మెరిట్ కం నైపుణ్యం ఉంటేనే గ్రీన్ కార్డు.. ఇదీ ట్రంప్ న్యూ పాలసీ
పాతకాలం నాటి, లాబీయింగ్ విధానాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుల్ స్టాప్ పెట్టనున్నారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న గ్రీన్ కార్డు విధానానికి స్వస్తి పలికి ప్రతిభ ఆధారిత నిపుణులకు మాత్రమే గ్రీన్ కార్డు జారీ చేయనున్నారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ నిపుణులకు ఏటా ఇచ్చే గ్రీన్ కార్డులపై విధానాన్ని ప్రకటించారు. ఉన్నత విద్యా కోర్సులతోపాటు భాషా నైపుణ్యం కూడా గ్రీన్ కార్డు పొందడంలో కీలకం కానున్నాయని తెలిపారు.
గ్రీన్ కార్డు విధానంలో గణనీయ మార్పులు తీసుకొచ్చిన ట్రంప్.. కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డుల జారీ పద్దతిని నాటకీయంగా మార్చేశారు. కుటుంబ పర గ్రీన్ కార్డుల జారీకి బదులు మెరిట్ ఆధారిత పాయింట్ల ప్రాతిపదికన గ్రీన్ కార్డులు జారీ చేస్తామని ట్రంప్ తేల్చేశారు.
అమెరికాకు వచ్చే వారు ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. సీనియర్ అధికారులు, రిపబ్లికన్ల సమక్షంలో రోజ్ గార్డెన్ గ్యాథరింగ్‌లో గ్రీన్ కార్డు పాలసీ ప్రకటించిన ట్రంప్.. సరిహద్దు భద్రతకు పెద్దపీట వేసి, ఆశ్రయ నిబంధనలను కఠినతరం చేశారు.
దీనిపై ట్రంప్ ప్రకటన చేయకముందే అమెరికా మీడియాలో విస్త్రుత స్థాయిలో చర్చ జరిగింది. ఇప్పటివరకు నైపుణ్యం ఆధారంగా ‘హెచ్1-బీ’ వీసా పొందిన వారిలో 12 శాతం మంది గ్రీన్ కార్డు అందుకోనున్నారు. ఇప్పటివరకు 66 శాతం కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డులు జారీ అయ్యేవి.
నూతన ప్రతిపాదన ప్రకారం నైపుణ్యం ఆధారిత గ్రీన్ కార్డులు 57 శాతం జారీ కానున్నాయి. అప్లికెంట్ల విద్య, అనుభవం, వయస్సు, యువతరానికి అధిక పాయింట్లు, ఇంగ్లీష్ భాషా నైపుణ్యం కీలకం కానున్నాయి. దీనికి తోడు గ్రీన్ కార్డు కావాలనుకునే వారు తప్పనిసరిగా ‘సివిక్స్ (పౌరశాస్త్రం)’ పాస్ కావాల్సి ఉంటుంది.
‘బిల్డ్ అమెరికా’ వీసాలు మాత్రమే జారీ చేస్తామని ప్రకటించారు. కానీ పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఇకనుంచి మానవత్వ కోణంలో జారీ చేసే గ్రీన్ కార్డులు 10 శాతానికి పరిమితం చేయనున్నారు. ప్రస్తుతం లాటరీ ద్వారా 50 వేల మందికి అండర్ రిప్రెంజెంటెడ్ గ్రూపులకు ఏటా గ్రీన్ కార్డులు జారీ చేశారు.
తాజా ప్రతిపాదనలు చట్టంగా మారితే ఇండో అమెరికన్లపై గణనీయ ప్రభావం పడుతుంది. హెచ్1- బీ వీసా పొందిన వారిలో 70 శాతం మంది ఇండియ్లే. వీరిలో చాలా మంది గ్రీన్ కార్డులు పొందుతారు. 2015-17 మధ్య ఏటా 57,000-62000 మంది ఇండియన్లు గ్రీన్ కార్డులు పొందారు.
ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే లక్షల మంది అమెరికన్లు, హెచ్1 బీ వీసా పొందిన విదేశీయులు తమ తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ఎక్కువ కాలం అమెరికాలో జీవించలేరు. 2020 దేశాధ్యక్ష ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రతిపాదనను ట్రంప్ తీసుకొచ్చారని తెలుస్తోంది.
అయితే అమెరికాలో దశాబ్ధ కాలానికి పైగా శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ ప్రకటించిన నూతన గ్రీన్ కార్డు పాలసీ గుడ్ న్యూస్ కానున్నది.
ప్రస్తుతం 66శాతం కుటుంబ సంబంధాలు ద్వారా ( గ్రీన్‌కార్డు పొందిన వారు తమ కుటుంబ సభ్యులను, పెళ్లికాని అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములను స్పాన్సర్ చేయడం) 12 శాతం మాత్రమే నైపుణ్యం ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు.
ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఆలోచన నూతన గ్రీన్ కార్డు విధానం రూపుదిద్దుకున్నదని తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న విదేశీయులను వివాహం చేసుకునే వారికి 60 శాతం, వేర్వేరు రంగాల్లో నిపుణులైన వారికి 12 శాతం గ్రీన్‌కార్డులు జారీ చేస్తున్నారు.
కొత్త విధానంలో 100 శాతం గ్రీన్ కార్డులు నైపుణ్యం ఆధారంగానే ఇవ్వనున్నారు. అదే జరిగితే భారత్ నుంచి అమెరికాకు వెళ్లేవారు, అక్కడ హెచ్1బీ వీసాలపై ఉన్నవారికి త్వరితగతిన గ్రీన్‌కార్డులు లభించే అవకాశం దక్కనుంది.