మాజీ అరుణ సోదరి సాయిసుమకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. సాయిసుమ ఇంటికి వచ్చేసరికి అరుణ ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. స్థానికుల సహాయంతో ఆమెను అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ అర్థరాత్రి మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

పారిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం..పెళ్లి చేస్తే తమ కూతురు సుఖంగానే ఉంటుందని ఆశపడ్డామని కానీ తమ అల్లుడు ఇంతలా వేధింపులకు పాల్పడతారని ఊహించలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ముద్దూముచ్చట తీరకుండానే తమ బిడ్డను వదిలేసిపోతాడని అనుకోలేదని తీరా విషయం తెలిసేసరికి వారి కుమార్తె శాశ్వతంగా దూరమైందని కన్నీటి పర్యంతమయ్యారు.