హెచ్ 1 బీ వీసాదారులకు ఊరట
హెచ్ 1బీ వీసాదారులు అమెరికాలో ఉద్యోగాలకు తిరిగి వస్తే వీసాలు పొందటానికి అవకాశం కల్పిస్తున్నట్టు ఇమ్మిగ్రేషన్ అటార్నీ గ్రెగ్ సిస్కిండ్ ట్వీట్ చేశారు.
హెచ్ 1 బీ వీసా దారులకు అమెరికా ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చింది. ప్రస్తుతం ఈ వీసాలపై నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ నిషేధం పై కొన్ని షరతులతో కూడా మినహాయింపులను తాజాగా ప్రకటించింది. వీసా నిషేధాన్ని ప్రకటించడానికి ముందున్న ఉద్యోగాలకు తిరిగి వెళ్లే హెచ్1 బీ, ఎల్ 1 వీసాదారులకు అనుమతినిస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఆమోదం తెలిపింది.
వీసాదారులు ఇదివరకు పని చేసిన ఉద్యోగాల్లోనే పని చేయడానికి తిరిగి వస్తే వారికి అనుమతి లభిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విదేశాలలో చిక్కుకున్న హెచ్ 1బీ వీసాదారులు అమెరికాలో ఉద్యోగాలకు తిరిగి వస్తే వీసాలు పొందటానికి అవకాశం కల్పిస్తున్నట్టు ఇమ్మిగ్రేషన్ అటార్నీ గ్రెగ్ సిస్కిండ్ ట్వీట్ చేశారు.
అయితే అది వీసా నిషేధానికి ముందు జరిగినదై ఉండాలన్న షరతు విధించినట్టు తెలిపారు. ప్రాధమిక వీసాదారులతో పాటు డిపెండెంట్లు (జీవిత భాగస్వాములు, పిల్లలు) కూడా అనుమతినిస్తున్నట్టు యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ అడ్వైజరీ తెలిపింది.
గతంలో దేశంలో ఏ కంపెనీకి పని చేశారో.. ఏ స్థాయిలో ఉన్నారో..వారు దేశంలోకి రావచ్చునని పేర్కొది. అలాగే సాంకేతిక నిపుణులు, సీనియర్ స్థాయి మేనేజర్లు ఇలా తమ స్థాయికి తగిన జాబ్స్ చేసినవారికి కూడా మళ్ళీ ఆహ్వానం పలుకుతున్నామని ట్రంప్ ప్రభుత్వం వివరించింది. కరోనా మహమ్మారి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ట్రంప్ ఈ చర్య తీసుకున్నట్టు సమాచారం.