హెచ్1బీ ఉద్యోగులకు తక్కువ వేతనాలు... కంపెనీకి జరిమానా
భారత్, ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులైతే తక్కువ జీతాలకే పని చేస్తారన్న ఉద్దేశంతో అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన ఐటీ కంపెనీ పీపుల్ టెక్ గ్రూప్ సంస్థ హెచ్1బీ నిబంధనల్ని అతిక్రమించింది.
భారత్, ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులైతే తక్కువ జీతాలకే పని చేస్తారన్న ఉద్దేశంతో అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన ఐటీ కంపెనీ పీపుల్ టెక్ గ్రూప్ సంస్థ హెచ్1బీ నిబంధనల్ని అతిక్రమించింది. అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు తక్కువ జీతాలు ఇచ్చింది. కాగా... దీనిపై కంపెనీకి జరిమానా విధించగా... ఉద్యోగులకు పెనాల్టీ కింద 1.1మిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించనున్నట్లు తాజాగా ఆ కంపెనీ ప్రకటించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే... హెచ్ 1బీ వీసా నిబంధనలను అతిక్రమిస్తూ... పీపుల్ టెక్ గ్రూప్ కంపెనీ హెచ్1–బీ ప్రోగ్రామ్ అనలిస్ట్‌లకు అతి తక్కువ వేతనాలు ఇచ్చి ఉద్యోగాల్లో నియమించింది.అమెరికాలోని లేబర్ చట్టాలను అతిక్రమిస్తూ ఆ ఉద్యోగులకు చాలా కాలంగా ఆ ఐటీ కంపెనీ అతి తక్కువ జీతాలను ఇస్తోంది దీనిపై విచారణ జరిపిన అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ వేజ్ అండ్ అవర్ డివిజన్ (డబ్ల్యూహెచ్‌డీ) హెచ్–1 బీ వీసా కార్యక్రమానికి సంబంధించిన నిబంధనల్ని ఆ కంపెనీ ఉల్లంఘించిందని తేల్చింది.
తమ కంపెనీ ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన జీతం కంటే చాలా తక్కువగా ఇస్తోందని లేబర్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. పీపుల్ టెక్ గ్రూప్‌కి బెంగుళూరు, హైదరాబాద్‌లో కూడా శాఖలు ఉన్నాయి. హెచ్–1బీ కంప్యూటర్ అనలిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామ్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు ఒక అనుభవం కలిగిన ఉద్యోగి కంటే ఎక్కువ పని చేయించుకుంటూ తక్కువ వేతనం ఇవ్వడం చట్టవ్యతిరేకం అంటూ ఆ ప్రకటన పేర్కొంది.
‘హెచ్1బీ ఫారెన్ లేబర్ సర్టిఫికేషన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అమెరికా ఉద్యోగులకి కొరత ఏర్పడితే అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునే అవకాశం అమెరికా కంపెనీలకు వస్తుంది.అలాగని వాళ్లకు తక్కువ జీతం ఇవ్వడమంటే చట్ట వ్యతిరేకం. అమెరికా స్థానికుల ప్రయోజనాల కోసమే మేము పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం‘ అని లేబర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.
ఈ మేరకు కంపెనీకి నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో... కంపెనీ దిగి వచ్చింది. తమ కంపెనీలో తక్కువ జీతాలు అందుకుంటున్న 600 మంది హెచ్ 1 బీ వీసాదారులకు 1.1 మిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించనున్నట్లు చెప్పింది. ఇక నుంచి జీతాలు కూడా పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ 600 మందిలో కొందరు భారతీయులు కూడా ఉండటం గమనార్హం.