అమెరికాలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. 

అమెరికాలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరిది వికారాబాద్‌ జిల్లా తాండూరు కాగా, మరొకరిది హన్మకొండ. వివరాలు.. తెలంగాణలోని హన్మకొండ నక్కలగుట్ట ప్రాంతానికి చెందిన జనార్దన్, ఝాన్సీ లక్ష్మిల కుమారుడు ఉత్తేజ్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. తాండూరుకు చెందిన కేళిగారి వెంకటేశం కుమారుడు శివదత్తా కూడా ఎంఎస్‌ చేసేందుకు యూఎస్ వెళ్లాడు. ఇద్దరూ అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో ఎంఎస్ చదవుతున్నారు. 

అయితే వీకెండ్‌లో వీరిద్దరు స్నేహితులతో సరదాగా బయటకు వెళ్లారు. అయితే ఓజార్క్స్ సరస్సు వద్ద ఈత కొట్టే సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు నీటిలో మునిగిపోయారు. స్థానిక కాలమాన ప్రకారం శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మిస్సోరీ స్టేట్ హైవే పెట్రోల్ వాటర్ డివిజన్ శనివారం సాయంత్రం 4 గంటల తర్వాత ఒక వ్యక్తిని బయటకు తీశారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు ప్రకటించారు. ఆదివారం ఉదయం 9 గంటల తర్వాత రెండో మృతదేహం లభ్యమైంది. 

ఈ వార్త తెలియడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన పిల్లలు ఇలా విగతజీవులుగా మారడంతో.. ఇరువురి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలు త్వరగా స్వదేశానికి చేర్చాలని కోరుతున్నారు.