ఇది పక్కా.. స్పౌజెస్‌కు నో జాబ్స్: వైట్‌హౌస్‌కు‘హెచ్1బీ’సవరణలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను తలచిందే చేస్తున్నారు. ఫస్ట్ అమెరికన్ నినాదంతో తొలుత హెచ్1 బీ వీసాల జారీలో నిబంధనలను కఠినతరం చేసిన ట్రంప్.. తాజాగా వారి జీవిత భాగస్వాములకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ గత ఒబామా సర్కార్ తీసుకున్న నిర్ణయానికి చరమగీతం పాడేందుకు సిద్ధమయ్యారు. దీనివల్ల జీవిత భాగస్వాములకు ఉద్యోగాలు లేక ప్రవాస భారతీయులే 90 శాతం మంది ఇబ్బందుల్లో పడటం పక్కా.. కాకపోతే మరో కొన్ని నెలల టైం పడుతుందంతే.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో పనిచేసే విదేశీ నిపుణులకు జారీచేస్తున్న హెచ్1-బీ వీసా జారీ ప్రక్రియలో సవరించిన నిబంధనలు వైట్‌హౌస్‌కు చేరుకున్నాయి. అమెరికాలో హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ఇకపై ఉద్యోగం చేసుకునేందుకు వీలులేకుండా వీటిని రూపొందించారు.
వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఫర్ బడ్జెట్‌కు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సమర్పించిన ఈ ప్రతిపాదనలతో 90,000 మంది విదేశీయులు అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశాన్ని కోల్పోనున్నారు. ఇలా నష్టపోయే వారిలో భారతీయులే అత్యధికమని అధికారులు అంటున్నారు.
హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాముల ఉద్యోగాలపై నిషేధం విధిస్తున్న ఈ నిబంధనలు అమల్లోకి రావడానికి మరింత కొంత సమయం పడుతుందని ఓ వైట్‌హౌస్ ఉన్నతాధికారి తెలిపారు. తొలుత ఈ ప్రతిపాదనలపై శ్వేతసౌధం సమీక్ష నిర్వహిస్తుందనీ, వేర్వేరు ప్రభుత్వ విభాగాలతో పాటు సంస్థల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తుందని అన్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చని పేర్కొన్నారు.
ఓసారి ఈ ప్రక్రియ పూర్తయ్యాక కొత్త హెచ్1-బీ నిబంధనలకు వైట్‌హౌస్ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాతే నిబంధనలను ఫెడరల్ రిజిస్టర్‌లో 30 రోజుల గడువుతో పబ్లిష్ చేస్తారు. ఈ గడువు ముగిశాక నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపారు.
హెచ్1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న జీవిత భాగస్వాములు అమెరికాలో చట్టబద్ధంగా పని చేసుకోవడానికి 2015లో ఒబామా ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. విదేశీ నిపుణుల జీవిత భాగస్వాములకు కూడా పని చేసుకునే అవకాశం కల్పిస్తే వాళ్లంతా అమెరికాలోనే ఉంటారన్న ఉద్దేశంతో ఒబామా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దీనివల్ల అందరికంటే ఎక్కువగా భారతీయులే లబ్ధి పొందారు. అమెరికా ప్రభుత్వం జారీచేసిన హెచ్-4 వీసాల్లో 93 శాతం భారతీయులే దక్కించుకున్నారు. విదేశీయులు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనీ, తాను అధ్యక్షుడినైతే హెచ్1బీ వీసా నిబంధనల్ని సవరిస్తానని 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వాగ్గానం చేశారు.
ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ నేతలతో పాటు టెక్నాలజీ దిగ్గజాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ హెచ్1బీ నిబంధనల విషయంలో ట్రంప్ మొండిగా ముందుకు వెళుతున్నారు.దీన్ని భారత సంతతికి చెందిన ప్రజాప్రతినిధులు, పలు సంఘాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. తాజా ప్రతిపాదనల వల్ల ఇకపై హెచ్-1బీ వీసాదారుల కుటుంబాల్లో ఒకరు మాత్రమే ఉద్యోగం చేసేందుకు వీలుంటుంది. దీంతో ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి.
హెచ్1-బీ జీవిత భాగస్వాముల్ని ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించాలని సెనెటర్ కమలా హారిస్ సహా పలువురు చట్టసభ్యులు, సిలికాన్ వ్యాలీ కంపెనీలు ట్రంప్‌ను కోరుతున్నాయి. లేదంటే నిపుణులను కోల్పోతామని ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ‘సేవ్ జాబ్స్ అమెరికా’ సంస్థ వాషింగ్టన్‌లోని యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో పిటిషన్ వేసింది.
కాగా, ఇటీవల అమెరికా పాక్షిక షట్‌డౌన్ నేపథ్యంలో ఈ కేసు విచారణ ప్రక్రియను కోర్టు నెల పాటు వాయిదా వేసింది. తాజాగా అమెరికా ప్రభుత్వ నిర్ణయాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం కోర్టుకు తెలపనుంది. ప్రస్తుతం అమెరికాలో 4,19,637 మంది విదేశీ నిపుణులు హెచ్1-బీ వీసాపై పని చేస్తుండగా, వీరిలో 3,09,986 మంది ఇండియన్లే ఉన్నారు.